కేవలం నటిమణులుగానే కాదు.. నిర్మాతలుగానూ సత్తా చాటుతామని నిరూపిస్తున్నారు బాలీవుడ్ భామలు. 2013లో అనుష్క శర్మ ‘క్లీన్ స్లేట్ ఫిలిం’, 2015లో ప్రియాంకా చోప్రా ‘పర్‌పుల్ పెబల్ పిక్చర్స్’ 2020లో కంగనా రనౌత్ ‘ మణికర్ణిక ఫిలిం ప్రొడక్షన్’ను స్థాపించారు. తాజాగా ఆ జాబితాలో దిల్లీ ముద్దుగుమ్మ సైతం చేరారు. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఆమె తన ప్రొడక్షన్ హౌస్ పేరు ‘ ఔట్ సైడర్ ఫిలిమ్స్’ అని వెల్లడించారు. ‘‘భారతీయ చలన చిత్రసీమలో నేను అడుగుపెట్టి గతేడాదితో పదేళ్లు పూరైంది. నా స్వప్నం నెరవేరింది. ఈ ప్రయాణంలో ఎలా నెగ్గుకురావాలో నేర్చుకున్నాను. పబ్లిక్ ఫిగర్ అవుతానని నేనెప్పుడూ ఊహించలేదు. ఇన్నేళ్లు నాపని తీరు మెచ్చి, నన్ను నమ్మి ప్రేమాభిమానాలు చూపించిన మీ అందరికి రుణపడి ఉంటాను. బాధ్యత అనేది శక్తితో వస్తుంది. ఇప్పుడు ఈ చిత్రసీమకు తిరిగి ఇవ్వాల్సిన రోజు సమయం వచ్చింది. ఇకపై నటిగానే కాకుండా నిర్మాతగా ‘ఔట్‌సైడర్ ఫిల్మ్’తో కొత్త మార్గం వైపు అడుగులు వేస్తున్నా. నా జీవితంలో ఇదొక కొత్త అనుభవం. కచ్చితంగా నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా స్నేహితుడు ప్రాంజల్‌తో కలిసి ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టా. మీ అందరి ఆశీస్సులు కావాలి’’ అంటూ తన ప్రొడక్షన్ హౌస్ గురించి ప్రకటించారు తాప్సీ. అంతేకాదు.. తాను నిర్మాతగా వ్యవహరించే తొలి చిత్రం ‘బ్లర్’ని జీ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నామని తెలిపారు. అజయ్ భాల్ దీనికి దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఇటీవలే ‘హసీన్ దిల్‌రుబా’లో మెప్పించిన తాప్సీ.. తదుపరి చిత్రంలో క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ ‘శభాష్ మీతూ’లో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు.
దశాబ్దం పూర్తి అయింది. ఇక ఇప్పుడు నిర్మిస్తా.
Related tags :