Movies

పోలీసులకు ₹25లక్షలు ఇచ్చిన రాజ్ కుంద్రా-తాజావార్తలు

పోలీసులకు ₹25లక్షలు ఇచ్చిన రాజ్ కుంద్రా-తాజావార్తలు

* ‘పోర్న్‌ రాకెట్‌’ కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఒకానొక సమయంలో పోలీసులకు లక్షల్లో లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యశ్‌ ఠాకూర్‌ మార్చి నెలలో ఏసీబీకి (అవినీతి నిరోధక శాఖ) ఈ విషయంపై ఓ మెయిల్‌ పెట్టినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోర్న్‌ సినిమాలు చిత్రీకరిస్తున్నారన్న సమాచారంతో ముంబయిలోని ఓ బంగ్లాపై దాడి చేసిన పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా యశ్‌ ఠాకూర్‌ని సైతం అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలోనే రాజ్‌కుంద్రా పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే, తనని అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు.. ఈ కేసులో తన పేరు లేకుండా చేసుకునేందుకు రాజ్‌కుంద్రా అప్పట్లో ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు రూ.25 లక్షలు లంచంగా ఇచ్చారంటూ మార్చి నెలలో యశ్‌ ఠాకూర్‌ ఏసీబీకి మెయిల్‌ పంపించినట్లు తాజాగా పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. ‘పోర్న్‌ రాకెట్‌’ గుట్టు బయటపెట్టిన ఆ వీడియో షూట్‌.. కేవలం వెబ్‌సిరీస్‌ కోసమేనని.. పోర్న్‌ కాదని రాజ్‌కుంద్రా తరఫు న్యాయవాది కోర్టు తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 70,727 పరీక్షలు నిర్వహించగా.. 1,843 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,48,592 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 12 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,209కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,199 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,11,812కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,571 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,39,09,363 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

* ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని అధికారులు వెల్లడించారు. రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఎగువమానేరు జలాశయం నిండుకుండలా మారింది. పాల్వంచ, కూడవెల్లి వాగుల నుంచి ఎగువమానేరులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. నిర్మల్‌ జిల్లా భైంసా ఆటోనగర్‌లో 60 కుటుంబాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. జగిత్యాల జిల్లా రాయికల్‌లో 19.25 సెంటీమీటర్లు, కుమురంభీం జిల్లా వెంకట్రావుపేటలో 17.3, నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌ మండలం జామ్‌లో 16.1, సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 20కి పైగా ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.

* భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉద్ధృతి పెరుగుతున్నందున యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు, అధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం సమీక్ష నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తక్షణమే పరిస్థితులను పర్యవేక్షించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఆయన ఆదేశించారు. అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిర్మల్ పట్టణం ఇప్పటికే నీటమునిగిందని.. అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని గోదావరి పరీవాహక ప్రాంత కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులను సీఎం ఆదేశించారు.

* యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు ఠాణాలో దళిత మహిళ లాకప్‌డెత్‌ కేసులో ముగ్గురు పోలీసులపై వేటు పడింది. ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు విధుల నుంచి తొలగించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడేనికి చెందిన మరియమ్మను జూన్‌ 18న రూ. 2 లక్షల దొంగతనం కేసులో అడ్డగూడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజు ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్‌, అతడి స్నేహితుడు వేముల శంకర్‌ను విచారించి రూ. 1.35 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా డబ్బుల కోసం మరియమ్మను ఠాణాకు పిలిపించి ప్రశ్నించారు. విచారణ సమయంలో ఆమె స్పృహ కోల్పోవడంతో పోలీసులు స్థానిక ఆర్‌ఎంపీకి చూపించారు. తర్వాత భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో కలకలం రేగింది. పోలీసులు కొట్టడం వల్లే మరియమ్మ మృతిచెందినట్లు ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, వివిధ పార్టీలు, దళిత, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. దీంతో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ మల్కాజిగిరి ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌రావును విచారణ అధికారిగా నియమించారు. లోతుగా విచారించగా.. నిబంధనలకు విరుద్ధంగా పోలీసు సిబ్బంది ఆమెపై చేయి చేసుకున్నారని, స్పృహ తప్పిపడిపోయిన ఆమెకు సత్వరం వైద్య సదుపాయం కల్పించడంలో కూడా నిరక్ష్యంగా వ్యవహరించారని తేలినట్లు సమాచారం. ఏసీపీ నివేదిక ఆధారంగా ఎస్‌ఐ వి.మహేశ్వర్‌, కానిస్టేబుళ్లు ఎంఏ రషీద్‌, పి.జానయ్యను విధుల నుంచి తొలగిస్తూ రాచకొండ సీపీ మంగళవారం రాత్రి ఉత్తర్వులు వెలువరించారు. ఉద్వాసనకు గురైన పోలీసులు దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు సమాచారం.

* అశ్లీల చిత్రాలు నిర్మించి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారన్న ఆరోపణలతో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీస్‌ కస్టడీలో ఉన్న రాజ్‌కుంద్రా కేసు విచారణలో భాగంగా ఆయన తరఫు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్టుకి కారణమైన వీడియో షూట్‌ ఏదైతే ఉందో అది కేవలం వెబ్‌సిరీస్‌ చిత్రీకరణేనని అన్నారు. అది పోర్న్‌ కానే కాదని ఆయన తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలను రేపు ప్రకటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను examresults.ap.ac.in bie.ap.gov.in results.bie.ap.gov.in results.apcfss.in వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు.

* పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడం తప్పుకాదని.. చేస్తే ఆ వివరాలు సమగ్రంగా ఉండాలని తెదేపా సీనియర్‌ నేత, ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. అప్పుల విషయాన్ని శాసనసభకు తెలపకుండా రహస్యంగా దాచారని ధ్వజమెత్తారు. సహజంగా ఏ అప్పు చేసినా లేదా ప్రభుత్వం ఏ గ్యారెంటీ ఇచ్చినా బడ్జెట్‌ పద్దులు ప్రవేశపెట్టే సమయంలో దాన్ని రాష్ట్ర శాసనసభకు వాల్యూమ్‌ 5/2 అనే పుస్తకంలో తెలపాలని చెప్పారు. అయితే ప్రభుత్వం అప్పులను ఆ పుస్తకంలో తెలియజేయకుండా దాచిందన్నారు. బ్యాంకులకు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వనందున ఆ పుస్తకంలో రాయలేదని ఆర్థిక మంత్రి బుగ్గన అంటున్నారని.. బ్యాంకులేమో గ్యారెంటీలు ఉన్నాయంటున్నాయని తెలిపారు.

* గత మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అదేశించారు. ఈమేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాల వల్ల ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అరవింద్‌ కుమార్‌ను కేటీఆర్‌ ఆదేశించారు.

* ఏపీలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, లెక్కలను ప్రభుత్వం గోప్యంగా ఎందుకు ఉంచుతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి ఈ వివరాలను ఎందుకు తొలగించారో రైతులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటనలో విడుదల చేశారు. రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ నెలాఖరులోగా ప్రతి గింజకూ డబ్బు చెల్లించాలని.. లేనిపక్షంలో రైతుల కోసం పోరాడతామని హెచ్చరించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులెందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.