రాష్ట్రంలోని 30 ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలకు జేఎన్‌టీయూహెచ్ షాక్ ఇచ్చింది. ఆయా కళాశాలలు కొత్త ప్రిన్సిపాళ్ల నియామకం కోసం 33 మందిని ప్రతిపాదించగా 30 పేర్లను వర్సిటీ తిరస్కరించింది. అవి అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) 2019 నిబంధనలకు అనుసరించి లేవని పేర్కొంది. తిరస్కరణకు గురైన వాటిల్లో మొత్తం 20 ఇంజినీరింగ్, 10 ఫార్మసీ కళాశాలలున్నాయని అధికారులు తెలిపారు. ఇంతక్రితం వరకూ అయితే 13 సంవత్సరాల అనుభవంతోపాటు పీహెచ్‌డీ ఉంటే ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు ప్రిన్సిపల్‌గా నియమించుకోవచ్చు. ఏఐసీటీఈ 2019 మార్చి 1వ తేదీన జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 15 సంవత్సరాల అనుభవంతోపాటు పీహెచ్‌డీ అవసరం. ఆ పదిహేనేళ్ల అనుభవంలో మూడు సంవత్సరాలు ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండడం తప్పనిసరి. ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించి ఉండాలి. మొత్తం ఎనిమిది పరిశోధన పత్రాలు ఆయా జర్నళ్లలో ప్రచురితం కావాలి. పలు కళాశాలల ప్రిన్సిపాళ్లు ఒక దాని నుంచి మరో కళాశాలకు మారడం, మరో వృత్తిలోకి వెళ్లడం తదితర కారణాల వల్ల కొత్త వారిని ఎంపిక చేసిన 33 కళాశాలలు జేఎన్‌టీయూహెచ్ ఆమోదం(ర్యాటిఫై) కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అందులో ముగ్గురి అర్హతలు మాత్రమే ఏఐసీటీఈ 2019 నిబంధనల ప్రకారం ఉన్నాయి.
రికార్డు సంఖ్యలో ప్రిన్సిపాళ్లను తిరస్కరించిన JNTUH
Related tags :