దేశంలో మళ్లీ హ్యాకింగ్ కలకలం చెలరేగింది. పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు వెల్లడైంది! తాజాగా లీక్ అయిన ఓ డేటాబేస్‌లో వారందరి ఫోన్ నంబర్లు ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని ఎన్‌ఎస్‌వో గ్రూప్ కంపెనీకి చెందిన ‘పెగాసస్’ అనే స్పైవేర్ సాయంతో ఈ హ్యాకింగ్ తంతు సాగినట్లు తెలుస్తోందని ‘ది వైర్’ వార్తాసంస్థ ఓ కథనంలో వెల్లడించింది. వాస్తవానికి ఈ స్పైవేర్ ప్రభుత్వాల వద్దే అందుబాటులో ఉంటుంది. నిఘా కార్యకలాపాల కోసం దాన్ని ప్రభుత్వ సంస్థలకు ఎన్‌ఎస్‌వో గ్రూప్ విక్రయిస్తుంటుంది. దీంతో తాజా హ్యాకింగ్ వ్యవహారంలో ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే- ఇందులో తమ జోక్యం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. దేశ పౌరులందరి గోప్యత హక్కును పరిరక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. హ్యాకింగ్ ఆరోపణలను తోసుపుచ్చింది. ‘ది వైర్’ కథనం ప్రకారం.. ‘పెగాసస్’తో లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నారు. వారందరి ఫోన్ నంబర్లు తాజా డేటాబేస్‌లో అందుబాటులో ఉన్నాయి. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, న్యాయ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, హక్కుల కార్యకర్తల వంటి వారు బాధితుల జాబితాలో ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. 2018-19 సంవత్సరాల మధ్య వీరిని లక్ష్యంగా చేసుకున్నారు. సుప్రీం కోర్టుకు చెందిన ఓ సిట్టింగ్ న్యాయమూర్తి ఫోన్ నంబరు కూడా జాబితాలో ఉంది. భారతదేశంతో పాటు అజర్‌బైజాన్, బహ్రెయిన్, హంగేరి, మెక్సికో, మొరాకో, సౌదీ అరేబియా తదితర దేశాలకు చెందిన ప్రముఖుల పేర్లు తాజా డేటాబేస్‌లో ఉన్నాయి. ‘వాషింగ్టన్ పోస్ట్’ సహా 16 విదేశీ వార్తాసంస్థలు కూడా ఈ హ్యాకింగ్ సంబంధిత కథనాలను ప్రచురించాయి.
భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఫోన్ హ్యాక్
Related tags :