Politics

బుద్ధి మార్చుకోని భార్గవరామ్

బుద్ధి మార్చుకోని భార్గవరామ్

హఫీజ్‌పేట భూముల వ్యవహారంలో ప్రవీణ్‌రావు సోదరులను అపహరించిన కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ రెండోసారి పోలీసులకు చిక్కాడు. పోలీసులకు కరోనా నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించాడని అతనిపై బోయిన్‌పల్లి ఠాణాలో రెండో కేసు నమోదయ్యింది. ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో న్యాయస్థానంలో విచారణకు హాజరయ్యేందుకు ఇష్టం లేని అతను.. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందంటూ పోలీసులను తప్పుదోవ పట్టించాడు. తొలుత నిజమేనని నమ్మిన పోలీస్‌ అధికారులు.. అనంతరం విచారణ చేపట్టి సాక్ష్యాధారాలు సేకరించారు. ఉత్తుత్తి పాజిటివ్‌ రిపోర్టుగా తేల్చారు. నకిలీ ధ్రువపత్రాన్ని ఇచ్చిన గాయత్రి ల్యాబ్‌ లైసెన్స్‌ రద్దు చేయాలంటూ వైద్యారోగ్యశాఖకు లేఖ రాశారు. కోర్టు విచారణకు హాజరు కాలేనంటూ భార్గవరామ్‌ బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌కు గత శనివారం కరోనా పాజిటివ్‌ రిపోర్టును వాట్సాప్‌లో పంపించాడు. న్యాయస్థానంలో ఈ విషయాన్ని వివరించేందుకు ఇన్‌స్పెక్టర్‌ సిద్ధమయ్యారు. సదరు సందేశాన్ని ఉన్నతాధికారులకు పంపించారు. దాన్ని చూసిన ఉన్నతాధికారికి.. అందులో అక్షరాలు, పేర్లలో దిద్దుబాటు ఉందని అనుమానం వచ్చింది. పాజిటివ్‌ రిపోర్టు ఇచ్చిన గాయత్రి ల్యాబ్‌కు వెళ్లమని ఆదేశించారు. పోలీసులు కూకట్‌పల్లిలోని ల్యాబ్‌లో నిర్వాహకులు వినయ్‌, రత్నాకర్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. తాము రూ.1200 తీసుకుని పాజిటివ్‌ రిపోర్టు ఇచ్చామంటూ వివరించారు.