కరోనావైరస్ ( corona virus ) దూకుడు ఆగట్లేదు ! కొత్త కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్లు అంటూ ఒకదాని తర్వాత ఒకటి విరుచుకుపడుతూనే ఉంది. ఇప్పటికే ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్ అని వచ్చి మన వాళ్లని మనకు కాకుండా చేసి వెళ్లింది. ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా వస్తుందనే ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మూడో వేవ్ పిల్లలను ప్రమాదం ముంచెత్తుతుందనే వార్తలు కొన్ని రోజులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. మొదటి వేవ్ వృద్ధులపై ప్రభావం చూపిందని.. రెండో వేవ్‌లో యువకులు బాధితులయ్యారని.. ఇక మూడో వేవ్‌లో ఈ కరోనా రక్కసి చిన్న పిల్లలనే కాటేస్తుందని ఈ మధ్య ప్రచారం ఎక్కువైంది. ఇంతకీ థర్డ్ వేవ్ చిన్న పిల్లలపైనే ప్రభావం చూపుతుందా? ఒకవేళ పిల్లలకు కరోనా సోకితే వారిలో ఇన్ఫెక్షన్ స్థాయి ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
*** పిల్లలపై ప్రభావం తప్పదా?
కరోనా మొదటి వేవ్ వచ్చినప్పుడు ఎక్కువగా వయసు పైబడిన వారు ప్రభావితం అయ్యారని, రెండో వేవ్‌లో యువకులు, మధ్య వయస్కులు వైరస్ బారినపడ్డారని, మూడో వేవ్ వస్తే పిల్లలపైనే ప్రభావం ఉంటుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఒకసారి గణాంకాలను చూస్తే.. మొదటి వేవ్‌లో పదేళ్లలోపు చిన్నారులు 3.28 శాతం మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. అదే రెండో వేవ్‌లో 3.05 శాతం మాత్రమే కొవిడ్ -19 బారిన పడ్డారు. అంటే రెండో వేవ్‌లో వైరస్ సోకిన పిల్లల శాతం తగ్గింది. అదే 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్న వారిని గమనిస్తే ఫస్ట్ వేవ్‌లో 8.03 శాతం మంది.. సెకండ్ వేవ్‌లో 8.57 శాతం మంది కరోనా బాధితులయ్యారు. అంటే రెండో వేవ్‌లో పెరుగుదల 0.54 శాతం మాత్రమే. కాబట్టి ఈ గణాంకాల ప్రకారం చూసుకుంటే.. థర్డ్ వేవ్‌లో చిన్నారులే ప్రభావితం అవుతారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
*** ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
మొదటి వేవ్‌లో వృద్ధులపై, రెండో వేవ్‌లో యువకులపైనే కరోనా వైరస్ ప్రభావం చూపిందని కూడా చెప్పలేం. నిజానికి మొదటి వేవ్‌లో వృద్ధులు ఎక్కువగా వైరస్ బారిన పడ్డారని, రెండో వేవ్‌లో అంతగా ప్రభావం చెందలేదు అనేది ఒకరకంగా వాస్తవమే అని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి వేవ్ చూసిన తర్వాత వయసు పైబడిన వారిపై కుటుంబ సభ్యుల శ్రద్ధ పెరిగింది. కరోనా వ్యాక్సిన్ రాగానే మొదట 65 ఏళ్లకు పైబడిన వారికే టీకాలు వేశారు. ఈ కారణాల వల్ల వయసు పైబడిన వారు సెకండ్ వేవ్‌లో కాస్త తక్కువగా ప్రభావితమయ్యారు. అందుకే అందరూ వ్యాక్సిన్ తీసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే థర్డ్ వేవ్ అంత ప్రమాదకరం కాదని పలువురు వైద్య నిపుణులు, ఆరోగ్య సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
*** పిల్లల్లో కొవిడ్ ఇన్‌ఫెక్షన్ ఎలా ఉండొచ్చు?
పెద్దలతో పోలిస్తే పిల్లల్లో కొవిడ్ తీవ్రత తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. అయితే కొవిడ్-19 అనంతరం వచ్చే దుష్ప్రభవాలు మాత్రం పిల్లల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ ( MIS-C ) వచ్చే ఆస్కారం ఉంది. కరోనా సోకిన తర్వాత రెండు నుంచి 4 వారాలకు కొంతమంది పిల్లల్లో ఇమ్యూన్ డిస్‌రెగ్యులేషన్ ఏర్పడవచ్చని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇమ్యూన్ డిస్‌రెగ్యులేషన్ కారణంగా పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి, ఇతరత్రా ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది. కానీ ఈ సమస్య ఏర్పడే అవకాశాలు చాలా తక్కువ. ఒక పరిశోధన ప్రకారం.. లక్షమంది పిల్లల్లో కేవలం 12 కంటే తక్కువ మందిలోనే ఇమ్యూన్ డిస్‌రెగ్యులేషన్ కనిపించింది. అలా అని పిల్లల విషయంలో నిర్లక్ష్యం తగదు. 18 ఏళ్లు నిండిన వారికే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఒకవేళ 18 ఏళ్లు నిండిన అందరూ టీకా తీసుకుంటే.. అప్పుడు రక్షణ వలయం లేని వారు పిల్లలు మాత్రమే అవుతారు. కాబట్టి వారి విషయంలో అప్రమత్తత చాలా అవసరం.
*** ఈ పిల్లల విషయంలో జాగ్రత్త
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే పిల్లలపై కరోనా తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయ సంబంధిత సమస్యలు, థలసేమియాతో బాధపడే పిల్లలు కరోనా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. క్యాన్సర్ వ్యాధితో బాధపడే, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ తీసుకుంటున్న పిల్లల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఊబకాయం, పోషకాహారలోపం ఉన్న పిల్లల విషయంలోనూ జాగ్రత్త అవసరం.