తెలంగాణలో తెలుగుదేశం ఎందుకు?
తెలంగాణలో తెలుగుదేశం ఖాళీ.
ఎప్పుడో ఖాళీ అయిన ఆ పార్టీకి తెలంగాణలో అస్తిత్వం లేదు.
అలాంటి పార్టీ ఇక్కడ ఎందుకు?
తెలుగుదేశం తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్ రమణ రాజీనామాతో ఈ చర్చ మరోసారి తెరమీదకు వచ్చింది. తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయ చైతన్యం. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు ప్రజల ముంగిటకే పరిపాలన తీసుకెళ్లి మండల వ్యవస్థ ఏర్పాటు చేసి బీసీలకు గుర్తింపు తెచ్చి రాజ్యాధికారాన్ని తెలంగాణలో తెలుగుదేశం కల్పించింది. హైదరాబాద్ అభివృద్ధికి తెలుగుదేశం హయాంలోనే బీజం పడింది అనడంలో సందేహం లేదు. అలాంటి పార్టీ రాష్ట్ర విభజనతో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయాల్సి వస్తోంది.
తెలుగుదేశానికి బలం కార్యకర్తలే! పదవుల కోసం లేక ఇక ఆ పార్టీలో ఉంటే రాజకీయ సమాధి కావలసి వస్తుందన్న ఉద్దేశంతో నేతలే వలసబాట పట్టారు.
తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎమ్మెల్యేలే కాదు మంత్రులు పలువురు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్లే. కొత్తగా పి సి సి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చినవారే.
అందుకే కాంగ్రెస్ తెలుగుదేశం పిసిసి అయిందని తెరాస అంటుంటే అధికార పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కెసిఆర్ పలువురు మంత్రులు తెలుగుదేశం నుంచి వచ్చిన వారు అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు.
సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య అశ్వరావుపేట నుంచి మచ్చా నాగేశ్వరరావు ఈ ఇద్దరూ గత సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. తమను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికని చెబుతూ అధికార పార్టీని వెతుక్కుంటూ అందులోకి వెళ్లిపోయారు. దీంతో అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం జీరో అయింది. పార్టీ మారిన నేతల బాణీ ఇదే.
తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగం కావాలని భావనతో తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుగుదేశంకు రాసిన రాజీనామా లేఖలో ఎల్ రమణ తెలిపారు. ఆయన అధికార పార్టీ తరఫున హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేసే అవకాశం లేకపోలేదు. టిక్కెట్ ఆశే పార్టీ మార్పిడికి కారణం అయ్యుండొచ్చు. ఒకవేళ హూజూరాబాద్ టికెట్ రమణకు దక్కి ఆయన గెలుపొందితే మంత్రి పదవి వచ్చినా ఆశ్చర్యం కాకపోవచ్చు.
కారణం ఏదైనా నేతలు పార్టీని వీడుతున్నారు. నేతలు నిలుపుకోవడమే ఇప్పుడు తెలుగుదేశంకు పెద్ద సవాలు. ప్రస్తుత పరిస్థితి రావడానికి తెలుగుదేశం అధిష్టానము తప్పిదము కూడా ఉంది. పార్టీ అంటే ప్రాణం ఇచ్చే నేతలను నిలబెట్టుకోలేకపోయింది. ఏపీలో అధికారంలో ఉన్న సమయంలోనూ అలాంటి నేతలను నిరాదరణకు గురి చేసింది. పటిష్టమైన నాయకత్వం నిర్మాణము చేసుకోగలిగినప్పుడే తెలంగాణలో తెలుగుదేశం గట్టిగా నిలబడగలదు. కార్యకర్తలను ముందుకు నడిపించే గట్టి చోదకుడు ఇప్పుడు ఆ పార్టీకి తెలంగాణలో అవసరం.