Business

స్విఫ్ట్ కారు ధర పెరిగింది-వాణిజ్యం

స్విఫ్ట్ కారు ధర పెరిగింది-వాణిజ్యం

* దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నాయి. పెంపు పరంపరకు ఆదివారం బ్రేక్ ఇచ్చిన విక్రయ సంస్థలు నేడు మళ్లీ పెట్రోల్‌ ధరలను పెంచాయి. అయితే, దాదాపు రెండు నెలల తర్వాత తొలిసారి డీజిల్‌ ధరను తగ్గించడం విశేషం.లీటర్‌ పెట్రోల్‌పై సోమవారం గరిష్ఠంగా 30 పైసలు పెంచగా.. లీటర్‌ డీజిల్‌పై 16 పైసల వరకు తగ్గించారు. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.19, డీజిల్‌ ధర రూ.89.72గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్‌ రూ.107.20, డీజిల్‌ రూ.97.29కి చేరాయి.పెట్రోలు, డీజిల్‌ మూలధర తక్కువగానే ఉన్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేసే సుంకాలు, పన్నులు ఎక్కువగా ఉండటంతో పెట్రోలు ధర లీటరుకు వంద రూపాయలు దాటగా.. డీజిల్‌ ధర సైతం వందకు చేరువ అవుతోంది. కరోనాతో అన్ని రంగాలూ కుదేలై ప్రజల ఆదాయ స్థాయిలు పడిపోయినా.. కేంద్రం మాత్రం ఈ రెండు ఇంధనాలపై పన్నుల భారాన్ని మరింత పెంచింది. గతేడాది మార్చి వరకూ (2020 మార్చి 14 ముందు) ఉన్న పన్నును పరిశీలిస్తే.. లీటరు డీజిల్‌పై రూ.16 వరకు, పెట్రోలుపై రూ.13 మేర భారం పెరిగింది.

* ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఎత్తున పెట్టుబడులను సమీకరించింది. దేశీయంగా అమెజాన్‌, రిలయన్స్‌, టాటా గ్రూప్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఈ సంస్థ భారత్‌లో కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా తాజాగా పలు సంస్థల నుంచి 3.6 బిలియన్ డాలర్లు(దాదాపు 26.8 వేల కోట్లు) సమీకరించింది. కెనడాకు చెందిన పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్‌(సీపీపీ), సింగపూర్‌ ప్రభుత్వానికి చెందిన సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌(జీఐసీ), సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్‌ 2, ఫ్లాంక్లిన్‌ టెంపుల్టన్‌ తదితర కంపెనీలతో పాటు ఇప్పటికే వాటాలున్న ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీతో కలిపి వాల్‌మార్ట్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడులు పెట్టిన వాటిలో ఉన్నాయి. బయటి సంస్థల నుంచి ఫ్లిప్‌కార్ట్‌ నిధులు సమీకరించడం ఇదే తొలిసారి.

* జీవిత బీమా పాల‌సీదారుడు మ‌ర‌ణించిన‌ప్పుడు క్లెయిమ్ చేసుకునేందుకు నామినీ, వారసుడి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించ‌డం చాలా ముఖ్య‌మైన విష‌యం. బీమా పాలసీని మరణించిన పాలసీదారుని ఆస్తిగా పరిగణిస్తారు. దానిపై చట్టపరమైన వారసులకు హక్కు ఉంటుంది. అయితే, జీవిత బీమాలో బెనిఫీషియ‌ల్ నామినీ అనే ఒక అంశం ఉంది. ఈ నిబంధనను బీమా (సవరణ) చట్టం, 2015లో ప్రవేశపెట్టారు. దీనిప్ర‌కారం జీవిత‌ బీమాలో నామినీకే బీమా పాల‌సీపై మొద‌ట హ‌క్కు ఉంటుంది. ఒక‌వేళ‌ పాల‌సీదారుని కుటుంబ సభ్యుడి (తల్లిదండ్రులు, లేదా జీవిత భాగస్వామి లేదా పిల్లలను) నామినీగా చేస్తే, ఆదాయం ఉద్దేశించిన వ్యక్తికి వెళ్తుంది. చట్టపరమైన వారసులకు డబ్బుపై ఎటువంటి క్లెయిమ్ చేసుకునే వీలూ ఉండదు.

* దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సీఎన్‌జీ కార్ల ధరను భారీగా పెంచింది. దీంతోపాటు స్విఫ్ట్‌ కారు ధరలో మార్పులు చేసింది. ఈ పెంపు అత్యధికంగా రూ.15,000 వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ధరల పెంపు విషయాన్ని ప్రస్తావించింది. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ముడి పదార్థాల ధరలు గణనీయంగా పెరగటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపింది. పెట్రోల్‌ కార్ల ధరలను కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ‘‘మారుతీ సుజుకీ లిమిటెడ్‌ స్విఫ్ట్‌ కారు ధరను పెంచింది. దీంతోపాటు అన్ని మోడళ్ల సీఎన్‌జీ కార్ల రేట్లు కూడా మారాయి. కొత్త లెక్క ప్రకారం దిల్లీలో ఎక్స్‌షోరూమ్‌ ధరలో రూ.15,000 పెంపు ఉంటుంది. ఇది నేటి నుంచే అమల్లోకి వస్తుంది. ఇతరకార్ల ధరల్లో మార్పుల విషయాన్ని పరిశీలిస్తున్నాం. త్వరలోనే వెల్లడిస్తాం’’ అని ఫైలింగ్‌లో పేర్కొంది.