Business

రైళ్ల టికెట్ ధరలు పెరిగాయి-వాణిజ్యం

రైళ్ల ధరలు పెరిగాయి-వాణిజ్యం

* ప్యాసింజర్ చార్జీల మోత..40 శాతం మేర పెరిగిన రైలు టికెట్‌ ధరలు.నేటి నుంచి అమలు.ప్యాసింజర్‌ రైలు ప్రయాణం ఇక నుంచి సామాన్యులకు భారంగా మారనుంది.నేటి నుంచి పట్టాలెక్కనున్న ప్యాసింజర్‌ రైళ్ల వేగంతోపాటే చార్జీల పెంపునకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది.కోవిడ్‌ కారణంగా గతేడాది మార్చి 22 నుంచి నిలిపివేసిన ప్యాసింజర్‌ రైళ్లను 16 నెలల తర్వాత పునరుద్ధరించారు.సోమవారం నుంచి 82 రైళ్లు పట్టాలెక్కనున్నాయి.హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు కేవలం రూ.50 లోపు చార్జీలతో రాకపోకలు సాగించిన ప్రయాణికులు ఇక నుంచి ఈ రైళ్లలో ఎక్స్‌ప్రెస్‌ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది..ఇప్పటివరకు ఉన్న ప్యాసింజర్‌ చార్జీలపైన 30 నుంచి 40% వరకు భారం పడనుంది.ఈ రైళ్లన్నిం టినీ అన్‌ రిజర్వ్‌డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మార్చడంతో ఆటోమేటిక్‌గా చార్జీలు సైతం పెరగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.కోవిడ్‌కు ముందు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో నడిచిన ఈ రైళ్లు సోమవారం నుంచి గంట కు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి.రైళ్లవేగాన్ని పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే అన్ని ప్రధాన రూట్లలో పట్టాల సామర్థ్యాన్ని పెంచింది.అన్ని చోట్ల అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లు ఇప్పటి వరకు రిజర్వేషన్‌ టికెట్ల తరహాలోనే జనరల్‌ సీట్లకు సైతం ముందస్తుగా టికెట్లు బుక్‌ చేసుకోవలసి వచ్చింది..ఇక నుంచి అన్ని రైల్వేస్టేషన్ల లో కౌంటర్ల ద్వారా ప్రయాణికులు అప్పటి కప్పుడు టికెట్లు తీసుకొని ప్రయాణం చేయవచ్చు.ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషీన్‌(ఏటీవీఎం) యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా టికెట్లు పొందవచ్చు.

* ఆన్‌లైన్‌తో పాటు దుకాణాలలో వివిధ రకాల కళ్లజోళ్లు విక్రయించే లెన్స్‌కార్ట్‌ భారీ ఎత్తున పెట్టుబడులను సమీకరించింది. టెమాసెక్‌ హోల్డింగ్స్‌, ఫాల్కన్‌ ఎడ్జ్‌ క్యాపిటల్‌ నుంచి 220 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.1,647.64కోట్లు) నిధులు కూడగట్టింది. గతంలో కేకేఆర్‌ అండ్‌ కంపెనీ నుంచి సేకరించిన 95 మిలియన్ డాలర్లతో పాటు తాజాగా సమీకరించిన నిధులను భారత్‌ సహా ఆగ్నేయాసియాలో వ్యాపార విస్తరణకు వినియోగించనున్నట్లు లెన్స్‌కార్ట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. మరో 20 ఏళ్ల పాటు ప్రజల కళ్లజోళ్ల అవసరాలను తీర్చే దిశగా అడుగులు వేస్తున్నామని వ్యవస్థాపకుడు పేయుష్‌ బన్సల్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ అంకుర సంస్థ విలువ 2.5 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు. ఈ ఏడాది భారత అంకుర సంస్థలకు అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారీ ఎత్తున నిధులు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం కూడా భారీ ఎత్తున నిధులు సేకరించాయి. ఈ క్రమంలోనే లెన్స్‌కార్ట్‌లోకి కూడా పెట్టుబడులు రావడం విశేషం.

* ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సౌర, బ్యాటరీలు, ఫ్యూయల్‌ సెల్స్, హైడ్రోజన్‌ వ్యాపారాలపై రాబోయే మూడేళ్లలో రూ.75,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, ఈ కొత్త ఇంధన వ్యాపారం విలువ 36 బిలియన్‌ డాలర్ల (రూ.2.6 లక్షల కోట్లు)కు చేరొచ్చని వాల్‌స్ట్రీట్‌ బ్రోకరేజీ బెర్న్‌స్టీన్‌ రీసెర్చ్‌ నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం రిలయన్స్‌కు మూడు విభాగాల్లో వ్యాపారాలున్నాయి. చమురు-రసాయనాల (ఓ2సీ) విభాగంలో చమురు రిఫైనరీలు, పెట్రో రసాయనాల ప్లాంట్లు, ఇంధన రిటైలింగ్‌ వ్యాపారాలున్నాయి. డిజిటల్‌ సేవల్లో టెలికాం సంస్థ జియో ఉంది. రిటైల్‌లో ఇ-కామర్స్‌ కూడా కలిసి ఉంది. కొత్త ఇంధన వ్యాపారం ఇప్పుడు నాలుగో విభాగం (వెర్టికల్‌) కిందకు రానుంది.

* గతేడాది పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని రికార్డు స్థాయిలో పెంచడంతో కేంద్రంపై కాసుల వర్షం కురిసింది. మార్చి 31, 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల రూపంలో ఏకంగా రూ.3.35లక్షల కోట్లు వసూలయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 88శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురుకు గిరాకీ పడిపోయింది. ధరలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని సమకూర్చునేందుకు కేంద్రం వీటిపై ఎక్సైజ్‌ సుంకాలను భారీగా పెంచింది. పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూ.19.98 నుంచి రూ.32.9కి, డీజిల్‌పై రూ.15.83 నుంచి రూ.31.8కి పెరిగింది. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో వీటిపై పన్ను వసూళ్లు రూ.3.35లక్షల కోట్లకు పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ వసూళ్లు రూ.1.78లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య పెట్రోల్‌, డీజిల్‌పై రూ.1.01లక్షల కోట్ల మేర ఎక్సైజ్‌ పన్ను వసూలైనట్లు ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరీ లోక్‌సభకు తెలిపారు.