ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)కు చికాగోకు చెందిన నార్త్ వెస్టర్న్ మెడిసిన్ సంస్థ భారీ విరాళాన్ని ప్రకటించింది. తానా ఘన గత చరిత్ర, సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర, తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన సహాయక చర్యలకు స్పందించి $3.85మిలియన్ డాలర్ల (₹28కోట్ల68లక్షలు) విలువైన కోవిద్ సహాయక సామాగ్రిని అందించేందుకు ముందుకు వచ్చింది. 1972లో ఏర్పాటు చేసిన ఈ సంస్థకు పలు ప్రాంతాల్లో ఆసుపత్రులు ఉన్నాయి. కోవిద్ సహాయక సామాగ్రి రూపేణా బూటు కవర్లు, టోపీలు, మాస్కులు, కంటి అద్దాలు వగైరా అందజేయనున్నట్లు తానాకు సోమవారం రాసిన లేఖలో పేర్కొన్నారు.
* రెడ్‌క్రాస్‌తో కలిసి పనిచేస్తాం: కోశాధికారి కొల్లా అశోక్‌బాబు
చికాగోకు చెందిన నార్త్ వెస్టర్న్ మెడిసిన్ సంస్థ తానా నిబద్ధతను గుర్తించి భారీ విరాళం అందజేయడాన్ని ఇటీవలే కోశాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొల్లా అశోక్‌బాబు స్వాగతించారు. మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, మాజీ ఫౌండేషన్ ఛైర్మన్ నిరంజన్ శృంగవరపుల చొరవతో ఈ సంస్థతో చర్చలు జరిపామని, తానా పట్ల నమ్మకంతో ఈ భారీ విరాళాన్ని వారు అందజేయడం వెనుక తానా కార్యవర్గ సభ్యుల కృషి మరువలేనిదని పేర్కొన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి నేతృత్వంలో ఈ సామాగ్రిని ప్రభావవంతంగా తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసేందుకు ప్రణాళికలు త్వరితగతిన రూపొందిస్తున్నామని అశోక్ తెలిపారు. 22కంటైనర్లలో 2నెలల్లో విశాఖ తీరానికి ఈ సామాగ్రి చేరుకుంటాయని, అక్కడి నుండి రెడ్ క్రాస్ సంస్థ సమన్వయంతో వారి గోడౌన్‌లలో వీటిని భద్రపరిచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వీటిని పెద్ద ఎత్తున పకడ్బందీగా పంపిణీ చేస్తామని అన్నారు.
More info about Northwestern Medicine: https://www.nm.org/