Politics

నాతో అన్ని పార్టీల వారు టచ్‌లో ఉన్నారు-తాజావార్తలు

Revanth Reddy Says Other Party Politicians Are In Touch With Him

* తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన కొంతమంది నేతలు తనతో టచ్‌లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్‌లో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం ఉంటుందని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో పీసీసీ అధికార ప్రతినిధులను నియమించనున్నట్లు చెప్పారు. తెదేపా తెలంగాణ మాజీ అధ్యక్షుడు ఎల్‌ రమణకు నాలుగు సార్లు భోజనం పెట్టి.. ఆ తరువాత సీఎం కేసీఆర్ తెరాసలోకి తీసుకున్నారని ఆరోపించారు. ఇవాళ ముగ్గురు నేతలు తనను కలిసి పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారన్నారు. వారిలో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సోదరుడు, నిజమాబాద్‌ మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్; జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్‌ భాజపా జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్‌ ముదిరాజ్; భూపాల్‌పల్లికి చెందిన తెదేపా మాజీ నేత గండ్ర సత్యనారాయణలు ఉన్నట్లు వివరించారు. మూడు వర్గాలకు చెందిన నేతలు పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్‌కు రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని కౌశిక్‌ రెడ్డి చేసిన ఆరోపణలపై రేవంత్‌ రెడ్డి స్పందించారు. ‘‘కౌశిక్‌రెడ్డి చిన్న పిల్లవాడు. ఆ మాటలు అతనివి కావు. సీఎం కేసీఆర్‌ మాట్లాడించినవి. హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించం. తెరాసతో కౌశిక్‌ రెడ్డి టచ్‌లో ఉన్న విషయం నాకు ముందే తెలుసు. హుజూరాబాద్‌లో కౌశిక్‌ రెడ్డికి తెరాస టికెట్ ఇస్తుందని నేను అనుకోవడం లేదు. ప్రస్తుతం హుజూరాబాద్‌లో తెరాసకు సరైన అభ్యర్థి లేనందునే కాంగ్రెస్ పార్టీ నేతకు గాలం వేశారు. నిన్నటి పెట్రోల్‌, డీజిల్‌ పెంపుపై నిరసన కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చింది’’ అని రేవంత్‌ తెలిపారు.

* దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి వెలుగు చూసి ఏడాదిన్నర దాటుతున్నా వైరస్‌ ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో కొందరికి వైరస్‌ మళ్లీ సోకుతున్న (Reinfection) దాఖలాలు కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా వైరస్‌ బారినపడిన తొలి వ్యక్తికి మళ్లీ వైరస్‌ సోకింది. భారత్‌లో కొవిడ్‌-19 సోకిన తొలి వ్యక్తిగా రికార్డుకెక్కిన కేరళ మహిళ, తాజాగా మరోసారి వైరస్‌ బారినపడినట్లు అధికారులు వెల్లడించారు. ‘దేశంలో కరోనా వైరస్‌ సోకిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందిన మహిళ తాజాగా రీ-ఇన్‌ఫెక్షన్‌ బారినపడింది. యాంటీజెన్‌ పరీక్షల్లో నెగటివ్‌ వచ్చినప్పటికీ ఆర్‌టీ-పీసీఆర్‌లో మాత్రం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవు’ అని కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కేజే రీనా వెల్లడించారు. ఉన్నత చదువుల కోసం దిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆమె నమూనాలను పరీక్షించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రస్తుతం వారి ఇంటిలోనే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

* తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖపై ఏపీ సీఎం జగన్‌ సమీక్షించారు. గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్లు, అర్బన్‌ ప్రాంతాలకు సమీపంలోని పల్లెల్లో 1,034 ఆటోలు ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకరించారు. వైఎస్‌ఆర్‌ జలకళ ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైందని.. ఈ ప్రాజెక్టు సమర్థంగా ముందుకు సాగాలన్నారు. బిడ్జిల వద్ద చెక్‌డ్యామ్‌ తరహాలో నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

* తెలంగాణలోని కోర్టుల్లో అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది. సిబ్బంది మొత్తం విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో రోజు విడిచి రోజు సగం మంది సిబ్బంది హాజరవుతున్నారు. ఈనెల 19 నుంచి న్యాయస్థానాల్లో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని నిర్ణయించింది.

* తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని.. చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. వైకాపా అవినీతి నుంచి దృష్టి మరల్చేందుకే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. గుంటూరు జిల్లా చింతలపూడిలో తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను చంద్రబాబు పరామర్శించారు.

