అతనో దివ్యాంగుడైన రైతు. పట్టాదారు పాసుపుస్తకం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అక్కడి మహిళా తహసీల్దారు కనికరించలేదు సరికదా భారీగా సొమ్ములు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులను ఆశ్రయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం తహసీల్దారు మేడిపల్లి సునీత గురువారం కొత్తపల్లికి చెందిన దివ్యాంగుడైన రైతు అయిత హరికృష్ణ వద్ద డబ్బులు తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. డీఎస్పీ మధుసూదన్, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం మండలం కొత్తపల్లి (సుందర్రాజ్‌పేట) శివారులోని సర్వే నంబరు-3లో హరికృష్ణకు 4.25 ఎకరాల భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన కొందరు అందులో తమకూ వాటా ఉందనడంతో వివాదాస్పదంగా మారింది. ఇరువర్గాలవారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తరువాత వారు రాజీకి వచ్చారు. మొత్తం భూమిలో హరికృష్ణ 2.25 ఎకరాలు, మరో వర్గం 2 ఎకరాలు పంచుకున్నారు. ఈక్రమంలో తన భూమికి పాసుపుస్తకం మంజూరు చేయాలంటూ జూన్ మొదటి వారంలో తహసీల్దారుకు హరికృష్ణ దరఖాస్తు చేసుకున్నారు. ఆ భూమి వివాదంలో ఉందని, రూ.5 లక్షలు ఇస్తేనే పుస్తకం మంజూరు చేస్తానని తహసీల్దారు చెప్పగా.. అప్పటికప్పుడు రూ.50 వేలు చెల్లించారు. మరో రూ.3 లక్షలు ఇస్తేనే పని అవుతుందని తహశీల్దారు చెప్పడంతో.. తన పరిస్థితిని హరికృష్ణ తన బావమరిదికి వివరించారు. ఈ నెల 12న వారిద్దరూ అనిశా అధికారులను సంప్రదించారు. గురువారం ఆమె కార్యాలయంలోనే హరికృష్ణ రూ.2 లక్షల నగదు ఇస్తుండగా.. అధికారులు తహసీల్దారు సునీతను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
దివ్యాంగులను కూడా కనికరించని తహసీల్దార్ ఈమె. అనిశా వలలో ఇరుక్కుంది.
Related tags :