NRI-NRT

బైడెన్ పిలుపుకై భారతీయుల ఎదురుచూపు-TNI ప్రత్యేకం

Indian B1-B2 Holders Waiting For Biden To Open Doors To USA

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వ్యాధి ఇంకా అదుపులోకి రాకపోవడంతో ప్రపంచంలోని చాలా దేశాలు భారతీయులు తమ దేశానికి రావడంపై ఆమ్కలు విధించాయి. ముఖ్యంగా అమెరికా భారత్ నుండి వచ్చే పర్యాటకులను తమ దేశానికి రాకుండా కట్టడి చేసింది. దీనితో వేలాది మంది భారతీయులు అమెరికాలో తమ వారిని కలుసుకునేందుకు పర్యటన జరపడం కోసం ఆ దేశ ప్రభుత్వం ఇచ్చే గ్రీన్ సిగ్నల్ కోసం ముఖ్యంగా బైడెన్ అనుమతి కోసం వీరంత ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటించడానికి భారత్ నుండి వెళ్లే కొన్ని కేటగిరీలకు చెందిన వారికి మాత్రమే అనుమతి లభిస్తోంది. H1, H4, F1 వీసాలు కలిగిన వారికి ప్రస్తుతం అమెరికాలో ప్రవేశించేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీనితో ఎయిరిండియా, ఖతార్, లుఫ్తాన్సా, బ్రిటీష్ ఎయిర్‌వేస్ వంటి కొన్ని విమానయాన సంస్థలు వారానికి 3-4 రోజుల పాటు భారత్ నుండి అమెరికాకు నడుపుతున్నాయి. ఈ విమానాల్లో రద్దీ కూడా తీవ్రంగా ఉంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భారత్ నుండి లక్షల సంఖ్యలో అమెరికాలోని వివిధ యూనివర్శిటీల్లో విద్యభ్యాసానికి విద్యార్థులు తరలి వెళ్తున్నారు. అమెరికా కాన్సులేట్లలో విద్యార్థులకు దాదాపు 90శాతానికి పైగా ఇంటర్వ్యూలకు హాజరయిన వారందరికీ ఆ దేశంలో చదువుకునేందుకు వీసాలు మంజూరు చేస్తున్నారు. దీనితో అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య గతం కన్నా రెట్టింపు అయింది. ఇది గమనించిన విమాన సంస్థలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను దోచుకోవడం ప్రారంభించాయి. ప్రస్తుతం లక్షా50వేల నుండి 2లక్షల రూపాయిలను వన్‌వే టికెట్ ధరగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా యూనివర్శిటీలు ఆగష్టు 11 నుండి 18వ తేదీ లోపుగా వీసాలు పొందిన విద్యార్థులు హాజరు కావాలని షరతులు పెట్టడంతో విమానాల్లో టికెట్లు అన్నీ నిండుకున్నాయి. మరికొన్ని విమానయాన సంస్థలు భారత్ నుండి ఇతర దేశాలకు విమానాలు నడపడానికి ఇంకా అనుమతులు పొందలేదు. ఎమిరేట్స్, ఎతిహాద్ వంటి సంస్థలు ఇంకా తమ విమానాలు భారత్ నుండి నడపడానికి ముందుకు రావడం లేదు. B1, B2 వీసాలు ఉన్న చాలామంది పర్యాటకులు, అమెరికాలో కుటుంబ సభ్యులు కలిగిన వారు అమెరికా వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. B1,B2 ఉన్నవారిపై అమెరికా నిషేధం విధించింది. ఇండియాలో కోవిద్ పరిస్థితి చక్కబడితే తప్ప వారిని అమెరికాకు అనుమతించే పరిస్థితి కనిపించడం లేదు. తమ వారిని చూడాలని కొందరు అమెరికా పర్యటనకు వెళ్లాలని మరికొందరు భావిస్తున్నారు. ఆగష్టు మొదటివారంలోనైనా బైడెన్ B1-B2 వీసాదారులను అమెరికా రానిస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.