* మధ్య మానేరు వెనుక జలాలతో శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌ మరింత శోభాయమానంగా కన్పిస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ట్వీట్‌ చేశారు. దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టుకు అధికారిక జల కూడలిగా అభివర్ణించారు. ఇది పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి ఎంతో ఆస్కారం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోందని వివరించారు.

* తెలంగాణలో పలువురు భాజపా ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఆ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు నిజామాబాద్‌ మాజీ మేయర్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సోదరుడు ధర్మపురి సంజయ్‌, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత ఎర్ర శేఖర్‌, భూపాలపల్లి సీనియర్‌ నాయకుడు గండ్ర సత్యనారాయణ వెల్లడించారు.

* దేశంలో కరోనా వైరస్‌ బారినపడిన తొలి వ్యక్తికి మళ్లీ వైరస్‌ సోకింది. ‘దేశంలో కరోనా వైరస్‌ సోకిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందిన మహిళ తాజాగా రీ-ఇన్‌ఫెక్షన్‌ బారినపడింది. యాంటీజెన్‌ పరీక్షల్లో నెగటివ్‌ వచ్చినప్పటికీ ఆర్‌టీ-పీసీఆర్‌లో మాత్రం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవు’ అని కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కేజే రీనా వెల్లడించారు.

* కరోనా కొత్త రకం డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాలను వేగంగా చుట్టుముడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు. ఇది భౌగోళిక ముప్పుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ కరోనా రకం 104 దేశాలకు వ్యాప్తి చెందిందని చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. వ్యాక్సినేషన్‌లో పురోగతి, అంతర్జాతీయ సానుకూల సంకేతాలు సూచీలను ముందుకు నడిపించాయి. సెన్సెన్స్‌ 397 పాయింట్ల లాభంతో 52,769 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 15,812 వద్ద ముగిసింది.

* ఒలింపిక్స్‌కు సర్వం సిద్ధమైంది! అత్యయిక స్థితిలోనే మంగళవారం ఒలింపిక్స్‌ గ్రామాన్ని తెరిచారు. ఎంతో ఘనంగా జరపాల్సిన ఈ వేడుక కరోనా కారణంగా సాదాసీదాగా మారింది. జులై 23 నుంచి మెగా క్రీడలు ఆరంభమవుతున్న సంగతి తెలిసిందే. క్రీడా గ్రామంలో ప్రతి రోజూ క్రీడాకారులకు కొవిడ్‌ పరీక్షలు చేస్తారు. క్రీడా గ్రామంలో ప్రతి రోజూ క్రీడాకారులకు కొవిడ్‌ పరీక్షలు చేస్తారు. ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు రెండుసార్లు పరీక్షలు ఉంటాయి. టీకా వేయించుకున్నప్పటికీ గ్రామంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి.

* బ్యాంకు పూచీకత్తులపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బ్యాంకు గ్యారంటీల గురించి శాసనసభలో దాచారని విమర్శించారు. ‘‘బ్యాంకు గ్యారంటీలపై ప్రశ్న అడిగితే ఏడాది తర్వాత జవాబు ఇచ్చారు. రూ.25వేల కోట్ల బ్యాంకు గ్యారంటీలను తెలియకుండా దాచారు. బ్యాంకు పూచీకత్తులపైనా అబద్ధాలు చెబుతున్నారు. నా ఆరోపణలపై ప్రభుత్వం సరిగా జవాబు చెప్పలేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టులో ఛాలెంజ్‌ చేశాం. జీవోలో ఒకటుంది.. కోర్టుకు మరో విషయం చెప్పారు. దిల్లీకి లేఖ రాశారని ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి లేఖ రాయలేదు. దిల్లీ చుట్టూ ఎవరు ప్రదక్షిణలు చేస్తున్నారో అందరికీ తెలుసు. తప్పకుండా మేం దిల్లీ వెళ్లి వాస్తవాలు వివరిస్తాం. రాజ్యాంగం చెప్పినట్టు మీరు నడుచుకోవాలి. మీరు చేసిన అప్పులను ఇకనైనా పాదర్శకంగా చెప్పండి. మేం ప్రశ్నించినప్పుడు కనీసం శాసనసభకైనా జవాబు చెప్పాలి. పీఏసీ ఛైర్మన్‌, ప్రతిపక్షం ఎలా ఉండాలో మీరే చెబుతారా?’’ అని పయ్యావుల కేశవ్‌ ప్రశ్నించారు.

