Sports

నాకు టొక్యో ఒలంపిక్స్ సులువనిపిస్తోంది:సింధు

నాకు ఒలంపిక్స్ సులువనిపిస్తోంది

టోక్యో ఒలింపిక్స్‌లో ‘డ్రా’ను బట్టి చూస్తే తనకు కొంత సులువుగానే అనిపిస్తున్నా… ప్రతీ దశలో పాయింట్ల కోసం పోరాడక తప్పదని భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు వ్యాఖ్యానించింది. గత రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు, ఈసారి స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ‘డ్రా’లో గ్రూప్‌ ‘జె’లో ఉన్న సింధు… చెంగ్‌ గాన్‌ యి (హాంకాంగ్‌), సెనియా పొలికరపోవా (ఇజ్రాయెల్‌)లతో తలపడాల్సి ఉంది. గ్రూప్‌ టాపర్‌గా నిలిచి ముందంజ వేస్తే ఆపై నాకౌట్‌ మ్యాచ్‌లు ఎదురవుతాయి. ‘గ్రూప్‌ దశలో నాకు మెరుగైన ‘డ్రా’ ఎదురైంది. హాంకాంగ్‌ అమ్మాయి బాగానే ఆడుతుంది. అయితే ప్రతీ ఒక్కరు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. నేనూ బాగా ఆడగలనని నమ్ముతున్నా. ప్రతీ మ్యాచ్‌ కీలకమే కాబట్టి తర్వాతి దశ ప్రత్యర్థుల గురించి కాకుండా ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెడతా. ఒలింపిక్స్‌ అంటేనే ప్రతీ పాయింట్‌ కోసం తీవ్రంగా శ్రమించక తప్పదు’ అని సింధు అభిప్రాయపడింది.