* తెలంగాణ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచుతూ జీఓ విడుదల*
* ఆదాయపు పన్ను శాఖ వెబ్‌పోర్టల్‌లో లోపాలు ఉన్నట్లు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గుర్తించిందని.. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ పార్లమెంట్‌కు తెలిపారు. నిదానంగా పనిచేయడం, చాలా సందర్భాల్లో కొన్ని రకాల సేవలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లు చెప్పారు. www.incometax.gov.in వెబ్‌పోర్టల్‌ను ప్రభుత్వం జూన్ 7వ తేదీ ప్రారంభించింది. మొదటి నుంచి దీనిలో చాలా ఇబ్బందులు ఉన్నట్లు పన్ను చెల్లింపుదారులు, వృత్తి నిపుణులు, ఇతర వర్గాల వారు ఫిర్యాదులు చేశారు. దీనిని పరిష్కరించేందుకు జూన్ 22న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెబ్‌సైట్‌ను తయారు చేసిన ఇన్ఫోసిస్ సిబ్బందితో భేటీ అయ్యారు.
* దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థల నుంచి రూ.4,000 కోట్ల నిధులను సమీకరించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రముఖ ఫండ్ మేనేజ్మెంట్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేట్ ఈక్విటీ(ఎంఓపీఈ) తెలిపింది. వీటిలో 50 శాతం దేశీయంగా.. మరో 50 శాతం విదేశీ సంస్థల నుంచి సమకూర్చుకోవాలని యోచిస్తున్నట్లు పేర్కొంది. రానున్న 6-9 నెలల్లో నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. గతంలో సేకరించిన నిధులతో పెట్టిన పెట్టుబడులు మంచి రాబడిని ఇచ్చాయని ఎంఓపీఈ సీఈఓ అండ్ ఎండీ విశాల్ తెలిపారు.
* సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలు, ఇతరత్రా అంశాలు, వాటి పరిష్కారాలపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సింగరేణి ప్రాంతానికి చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. కార్మిక సంఘాలు, ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు పదవీ విరమణ వయసు 61ఏళ్లకు పెంచాలని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో సంస్థలో మొత్తంగా 43,899 మంది ఉద్యోగులు, అధికారులు, కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఈ నెల 26న జరగనున్న బోర్డు సమావేశంలో దీనిపై సమీక్షించి పెంపు అమలు తేదీని ప్రకటించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.