* దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ పలు రాష్ట్రాలు టీకా కొరతను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంటున్నాయి. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 66 కోట్ల డోసుల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.14 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 40 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయగా.. త్వరలోనే వీటి సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కృషిచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
* ఖానామెట్ భూముల వేలం ప్రక్రియ ముగిసింది. ఖానామెట్‌లో ఉన్న 14.91 ఎకరాలను 5 ప్లాట్లుగా విభజించి శుక్రవారం హెచ్‌ఎండీఏ ఆన్‌లైన్ వేలం నిర్వహించగా రూ.729.41 కోట్ల ఆదాయం సమకూరింది. భూముల వేలంలో ఎకరం సగటు ధర రూ.48.92 కోట్లు, గరిష్ఠంగా రూ.55 కోట్లు పలికింది. 2.92 ఎకరాలను రూ.160.60 కోట్లకు మంజీరా కన్‌స్ట్రక్షన్స్ దక్కించుకుంది. 3.15 ఎకరాలను రూ.153.09 కోట్లకు లింక్‌వెల్ టెలీ సిస్టమ్స్ కైవసం చేసుకుంది. ఎకరాకు రూ.48.60 కోట్ల చొప్పున లింక్‌వెల్ సిస్టమ్స్ కొనుగోలు చేసింది. మరో రెండు ఎకరాలను 46.2 కోట్లకు అదే సంస్థ కొనుగోలు చేసింది. 3.69 ఎకరాలు రూ.185.98 కోట్లకు జీవీపీఆర్ ఇంజినీర్స్, 3.15 ఎకరాలు రూ.137.34 కోట్లకు అప్‌టౌన్ లైఫ్ ప్రాజెక్టు కొనుగోలు చేశాయి. ఈ ప్రాంతంలో వాణిజ్యపరమైన సముదాయాలు, వినోదభరిత ప్రాంతాలు, రవాణా సౌకర్యం ఉండడంతో ఖానామెట్ భూములు అధిక ధర పలికాయి. భూములకు ఎలాంటి చిక్కులు లేవని, సింగిల్ విండో ద్వారా నిర్ణీత కాల వ్యవధిలో త్వరితగతిన అనుమతులు ఇస్తామని టీఎస్ఐఐసీ తెలిపింది.
* మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా?అయితే, బ్యాంకు మీకు ఓ ముఖ్య గమనిక జారీ చేసింది.కస్టమర్లకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఆన్‌లైన్ సేవలకు సంబంధించి పలు సాంకేతిక మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది.ఈ నేపథ్యంలో జులై 16 అర్ధరాత్రి సమయంలో రెండున్నర గంటల పాటు సేవలు నిలిచిపోతాయని తెలిపింది.ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎటువంటి మెసేజ్‌లు, అలర్ట్‌లపై క్లిక్ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అలాగే ఆ సమయంలో హ్యాకర్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. కస్టమర్లంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.జులై 16 రాత్రి 10:45 గంటల నుంచి జులై 17 వేకువజామున 1:15 గంటల వరకు సేవలు నిలిచిపోనున్నాయి.మొత్తం రెండున్నర గంటల పాటు సేవలు ఆగిపోనున్నాయి.ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనోలైట్, యూపీఐ సేవలకు అంతరాయం కలగనుంది.
* ప్రముఖ విద్యుత్ బైక్‌ల తయారీ సంస్థ రివోల్ట్ ఇంటెల్లికార్ప్ తీసుకొచ్చిన రివోల్ట్ ఆర్‌వీ400 మరోసారి అమ్మకాల్లో దూసుకెళ్లింది. గురువారం బుకింగ్స్ ప్రారంభించగా.. నిమిషాల్లోనే బైక్‌లన్నీ అమ్ముడయ్యాయని రివోల్ట్ తెలిపింది. అయితే, ఎన్ని బైక్‌లను విక్రయానికి ఉంచారో మాత్రం తెలియజేయలేదు
* త్వరలో విపణిలోకి విడుదల చేయనున్న తన విద్యుత్తు స్కూటర్‌కు బుకింగ్‌లు ప్రారంభించినట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఓలాఎలక్ట్రిక్.కామ్‌లో రూ.499 రిఫండబుల్ డిపాజిట్ చెల్లించి ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ‘అద్భుత పనితీరు, సాంకేతికత, డిజైన్, ఆకర్షణీయ ధర.. ఇవన్నీ ఈ వాహనం వైపు వినియోగదారులను మొగ్గు చూపేలా చేస్తాయ’ని ఓలా ఛైర్మన్, గ్రూపు సీఈఓ భావిశ్ అగర్వాల్ తెలిపారు. అయితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకతలను కంపెనీ ఇప్పటివరకు వెల్లడించలేదు.