Movies

గ్రామీణ ప్రాంత మహిళలను అలా ఉచ్చులోకి దింపిన కుంద్రా-తాజావార్తలు

గ్రామీణ ప్రాంత మహిళలను అలా ఉచ్చులోకి దింపిన కుంద్రా-తాజావార్తలు

* అది ఫిబ్రవరి 4.. ముంబయి శివారులోని మాద్‌ దీవిలోని ఓ బంగ్లాలో పోర్న్‌ సినిమా షూటింగ్‌ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు వెళ్లే సరికి ఇద్దరు వ్యక్తులు అభ్యంతరకర స్థితిలో కన్పించారు. ఆ షూటింగ్‌ను అడ్డుకున్న పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఓ మహిళను కాపాడారు. ఈ షూటింగే నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పట్టించింది. సదరు మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 5 నెలల పాటు దర్యాప్తు సాగించి తీగలాగితే ‘పోర్న్‌ రాకెట్‌’ గుట్టంతా బయటపడింది.ముంబయి శివారు ప్రాంతాల్లో ఉండే మాద్ దీవుల్లాంటి ప్రాంతాల్లో బంగ్లాలను అద్దెకు తీసుకుని తరచూ పోర్న్‌ షూటింగ్‌లు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు రహస్యంగా సమాచారం అందింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిన పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలను వెబ్‌ సిరీస్‌ల పేరుతో నటిని చేస్తామంటూ ఆశ జూపించి ముంబయికి రప్పిస్తారు. తీరా లొకేషన్‌కు వెళ్లిన తర్వాత స్క్రిప్ట్‌ మొత్తం మారుతుంది. దుస్తులు లేకుండా అభ్యంతకర సన్నివేశాల్లో నటించాలని బలవంతం చేస్తారు. మహిళలు అందుకు ఒప్పుకోకపోవడంతో షూటింగ్‌కు అయిన బిల్లంతా కట్టాలంటూ బెదిరిస్తారు. వీరి బెదిరింపులకు భయపడో లేదా ఇతర కారణాలతోనే పోలీసులు ఫిర్యాదు చేసేందుకు మహిళలు ముందుకు రావడం లేదు.ఫిబ్రవరి 4న పోలీసులు అరెస్టు చేసిన కేసులోనూ ఇదే జరిగింది. అయితే అక్కడ రక్షించిన మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో భాగంగా పోలీసులు ప్రొడ్యూసర్‌ రోవాఖాన్‌, మరో నటిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ వీడియోలను ఎక్కడ అప్‌లోడ్‌ చేస్తున్నారన్న దానిపై దృష్టిపెట్టారు. అప్పుడు ‘హాట్‌షాట్స్‌’ యాప్‌ వ్యవహారం బయటపడింది. దీంతో విచారణ జరిపిన పోలీసులు ఉమేశ్‌కామత్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతడు యూకేకు చెందిన కెర్నిన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే సంస్థలో పనిచేస్తున్నాడు.కాగా.. ఉమేశ్‌ గతంలో రాజ్‌కుంద్రాకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. అతడిని ప్రశ్నించగా.. రాజ్‌కుంద్రా పేరును బయటపెట్టాడు. ఆ తర్వాత అతడి కాల్‌ రికార్డులను పరిశీలించగా.. మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కెర్నిన్‌కు చెందిన హాట్‌షాట్స్‌ యాప్‌ను కుంద్రాకు చెందిన వియాన్‌ ఇండస్ట్రీస్‌ నిర్వహిస్తున్నట్లు తేలింది. భారత్‌లో పోర్న్‌ వీడియోలను షూట్‌ చేసి వాటిని విట్రాన్స్‌ఫర్‌ ద్వారా యూకేకు పంపిస్తున్నారని, అక్కడి నుంచి హాట్‌షూట్స్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.దీంతో ఇటీవల పోలీసులు రాజ్‌కుంద్రా ఆఫీస్‌ను సోదా చేశారు. అక్కడ అగ్రిమెంట్‌ పేపర్లు, ఈమెయిళ్లు, వాట్సాప్‌ చాట్‌ను పరిశీలించగా.. ఈ పోర్న్‌ రాకెట్‌లో ప్రధాన సూత్రధారి కుంద్రానే అని తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. భారత్‌లో సైబర్‌, పోర్నోగ్రఫీ చట్టాల నుంచి తప్పించుకునేందుకు కుంద్రా, ఆయన సోదరుడే యూకేలో కెర్నిన్‌ పేరుతో కంపెనీ పెట్టినట్లు తెలుస్తోంది.అయితే తనపై వస్తున్న ఆరోపణలను రాజ్‌ కుంద్రా తోసిపుచ్చారు. ఈ హాట్‌షాట్స్‌ యాప్‌ను తాను ఎప్పుడో విక్రయించినట్టు చెబుతున్నారు. కానీ ఇప్పటికీ ఈ యాప్‌ ఆర్థిక లావాదేవీలను కుంద్రా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని దర్యాప్తులో వెల్లడైంది. అంతేగాక, ఈ హాట్‌షాట్స్‌ క్లిప్స్‌ లావాదేవీలకు సంబంధించి కుంద్రా ఓ వాట్సాప్‌ గ్రూప్‌ను కూడా క్రియేట్‌ చేసినట్లు తేలింది. దీంతో అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

* కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్‌రెడ్డి తెరాసలో చేరారు. కౌశిక్‌రెడ్డికి కండువా కప్పిన సీఎం కేసీఆర్‌.. పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆయన ‘తెరాస టికెట్‌ తనకేనంటూ ఓ నాయకుడితో ఆడియో సంభాషణ’ బయటపడిన తరువాత పార్టీకి రాజీనామా చేశారు. తన అనుచరులు, అభిమానులతో సంప్రదింపులు జరిపిన తరువాత తెరాసలో చేరిపోయారు. పెద్దఎత్తున తన అనుచరులతో కలిసి సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

* బ్యాడ్మింటన్‌, షూటింగ్‌కు పుట్టినిల్లు తెలంగాణ అని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్సిటీలోని గన్‌ ఫర్‌ గ్లోరీ షూటింగ్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన చీర్‌ ఫర్‌ ఇండియా కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, గగన్‌ నారంగ్‌, సాట్స్‌ ఛైర్మన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గన్‌ ఫర్‌ గ్లోరీ అకాడమీ నుంచి ఐదుగురు ఒలింపిక్స్‌కు వెళ్లడం గొప్ప విషయమన్నారు. గగన్‌ నారంగ్‌కు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులకే కాదు.. కోచ్‌లకూ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ను ఆధునికీకరిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. తెలంగాణలో షూటింగ్‌ను మరింత ప్రోత్సహిస్తామన్నారు. గగన్‌ నారంగ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని తెలిపారు. త్వరలోనే రాష్ట్ర స్థాయిలో ప్రతిభను గుర్తిస్తామని.. వచ్చే ఒలింపిక్స్‌కు రాష్ట్రానికి చెందిన వారు వెళ్లేలా కృషి చేస్తానని చెప్పారు.

* కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోని ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలను (సీఐఎస్‌ఎప్‌) నియమించడానికి భారీగా ఖర్చయ్యే అవకాశం ఉంది. గోదావరి బోర్డులో ఇలాంటి అవసరం లేకపోయినా కృష్ణా బోర్డు పరిధిలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ తదితర ప్రాజెక్టుల్లో ఈ బలగాలను నియమించే అవకాశం ఉంది. వీటికి ఏడాదికి సుమారు రూ. 200 కోట్లు అవసరమవుతుందని ప్రాథమిక అంచనా. 2015 నుంచి సీఐఎస్‌ఎఫ్‌ బలగాల నియామకంపై చర్చ జరుగుతోంది. ఆ సమయంలో రూ. 150కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. సిబ్బంది జీతభత్యాలు భరించడం ఒక ఎత్తైతే ఇంతమందికి అవసరమైన భవనాలు, నివాసం మొదలైనవి మరో ప్రధాన సమస్య. వీటన్నింటి వ్యయాన్ని కేంద్రమే భరించాలని గతంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు లేఖలు రాశారు. పునర్విభజన చట్టం, తాజా గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం కేంద్ర బలగాల ఖర్చును రెండు రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. ప్రధాన నదిపై ఉన్న ప్రాజెక్టులే కాకుండా ఎక్కువ ప్రాజెక్టులను, కాలువలను బోర్డుల పరిధిలోకి తెచ్చినందున కేంద్ర బలగాల నిర్వహణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.

* కృష్ణా ట్రైబ్యునల్‌ కాల పరిమితిని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర జల్‌శక్తిశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అంతర్జాతీయ జల వివాదాల చట్టం-195లోని సెక్షన్‌ 5(3)కింద కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను అనుసరించి దీని కాలపరిమితిని 2021 ఆగస్టు 1 నుంచి మరో ఏడాది పొడిగిస్తున్నట్లు పేర్కొంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం కేంద్రం 2004 ఏప్రిల్‌ 2న ఈ ట్రైబ్యునల్‌ను ఏర్పాటుచేసింది. అది ఆరేళ్లపాటు విచారణ కొనసాగించి 2010 డిసెంబరు 30న నివేదిక సమర్పించింది. ఆ నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలు జలవివాద చట్టంలోని సెక్షన్‌ 5(3)ని అనుసరించి 2011 మార్చి 29న మళ్లీ దరఖాస్తు చేశాయి. వాటిపై ఏడాదిలోపు ట్రైబ్యునల్‌ తుది నివేదికను కేంద్రానికి సమర్పించాలి. అయితే దానిపై వాదనలు ముగియకపోవడంతో కేంద్రం ఏటా ట్రైబ్యునల్‌ కాలపరిమితిని పొడిగిస్తూ వచ్చింది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తర్వాత విభజన చట్టంలోని సెక్షన్‌ 89 ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం ట్రైబ్యునల్‌ కాలపరిమితిని పెంచి, దానికి కొత్తగా విధివిధానాలను ఖరారు చేయాలని చెప్పడంతో అందుకు అనుగుణంగా కేంద్రం దాని కాలపరిమితిని పెంచింది. 2020 జులై 23న కేంద్ర జల్‌శక్తి జారీ చేసిన ఉత్తర్వుల్లోని విధివిధానాల ప్రకారం ట్రైబ్యునల్‌ 2021 ఆగస్టు ఒకటిలోపు తుది నివేదిక సమర్పించాల్సి ఉంది. ఇందుకు తమకు మరో ఏడాది సమయం కావాలని కృష్ణా ట్రైబ్యునల్‌ విజ్ఞప్తి చేయడంతో కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