* ఫ్రాన్స్‌కు చెందిన యాంటీట్రస్ట్‌ ఏజెన్సీ.. టెక్‌ దిగ్గజం గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. వార్తల ప్రచురణ విషయంలో స్థానిక వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఆదేశాలు ఉల్లంఘించిన నేపథ్యంలో 500 మిలియన్‌ యూరోల ఫైన్‌ వేసింది. భారత కరెన్సీలో ఈ జరిమానా విలువ రూ.4,415 కోట్లు. జరిమానాపై గూగుల్‌ ప్రతినిధులు స్పందించాల్సి ఉంది.

* కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో కేబినెట్‌ కమిటీలను ప్రధాని నరేంద్ర మోదీ పునర్‌వ్యవస్థీకరించారు. కొత్త, పాత మంత్రులతో మార్పులు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తున్న అత్యంత ప్రాధాన్యం ఉండే రాజకీయ వ్యవహారాల కేబినెట్ ఉపసంఘంలో స్మృతి ఇరానీ, భూపేంద్ర యాదవ్‌, వీరేంద్రకుమార్‌, గిరిరాజ్‌సింగ్‌, అర్జున్‌ ముండా, శర్వానంద సోనోవాల్‌, మన్‌సుఖ్‌ మాండవీయకు చోటు దక్కింది.

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. తెదేపా సీనియర్‌ నేత, ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు. ఆడిట్ సంస్థ ప్రశ్నల ఆధారంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారన్నారు. వైకాపా ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అకౌంటింగ్ వ్యవహారాల్లో తప్పిదాలు జరిగాయని పయ్యావుల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బుగ్గన విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. పీఏసీ ఛైర్మన్‌కు అనుమానాలు ఉంటే ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవచ్చన్నారు. సందేహాలు ఉంటే సమావేశం ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని సూచించారు. లేఖలు రాయడం వల్ల ప్రయోజనమేంటో అర్థం కావడం లేదని ఆక్షేపించారు.

* కొందరు జాతకాలను నమ్ముతారు. మరికొందరు.. బాబాలు, జ్యోతిష్యుల చుట్టూ తిరిగి మా దశ ఎప్పుడు తిరుగుతుంది గురూజీ! అని అడిగివే వారు లేకపోలేదు. ఇక అవే నమ్మకాలు అనర్థాలకు దారి తీస్తే సరిగ్గా ఇదే జరుగుతుందనడానికి పుణెలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. అక్కడ నివసించే రఘునాథ్ రాజారామ్‌ ఎమూల్‌(48)కి ఎమ్మెల్యే అవ్వాలని కోరిక. దీంతో బాబాల బాట పడ్డాడు. ఇక ఆ బాబా.. నీ భార్యని వదిలిస్తే..కచ్చితంగా ఎమ్మెల్యే, మంత్రిపదవులు వస్తాయని.. ఆమెతో కలిసి ఉన్నంతకాలం ఏ పదవీ దక్కదు’’ అంటూ మాయమాటలు చెప్పాడు. ఆ మాటలను బలంగా నమ్మిన అతను భార్య(27)ను వదిలించుకునేందుకు పన్నాగం రూపొందించాడు. సూటి పోటి మాటలతో మానసికంగా వేధించేవాడు. అంతేకాదు సిగరెట్లతో ఆమె శరీరాన్ని గాయపరిచేవాడు. కట్నం తీసుకురావాలంటూ అత్తమామలు చిత్ర హింసలకు గురిచేసేవారు. ఆ వేధింపులు భరించలేక ఆమె పోలీసు స్టేషన్‌లో.. భర్తతో సహా ఎనిమిది మంది పై కేసు పెట్టింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో బాబా చెప్పినట్టే ప్రవర్తించానని రఘునాథ్‌ చెప్పాడు. మాయ మాటలు చెప్పి జనాలను మభ్యపెడుతున్న ఆ బాబాని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

* ఐటీ రంగంలోని పెద్ద కంపెనీలు, స్టార్టప్‌లు, సర్వీస్‌ ప్రొవైడర్లు అత్యవసరంగా టెక్ నిపుణుల నియామకం కోసం ఎదురు చూస్తున్నాయి. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాపార సంస్థలు డిజిటల్‌ వైపు అడుగులు వేస్తుండటం రోజురోజుకూ పెరుగుతోంది. దాంతో ఐటీ సేవలకు భారీగా గిరాకీ ఏర్పడుతోంది. ప్రధానమైన పలు ఐటీ కంపెనీల్లో వేలాది కొలువులు నిపుణులకోసం ఎదురు చూస్తున్నాయి. అంతేకాదు, ఆయా కంపెనీలు అర్హులైనవారికి పెద్దమొత్తంలో జీతాలను కూడా పెంచనున్నాయని తెలుస్తోంది.