Business

TVS ఈ-బండి ధర ₹1.24లక్షలు-వాణిజ్యం

TVS ఈ-బండి ధర ₹1.24లక్షలు-వాణిజ్యం

* కొవిడ్‌ బాధితుల చికిత్సలో కీలకంగా మారిన పల్స్‌ ఆక్సీమీటర్, నెబ్యులైజర్‌ వంటి 5 రకాల వైద్య పరికరాల ధరలు 88 శాతం వరకు తగ్గాయని రసాయనాలు, ఎరువుల శాఖ తెలిపింది. కొవిడ్‌ బాధితుల శ్వాస, చక్కెర శాతం, రక్తపోటు, జ్వరం పరీక్షించేందుకు ఉపయోగించే పల్స్‌ ఆక్సీమీటర్, గ్లూకోమీటర్, బీపీ మానిటర్, డిజిటల్‌ థర్మామీటర్‌తో పాటు శ్వాస సంబంధ ససమ్యలు పరిష్కరించేందుకు వినియోగించే నెబ్యులైజర్‌ ధరలు కూడా గణనీయంగా పెంచి విక్రయించారు. వీటిని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే ట్రేడ్‌ మార్జిన్‌ను గరిష్ఠంగా 70 శాతానికి పరిమితం చేస్తూ, నేషనల్‌ ఫార్మాస్యూటికల్స్‌ ప్రైసింగ్‌ అథారిటీ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈనెల 20 నుంచి ఈ వైద్య పరికరాల ధరలు దిగొచ్చినట్లు పేర్కొంది. 2021, జులై 23 నాటికి 684 బ్రాండ్ల వైద్య పరికరాలు నమోదు కాగా.. 620 (91 శాతం) పరికరాల ఎంఆర్‌పీ ధరలను ఆయా సంస్థలు సవరించాయి. ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్‌కు అందించే ధర, ఎంఆర్‌పీ మధ్య 709 శాతం వరకు వ్యత్యాసం ఉంది. దీన్ని 10 రెట్లకు పైగా తగ్గించారు.

* త్వరలోనే పబ్లిక్‌ ఇష్యూకి (ఐపీఓ) రానున్న భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)లో ఒకేసారి 10శాతం వాటా కాకుండా.. రెండు దశల్లో పెట్టుబడిని ఉపసంహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ సంస్థల నుంచి రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో ఎల్‌ఐసీ ఐపీఓ ఎంతో కీలకం. అయితే, ఎల్‌ఐసీ విలువ రూ.12-15 లక్షల కోట్ల మేరకు ఉంది.ముందే అనుకున్నట్లు 10 శాతం వాటాను విక్రయించేందుకు షేర్లను జారీ చేస్తే.. దాదాపు రూ.1.2-1.5 లక్షల కోట్ల మేరకు ఉంటుంది. ఇంత మొత్తాన్ని ఒకేసారి సమీకరిస్తే.. పబ్లిక్‌ ఇష్యూకి రావాలనుకున్న ఇతర ప్రైవేటు సంస్థలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

* 2013కు ముందు వినని పదం ఇది. ఎప్పుడైతే టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తన ప్రతిపాదిత లిథియం అయాన్‌ బ్యాటరీ తయారీ ప్లాంటుకు ‘గిగాఫ్యాక్టరీ’ అని పేరుపెట్టారో.. అప్పటి నుంచి ఈ పదం ప్రాచర్యంలోకి వచ్చింది. గిగా అంటే 100 కోట్లని అర్థం. అయితే ఇక్కడ మాత్రం బ్యాటరీ తయారీ ప్లాంటు అది కూడా భారీ స్థాయిలో పలు కంపెనీలు, విడిభాగాలను ఒకదగ్గర చేర్చే ప్లాంటును గిగాఫ్యాక్టరీగా పేర్కొంటున్నారు. బ్యాటరీ సామర్థ్యాన్ని తెలిపే కిలోవాట్‌ అవర్‌ లేదా మెగా వాట్‌ అవర్‌ను ఇపుడు గిగావాట్‌ అవర్‌ దాకా తీసుకెళ్లారు. ఉదాహరణకు 2018లోనే టెస్లా వార్షిక సామర్థ్యం 20 గిగావాట్‌అవర్‌ (జీడబ్ల్యూహెచ్‌)కు చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ ప్లాంటుగా ఇది మారింది. గిగాఫ్యాక్టరీల ఏర్పాటుకు ఏళ్ల సమయం పట్టదని కూడా ఎలాన్‌మస్క్‌ నిరూపించారు. తన గిగాఫ్యాక్టరీ 4ను ప్రపంచంలోనే అత్యంత వేగంగా నిర్మితమైన ఫ్యాక్టరీగా చూడాలని ఆయన భావిస్తున్నారు.

* టీవీఎస్‌‌ మోటార్‌‌ కంపెనీ ఐక్యూబ్‌‌ పేరుతో ఎలక్ట్రిక్ టూవీలర్‌‌ను కొచ్చి సిటీలో లాంచ్‌‌ చేసింది. ఇందులోని బ్యాటరీని ఒకసారి చార్జ్‌‌ చేస్తే 75 కిలోమీటర్లు వెళ్లొచ్చు. మ్యాగ్జిమమ్‌‌ స్పీడ్‌‌ గంటకు 78 కిలోమీటర్లు. స్మార్ట్‌‌ ఎక్స్‌‌హోం చార్జింగ్‌‌, బ్లూటూత్‌‌, లైవ్‌‌ చార్జింగ్‌‌ స్టేటస్‌‌, ఆర్‌‌ఎఫ్‌‌ఐడీ సెక్యూరిటీ వంటి ఫీచర్లు ఉంటాయి. ధర రూ.1.24 లక్షలు.