Sports

టోక్యోలో పెరుగుతున్న కొవిడ్ కేసులు

టోక్యోలో పెరుగుతున్న కొవిడ్ కేసులు

ఒలింపిక్స్‌ మహా క్రీడా సంబరం శుక్రవారమే లాంఛనంగా ప్రారంభం కానున్న వేళ టోక్యో నగరంలో కొవిడ్‌ కేసులు పెరగడం కలవర పెడుతోంది. తాజాగా జపాన్‌ రాజధాని నగరంలో కొత్త కేసులు ఆరు నెలల గరిష్ఠానికి చేరడం కలకలం రేపుతోంది. ఈ రెండు రోజుల్లోనే అక్కడ 1,832 కేసులు నమోదయ్యాయి. కరోనా విజృంభణ దృష్ట్యా ఆగస్టు 22 వరకు అత్యయిక స్థితిని విధిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అత్యయిక స్థితి సమయం ముగిసేలోపే అంతర్జాతీయ ఒలింపిక్‌ క్రీడలు ముగిసిపోనున్నాయి. కరోనా మహమ్మారి కలకలంతో టోక్యో ప్రాంతానికి అభిమానుల రాకను సైతం నిషేధించారు. ఈ మెగా క్రీడలకు ప్రేక్షకులను అనుమతించబోమని, టీవీల్లోనే చూడాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంచేసింది.

తాజా పరిస్థితుల నేపథ్యంలో జపాన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టోషియా నకగవా మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌తో సంబంధం లేకుండానే ఈ పెరుగుదలను అంచనా వేసినట్టు తెలిపారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో నెలకొన్న అనిశ్చితి వల్లే యువత, వ్యాక్సిన్‌ వేసుకోని వారిలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు, జపాన్‌లో ఇప్పటివరకు దాదాపు 23 శాతం మంది పూర్తిగా వ్యాక్సిన్‌ వేసుకున్నారు.

రాబోయే కొన్ని వారాల్లో టోక్యోలో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయని ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. టోక్యో మెట్రోపాలిటన్‌ ప్రభుత్వ నిపుణుల బృందం సభ్యుడు డాక్టర్‌ నోరియో ఒహమగరి మాట్లాడుతూ.. ఇదే వేగంతో కేసులు పెరిగితే మరో రెండు వారాల్లో టోక్యోలో రోజుకు సగటున 2,600 చొప్పున కేసులు నమోదవుతాయన్నారు. జపాన్‌లో ఇప్పటివరకు 84,800 కేసులు, 15వేల మరణాలు నమోదయ్యాయి.