* దేశంలో ఇప్పటివరకు మూడింట రెండొంతుల మంది కొవిడ్‌కు గురైనట్లు ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తెలిపారు. దేశంలోని 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో జూన్‌-జులై నెలల్లో నిర్వహించిన నాలుగో సీరో సర్వేను అనుసరించి ఈ విషయం వెల్లడిస్తున్నట్లు ప్రకటించారు. ఇదివరకు నిర్వహించిన మూడు సర్వేలకు భిన్నంగా ఈసారి 6-17 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలు సహా మొత్తం 28,975 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించినట్లు చెప్పారు. ఇందులో పాల్గొన్న పెద్దల్లో 12,607 మంది (62.2%) ఎలాంటి టీకా తీసుకోలేదని, 5,038 మంది (24.8%) ఒక డోసు, 2,631 మంది (13%) రెండు డోసులు తీసుకున్నట్లు తెలిపారు. మొత్తంగా 67.6% మందిలో యాంటీబాడీలు కనిపించినట్లు చెప్పారు. 6-9 ఏళ్ల వయస్సులో 57.2%మందిలో, 10-17 ఏళ్ల వయస్సులో 61.6%, 18-44 వయస్సులో 66.7%, 45-6 ఏళ్ల వయస్సులో 77.6%, 60 ఏళ్ల పైబడిన వారిలో76.7% మందిలో యాంటీబాడీలు ఉన్నాయన్నారు. పురుషుల్లో 65.8% మందిలో సీరో పాజిటివిటీ రేటు కనిపించగా మహిళల్లో 69.2% మందిలో కనిపించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 66.7%, పట్టణ ప్రాంతాల్లో 69.6% మందిలో యాంటీబాడీలను గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటివరకు టీకా తీసుకోని వారిలో 62.3% మందిలో, ఒక డోసు తీసుకున్నవారిలో 81% మందిలో, రెండు డోసులు తీసుకున్నవారిలో 89.%మందిలో యాంటీబాడీలు ఉన్నాయని బలరాం భార్గవ వివరించారు. వైద్య ఆరోగ్య సిబ్బందిలో 85.2%మందిలో సీరో పాజిటివిటీ కనిపించిందని చెప్పారు. ఈ ఫలితాలను బట్టి చూస్తే.. ఇప్పటి వరకు మూడింట రెండొంతుల మంది కొవిడ్‌కు గురైనట్లు తెలుస్తోందని, ఇంకా 40 కోట్ల మందిలో యాంటీబాడీలు కనిపించనందున వారందరూ వైరస్‌ బారిన పడడానికి అవకాశం ఉందన్నారు. యాంటీబాడీలు తక్కువ ఉన్న ప్రాంతాల్లో కేసులు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం కనిపించిన సీరో పాజిటివిటీ రేటు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని స్పష్టంచేశారు. అదే సమయంలో జాతీయస్థాయిలో నిర్వహించిన ఈ సర్వే స్థానిక పరిస్థితులను వెల్లడించలేదని, అందువల్ల రాష్ట్రాలు సొంతంగా సీరో సర్వే నిర్వహించుకోవాలన్నారు. నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు యాంటీబాడీలు కనిపించని 40 కోట్ల మంది ఇన్‌ఫెక్షన్‌ ద్వారా కాకుండా టీకా తీసుకోవడం ద్వారా వాటిని తెచ్చుకోవాలని సూచించారు. ఇప్పటికీ ప్రతి ముగ్గురిలో ఒకరు కొవిడ్‌-19కు గురవడానికి అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు.

* రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఎస్. స్టెల్లా తెలిపారు.

* హర్యానా గవర్నర్ గా పదవీ బాథ్యతలు స్వీకరించి హైదరాబాద్ వచ్చిన బండారు దత్తాత్రేయను మర్యాద పూర్వకంగా కలుసుకుని పూర్వ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ద ప్రసాద్ అభినందనలు తెలియజేశారు.దివిసీమ ఉప్పెనలో దీనదయాలపురం నిర్మాణ సమయంలో శ్రీ మండలి వెంకట కృష్ణారావుతో ఏర్పడిన అనుబందాన్ని గుర్తుచేసుకున్నారు.తెలుగు భాష విషయమై రాజీలేని పోరాటం చేస్తున్నందుకు శ్రీ బుద్ద ప్రసాద్ ని అభినందించారు.తెలుగు భాషను పరిరక్షించు కోవడం తెలుగు వారి కర్తవ్యం కావాలని దత్తాత్రేయ అన్నారు.