Sports

హాకీ…స్విమ్మింగ్‌లో ఓటమి. బాక్సింగ్‌లో శుభవార్త

హాకీ…స్విమ్మింగ్‌లో ఓటమి. బాక్సింగ్‌లో శుభవార్త

టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఆదివారం ప్రపంచ నంబర్‌ వన్‌ టీమ్‌ ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవం పాలైంది. పూల్‌-ఏలోని రెండో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 1-7 తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆది నుంచి ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా ఏ దశలోనూ భారత్‌కు అవకాశమివ్వలేదు. దాంతో భారత్‌పై సునాయాస విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా ఒలింపిక్స్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలుపొందడం గమనార్హం. అంతకుముందు టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 3-2 తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్విమ్మర్‌ మానా పటేల్‌ ఆదివారం నిరాశపర్చింది. మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ విభాగం హీట్‌-1లో ఆమె రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మానాపటేల్‌ ‘యూనివర్సాలిటీ కోటా’ కింద ఈ విశ్వక్రీడల్లో పోటీపడుతోంది. ఈ క్రమంలోనే నేడు జరిగిన మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ విభాగంలో రెండో స్థానంలో నిలిచి మొత్తంగా 39వ స్థానం సంపాదించింది. దాంతో సెమీఫైనల్స్‌కు వెళ్లలేకపోయింది. మానా 1:05.20 నిమిషాల్లో ఈ పోటీలను పూర్తి చేయగా జింబాబ్వేకు చెందిన స్విమ్మర్‌ డొటానా కటాయి 1:02.73 నిమిషాల్లో పూర్తి చేసి తొలి స్థానం సంపాదించింది. ఇక గ్రెనాడాకు చెందిన కింబర్లీ ఇన్స్‌ 1:10.24 నిమిషాల్లో మూడోస్థానంతో సరిపెట్టుకుంది. ఇక్కడ టాప్‌-16లో నిలిచిన స్విమ్మర్లే సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ తొలి రౌండ్‌లో అదరగొట్టే ప్రదర్శనతో ప్రీ క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన మహిళల ఫ్లైవెయిట్‌(48-51) విభాగం 32వ రౌండ్‌లో డొమినికన్‌ బాక్సర్‌ హెర్నాండెజ్‌ గార్షియాపై 4-1 తేడాతో గెలుపొందింది. దాంతో మేరీ 16వ రౌండ్‌కు చేరింది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో బాక్సింగ్‌ దిగ్గజం తన నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ప్రత్యర్థిపై పంచుల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే వయసులో తనకన్నా 15 ఏళ్లు చిన్నదైన హెర్నాండెజ్‌ను అలవోకగా ఓడించి తొలిరౌండ్‌లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. ఇక తదుపరి మ్యాచ్‌లో మేరీ ఈనెల 29న కొలంబియాకు చెందిన వాలెన్సియా విక్టోరియా ఇంగ్రిట్‌తో ప్రీ క్వార్టర్స్‌లో తలపడనుంది. అక్కడా విజయం సాధిస్తే భారత బాక్సర్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు వెళ్లనుంది.

టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా జరుగుతున్న టేబుల్‌ టెన్నిస్‌ వుమెన్స్‌ సింగిల్స్‌ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. రెండో రౌండ్‌లో ఉక్రెయిన్‌ అథ్లెట్‌ పెసోట్స్కా మార్గారిటాపై భారత అథ్లెట్‌ మణికా బథ్రా 4-3 తేడాతో గెలుపొందింది. 7 గేమ్స్‌లకు గానూ నాలుగు గేమ్స్‌లో ప్రత్యర్థిపై మణిక పైచేయి సాధించింది. దీంతో ఆమె ప్రీక్వార్టర్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో సోఫియా పోల్కనోవాతో మణిక తలపడనుంది. నిన్న జరిగిన తొలిరౌండ్‌లో మణిక బ్రిటన్‌పై 4-0తో గెలుపొందింది.

‘‘22 కోట్ల జనాభా గల దేశం నుంచి ఒలింపిక్స్‌కు కేవలం 10 మంది ఆటగాళ్లే. ఇది నిజంగా విచారకరం. క్రీడల్లో పాకిస్థాన్‌ ఈ స్థాయికి దిగజారడానికి బాధ్యులైన ప్రతిఒక్కరికీ ఇది సిగ్గుచేటు’’ పాక్‌ మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్ నాజిర్‌ అన్న మాటలివి. టోక్యో ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ నుంచి 10 మంది మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుండడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 2012 ఒలింపిక్స్‌కి.. ఇప్పటికీ పరిస్థితులు ఎలా మారాయో అద్దం పట్టే ఓ చిత్రాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

టోక్యో ఒలింపిక్స్‌లో తెలుగు తేజం, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు శుభారంభం చేసింది. గ్రూప్‌-జె తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పోలికర్పోవాపై విజయం సాధించింది. 21-7, 21-10 తేడాతో సింధు గెలుపొందింది. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. మనుబాకర్‌, యశస్విని ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మనుబాకర్‌ 12వ స్థానంలో, యశస్విని 13వ స్థానంలో నిలిచారు.