Movies

నేను చాలా సంతోషంగా ఉన్నాను – ఆర్.నారాయణమూర్తి

నేను చాలా సంతోషంగా ఉన్నాను – ఆర్.నారాయణమూర్తి

తనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై సినిమా నటుడు ఆర్‌.నారాయణమూర్తి స్పందించారు. అవి తననెంతో బాధించాయని ఆయన అన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నారాయణమూర్తిని ఉద్దేశిస్తూ ప్రజాగాయకుడు గద్దర్‌ మాట్లాడారు.. ‘‘నారాయణమూర్తికి ఇల్లు లేదు. సొంత ఆస్తి లేదు. బండి లేదు. నడుచుకుంటూ వెళతాడు. ఆయనను ఎవరూ ప్రశ్నించలేరు’’ అని అన్నారు. అయితే.. గద్దర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ‘నారాయణమూర్తి దీనస్థితిలో ఉన్నారు’ అంటూ అనేక రకాల వార్తలు వ్యాపించాయి. దీంతో నారాయణమూర్తికి చాలామంది ఫోన్లు చేసి ఆర్థికంగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారట. ఇవన్నీ తనను మానసికంగా కుంగదీశాయని ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

‘‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా దగ్గర డబ్బు ఉంది. నేను ధనికుడిని. నాకు ఏదైనా అవసరం వస్తే పరిశ్రమ పెద్దలతో పాటు ఎంతోమంది నాకు సహాయం చేస్తారు. అన్నింటికీ మించి ప్రేక్షక దేవుళ్లు నన్ను గుండెళ్లో పెట్టుకొని ప్రేమిస్తారు. వాళ్లు నాకు కోట్లకుకోట్ల రూపాయలు ఇస్తున్నారు. నాకేం కష్టాలు లేవు. సినిమా అన్నాక అప్పులు చేయడం.. తీర్చడం చాలా సాధారణం. సినిమాలు చేసి స్థలాలు కొనుక్కొని.. ఇంకా ఏదో చేసే మనస్తత్వం నాది కాదు. ‘రైతన్న’ సినిమాను కూడా ఎప్పుడు విడుదల చేద్దామా అని ఆతృతగా ఉన్నాను. నేను దీనస్థితిలో ఉన్నానంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడం నాకు చాలా బాధ కలిగింది. ఇది ధర్మం కాదు. ఎక్కడెక్కడి నుంచో నా అభిమానులు ఫోన్లు చేసి నామీద దయ చూపిస్తుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి. మీ అభిమానానికి ధన్యవాదాలు. జర్నలిజం అంటే సంచలనాలు బయటికి తీసేది. అంతేకానీ.. ఇలాంటి వార్తలు రాయడం కాదు. ఆరోజు గద్దర్‌ అన్న మాట్లాడేటప్పుడు కూడా ‘అన్నా నా దగ్గర డబ్బులున్నాయ్‌’ అని ఆయనతో చెప్పాను. నేను కేవలం నా మనశ్శాంతి కోసం పల్లెటూరిలో ఉంటున్నాను. మరి అలాంటి వార్తలు ఎప్పుడూ రాయరెందుకు..? నేను చాలా సంతోషంగా ఉన్నాను. సోషల్‌ మీడియాలో దయచేసి సత్యాన్ని మాత్రమే చాటిచెప్పండి’’ అని నారాయణమూర్తి అన్నారు.