* కరోనా వైరస్ రాకతో భారత్‌లో నిరుద్యోగ రేటు గణనీయంగా పెరిగింది. సెంటర్ ఫర్ ఎకనామిక్ డేటా అండ్ ఎనాలిసిస్ ప్రకారం…భారత నిరుద్యోగిత రేటు 2019లో 5.27 శాతంగా నమోదవ్వగా, 2020లో నిరుద్యోగిత రేటు గణనీయంగా 7.11 శాతానికి చేరుకుంది. కోవిడ్ రాకతో సుమారు 12.2 కోట్ల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా వైరస్ ఉదృతి తగ్గడంతో కంపెనీలు తిరిగి ఉద్యోగనియామాకాలను చేపట్టాయి.
* కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు మెడికల్ పరికరాల ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పల్స్ ఆక్సిమీటర్లు, బీపీ చెకింగ్ మెషిన్, నెబ్యూలైజర్, డిజిటల్ థర్మో మీటర్,గ్లూకో మీటర్ వంటి మెడికల్ పరికరాలకు కరోనా నేపథ్యంలో గణనీయంగా డిమాండ్ పెరిగింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఐదు మెడికల్ పరికరాలపై ట్రేడ్ మార్జిన్‌ను ప్రభుత్వం పరిమితం చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. దీంతో పలు మెడికల్ పరికరాల ధరలు గణనీయంగా తగ్గనున్నట్లు తెలిపారు. ఈ ధరలు జూలై 20 నుంచి అమలులోకి వస్తుందన్నారు. 2022 జనవరి 31 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ధరలు అమలులో ఉండనున్నాయి. ఫార్మాస్యూటికల్ డ్రగ్స్, సంబంధిత పరికరాల ధరలను నియంత్రించే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ), ప్రైజ్ టూ డిస్ట్రిబ్యూటర్ (పిటిడి) స్థాయిలో 70 శాతం ధరలను పరిమితం చేసింది. పరిశ్రమల సంఘాలైన ఫిక్కీ, అద్వామెడ్, అమ్చామ్ సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఐదు మెడికల్ పరికరాలకు చెందిన 684 ఉత్పత్తులు, 620 ఇతర ఉత్పత్తులు ఎమ్‌ఆర్‌పీ ధరల్లో సుమారు 88 శాతం తగ్గనున్నాయి.
* ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో దూసుకుపోతున్న టెస్లా కంపెనీకి పోటీగా మెర్సిడిజ్ బెంజ్ సంచలనం నిర్ణయం తీసుకుంది. మెర్సిడెస్ బెంజ్‌తయారీదారు డైమ్లెర్ 2030 నాటికి 40 బిలియన్ల యూరోలను(సుమారు రూ. 3, 50,442 కోట్లు ) ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తోంది. డైమ్లెర్ నిర్ణయంతో టెక్నాలజీ మార్పులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై కోత విధించే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెర్సిడిజ్ బెంజ్ తన ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తు ప్రణాళికలను ప్రకటించింది. ఇతర భాగస్వాములతో సుమారు ఎనిమిది బ్యాటరీ ప్లాంట్లను ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకుంది. 2025 నుంచి, అన్ని కొత్త వాహన ప్లాట్‌ఫాంలలో ఈవీలను మాత్రమే తయారు చేస్తామని జర్మన్ లగ్జరీ వాహన తయారీ సంస్థ బెంజ్ పేర్కొంది. 2025 వరకు సాంప్రదాయ పెట్రోలు వాహనాల ఉత్పత్తిని జీరో చేయాలని భావిస్తోందని కంపెనీ చీఫ్ ఓలా కొల్లెనియస్ పేర్కొన్నారు. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించడానికి పలు కంపెనీలు కీలక నిర్ణయాలను తీసుకున్నాయి. జనరల్ మోటార్స్, 2035, వోల్వో కార్స్ 2030 నాటికి పూర్తిగా శిలాజ ఇంధనాల వాహనాల ఉత్పత్తిని నిలిపివేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనరంగంలో టెస్లాకు పోటీగా ఎదగాలని కంపెనీలు ప్రణాళికలను రచిస్తున్నాయి.
* అవినీతి ఆరోపణలు, రాజకీయ విమర్శల కారణంగా.. భారత్ బయోటెక్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రెజిల్‌తో కుదుర్చుకున్న కోవిడ్ వ్యాక్సిన్ ఒప‍్పందాన్ని రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బ్రెజిల్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కరోనా కారణంగా 2లక్షల మందికి పైగా మరణించడంతో అధ్యక్షుడిపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ త్వరగతిన సరఫరా కోసం బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బొల్సొనారో మనదేశానికి చెందిన భారత్ బయోటెక్‌తో ఒప్పందం కుదర్చుకున్నారు. భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ను బ్రెజిల్ మార్కెట్‌లో విడుదల చేసేందుకు బొల్సొనారో మధ్యవర్తిగా ప్రముఖ ఫార్మసంస్థ ప్రెసిస మెడికామెంటోస్,ఎన్విక్సియా ఫార్మాసూటికల్స్ అనుమతించారు. ఈ క్రమంలో… ఒక్కోడోసు 15 డాలర్ల చొప్పున 300 మిలియన్ డాలర్లు విలువ చేసే 20 మిలియన్ డోసులను తెప్పించుకునేందుకు బొల్సొనారో సర్కార్ ఒప్పందం చేసుకుంది.. అయితే ఈ వ్యాక్సిన్ ఒప్పందంలో బొల్సొనారోపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కోవాగ్జిన్‌ను తన సన్నిహితులకు చెందిన ఫార్మా సంస్థ ప్రెసిసా మెడికామెంటోస్‌కు అప్పగించడం ద్వారా ఏకంగా 10 కోట్ల డాలర్లు (రూ. 734 కోట్లు) ముడుపులు అందుకున్నారని ఆయనపై విమర్శలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కూడా విచారణకు ఆదేశించింది.
* మ్యూజిక్ వీడియో స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్ సంచలన రికార్డు నమోదు చేసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి 10 బిలియన్ డౌన్‌లోడ్స్ పూర్తి చేసుకున్న తొలి యాప్‌గా ఘనత దక్కించుకుంది. ఈ మేరకు 9టు5 గూగుల్ అనే వెబ్‌సైట్ కథనం ప్రచురించింది. ప్లే స్టోర్‌లో ఇదో అరుదైన రికార్డ్ అని పేర్కొంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇదంతా ప్రీ ఇన్‌స్టాలేషన్‌తో కలిపే అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక గూగుల్ సంబంధిత లిస్ట్‌లో యూట్యూబ్ తర్వాత గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్, గూగుల్ టెక్స్ టు స్పీచ్, జీమెయిల్ తర్వాతి స్థానాల్లో 5 బిలియన్ల డౌన్‌లోడ్స్‌కి పైగా ఉన్నాయి.