తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ఆయన కుటుంబ సభ్యులు తానా సంస్థకు భారీ విరాళాన్ని అందజేశారు. తానా ఆధ్వర్యంలో ప్రవాస చిన్నారులకు, బాలబాలికలకు తెలుగు భాష పాటవాలను నేర్పించే “పాఠశాల” కార్యక్రమ నిర్వహణకు 2లక్షల డాలర్లను తాళ్లూరి కుటుంబ సభ్యుల తరఫున అందజేస్తున్నట్లు జయశేఖర్ TNIతో పేర్కొన్నారు. 2019-21 మధ్య తన హయాంలో నిర్వహించిన వేలాది కార్యక్రమాల నిర్వహణ తనకు సంతృప్తినిచ్చిందని, ప్రవాసుల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకుని ఈ దఫా తానా మహాసభలను నిర్వహించడం లేదని ఆయన పేర్కొన్నారు. తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి హయాంలో తానా మరింత బలోపేతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తపరిచారు.
* భాష, భద్రత ముఖ్యం
తెలుగు భాష, తెలుగువారి భద్రత ఇవి రెండు తనకు ప్రధానమని భాష సేవ గత రెండేళ్లుగా దిగ్విజయంగా నిర్వహించినందున, ప్రవాసుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ దఫా మహాసభలను వాయిదా వేశామని ఆయన పేర్కొన్నారు. తద్వారా తానాకు నిధులు మిగులుతాయని, వీటితో పలు సేవా కార్యక్రమాల విస్ట్ర్తి పెంచేందుకు వీలు కలుగుతుందని జయశేఖర్ వెల్లడించారు. మహాసభలు నిర్వహిస్తేనే అధ్యక్షుడికి అసలైన విజయమనే మాటల్లో వాస్తవం లేదని, ప్రతి తెలుగువాడికి తానాను దగ్గర జేసే కార్యక్రమం ఏదైనా విజయమేనని ఆయన పేర్కొన్నారు. తానా భవిష్యత్తు కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని జయశేఖర్ తెలిపారు.