మహిళా ఎంపీడీవోపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పల్లెప్రగతిలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో శుక్రవారం పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించిన అనంతరం జరిగిన గ్రామసభలో మాట్లాడుతూ.. ఉదయం గంటసేపు, సాయంత్రం గంటసేపు తిరిగేలా పల్లెప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దాలని, మళ్లీ నెల తర్వాత వస్తానని, అప్పటివరకు ఇంకా అందంగా తయారు చేయాలని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌కు సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఉన్నారా అంటూ అడగడంతో ఆమె వచ్చి మంత్రి వెనకాల నిల్చోగానే ‘మేడం నువ్వయితే బాగానే ఊపుతున్నవు కానీ ఈడ ఊపుతలేవు’.. బాగానే పని చేస్తదిలే అంటూ వ్యాఖ్యానించారు. కాగా, మంత్రి వ్యాఖ్యల వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంత్రి స్థాయిలో ఉండి గ్రామసభలో అందరిముందు అవమానపరిచేలా మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
ఎంపీడీవోపై ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు
Related tags :