* అధిక వడ్డీకి రిజర్వ్ బ్యాంకు వద్ద రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలం వేసింది.రిజర్వ్ బ్యాంకు వద్ద 1750 కోట్ల సెక్యురిటీ బాండ్లను ఎపీ ప్రభుత్వం వేలం వేసింది.వెయ్యి కోట్లను 7.12 శాతానికి వడ్డీకి, మరో 750 కోట్లను 7.14 శాతం వడ్డీకి సెక్యురిటీ బాండ్ల వేలం వేసింది.గత వారం కూడా ఇదే వడ్డీ రేటుతో సుమారు 4వేల కోట్లను ప్రభుత్వం అప్పుగా తెచ్చింది.ఈ వడ్డీ రేట్లతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతుందని, అధిక వడ్డీ చెల్లిస్తేనే బాండ్ల వేలం జరుగుతుందని ఆర్ధికరంగ నిపుణులు చెబుతున్నారు.
* దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నాయి. పెంపు పరంపరకు ఆదివారం బ్రేక్ ఇచ్చిన విక్రయ సంస్థలు నేడు మళ్లీ పెట్రోల్ ధరలను పెంచాయి. అయితే, దాదాపు రెండు నెలల తర్వాత తొలిసారి డీజిల్ ధరను తగ్గించడం విశేషం.లీటర్ పెట్రోల్‌పై సోమవారం గరిష్ఠంగా 30 పైసలు పెంచగా.. లీటర్ డీజిల్‌పై 16 పైసల వరకు తగ్గించారు. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.19, డీజిల్ ధర రూ.89.72గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ రూ.107.20, డీజిల్ రూ.97.29కి చేరాయి.
* తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అందే అన్ని సేవల ఛార్జీలు పెంపునకు రంగం సిద్ధమైంది. కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారుల నుంచి సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు అందాయి. ఈ రాత్రి నుంచే సవరించిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశముంది. వ్యవసాయేతర భూముల విలువను ఇప్పటి కన్నా గరిష్ఠంగా 50 శాతం పెంచాలని రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఈ క్రమంలో సాగుభూములు గరిష్ఠ, కనిష్ఠ విలువల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. భూముల మార్కెట్ విలువ పెంపుతో పాటు, రిజిస్ట్రేషన్, తత్సంబంధిత 20 రకాల సేవలపై విధించే ఛార్జీలను పెంచనున్నారు. తెలంగాణలో వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తుల విలువ గరిష్ఠంగా 50 శాతం పెరగనుండగా.. ప్రాంతాల వారీ విలువ ఆధారంగా అవి 20 శాతం, 30 శాతం, 40 శాతం మేర పెరగనున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో తదనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. 2020 జనవరిలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సిద్ధం చేసిన నివేదికలోని అంశాలతో పాటు ఏడాదిన్నర వ్యవధిలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రాతిపదికగా చేసుకుని భూముల విలువను నిర్ధారించినట్టు సమాచారం. గతంలో ప్రతిపాదనలు రూపొందించినపుడు ప్రాంతీయ రింగ్‌రోడ్డు మాట లేదు. తాజాగా అది తెరపైకి వచ్చిన క్రమంలో దానికి చేరువలో భూముల మార్కెట్ విలువ భారీగా పెరగటాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. సవరించిన ధరలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
* దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ.. కొవిడ్ కిట్లతో పాటు కీలక ఔషధాల ధరలను తాత్కాలికంగా తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొవిడ్ బాధితుల చికిత్సలో ఉపయోగించే కొన్ని రకాల ఔషధాల తయారీకి కావాల్సిన ముడిపదార్థాల (API) దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయిస్తున్నట్లు వెల్లడించింది. వీటితోపాటు కొవిడ్ టెస్టు కిట్‌ల ముడిపదార్థాల దిగుమతిపై ఇది వర్తిస్తుందని పేర్కొంది. దీంతో బ్లాక్‌ఫంగస్ చికిత్సలో వాడే ఔషధంతోపాటు కొవిడ్ కిట్ల ధరలు మరికొన్ని రోజులపాటు తగ్గే అవకాశం ఉంది.
* సార్వభౌమ పసిడి బాండ్లు జులై 12 నుంచి అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. గ్రాము ధర రూ.4,807 గా నిర్ణయించారు. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ పసిడి బాండ్లు మంచి ఆప్షన్ అయినప్పటికీ.. పెట్టుబడదారులకు అంత మంచి ఆప్షన్ కాకపోవచ్చనేది ఆర్థిక సలహాదారుల అభిప్రాయం. ఇప్పటికే వైవిధ్యమైన కేటాయింపుతో పోర్ట్‌ఫోలియో ఉన్న పెట్టుబడిదారులు ఈ పసిడి బాండ్లను కొనుగోలుచేయకపోవడమే మంచిదని చెబుతున్నారు. వారు గోల్డ్ ఈటీఎఫ్ లేదా గోల్డ్ ఫండ్లను ఎంచుకోవడం తెలివైన నిర్ణయంగా సూచిస్తున్నారు.