Politics

కరోనాపై జగన్ సమీక్ష-తాజావార్తలు

కరోనాపై జగన్ సమీక్ష-తాజావార్తలు

* పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. అంతకుముందు అధికారులు సైరన్‌ మోగించారు. పరివాహాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 881.5 అడుగులకు నీరు చేరింది.

* కర్ణాటక 20వ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కొలువుతీరారు. ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ బొమ్మైతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముందు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి ఆయన రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.

* దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా మరోసారి కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. మంగళవారం 17,36,857 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 43,654 మందికి వైరస్‌ సోకింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 47 శాతం పెరుగుదల కనిపించింది. నిన్న మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో 3.14 కోట్ల కేసులు వెలుగుచూడగా.. 4,22,022 మంది మహమ్మారికి బలయ్యారని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

* కరోనా వైరస్‌ నుంచి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ 93శాతం రక్షణ కల్పిస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా మరణాలు సంభవించే ప్రమాదాన్ని 98శాతం తగ్గిస్తోన్నట్లు తెలిపింది. సెకండ్‌ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్‌ విజృంభిస్తోన్న సమయంలో కొవిషీల్డ్‌ ప్రభావంపై దేశవ్యాప్తంగా 15లక్షల మంది వైద్యులు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లపై ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజీ (AFMC) జరిపిన అధ్యయన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

* మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి రాసలీల సీడీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు చట్టబద్ధమా అనే విషయంపై హైకోర్టు పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఈ కేసులో బాధిత యువతి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు సీజే జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా, జస్టిస్‌ ఎన్‌ఎస్‌ సంజయ్‌ గౌడల ధర్మాసనం విచారించింది. సిట్‌ విచారణ కొనసాగింపుపై తాము పరిశీలన చేయాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. సిట్‌ చీఫ్, అదనపు పోలీసు కమిషనర్‌ సౌమేందు ముఖర్జీ గత మే నెల 1 నుంచి సెలవులో ఉన్నారని, ఆయన గైర్హాజరీలో జరిగిన సిట్‌ విచారణ చట్టబద్ధమా కాదా అనే విషయం పరిశీలించాల్సి ఉందని వెల్లడించింది. ఆయన లేకుండానే దర్యాప్తు కొనసాగిస్తారా, దీనిపై సమాధానం ఇవ్వాలని సిట్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసులో తుది నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 12కు వాయిదా వేసింది.

* లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో జనాలు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కరోనా పోకముందే షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్స్‌కు క్యూ కడుతున్నారు. కోవిడ్‌ నిబంధనలను గాలికొదిలేసిన ప్రజలు ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్‌ నిబంధనలు పాటించకపోవంతో తిరుపతిలోని సౌత్‌ ఇండియా షాపింగ్‌మాల్‌కు భారీ జరిమానా విధించారు. షాపింగ్‌మాల్‌ను సందర్శించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరిషా అక్కడి జనాల్ని చూసి అవాక్యయారు. షాపింగ్‌ మాల్‌కు వచ్చిన జనాలు మాస్క్‌లు లేకుండా భౌతిక దూరం పాటించకుండా ఉండటం గుర్తించిన కమిషనర్‌ మాల్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో షాపింగ్‌ మాల్‌పై రూ.50 వేలు జరిమానా విధించారు. మరోసారి కోవిడ్‌ నిబంధనలు పాటించకపోతే 50 లక్షల జరిమానా విధించడంతోపాటు షాప్‌ను సీజ్‌ చేస్తామని కమిషనర్‌ బెదిరించారు. తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని. భౌతిక దూరం పాటించాలని కోరారు. నిబంధనలు పాటించకపోతే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా రూల్స్‌ పాటించాలన్నారు.

* సోనూసూద్‌.. ఇతని గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. సాయం అనే పదం ఎక్కడ విన్న ఈ పేరే వినిపిస్తోంది. కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న ఎంతో మందిని ఆదుకున్న సోనూసూద్.. కొద్ది రోజుల నుంచి కొత్త అవతారం ఎత్తి మరిన్ని బాధ్యతలను నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు మద్దతు ఇస్తున్నాడు. సైకిల్‌పై గుడ్లు, బ్రెడ్ తదితర తినుబంఢారాలను పెట్టుకొని అమ్మడం నుంచి పంజాబీ దాబా ద్వారా తందూరి రొట్టెలు అమ్మడం ప్రారంభించాడు. సోనూసూద్ దా పంజాబీ ధాబా.. ఇక్కడ దాల్.. రోటీ ఉచితమే’ అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు.

* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కరోనా వైరస్‌ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. థర్డ్ వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘కాన్సన్‌ట్రేటర్లు, డీటైప్‌సిలెండర్లు, ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధవహించాలి. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఉంచాలి. జిల్లాల వారీగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి. ఏపీఎంఎస్‌ఐడీసీలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేయాలి’’ అని అధికారులను ఆదేశించారు.

* నీలి చిత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు దర్శకుడు తన్వీర్‌ హష్మిని మూడు గంటల పాటు విచారించారు. ఈ కేసులో అరెస్టయి బెయిల్‌ మీద బయటకు వచ్చిన అతడు తాజాగా మాట్లాడుతూ జీవితంలో ఇప్పటివరకు రాజ్‌ కుంద్రాను కలవనేలేదన్నాడు. తాము నగ్నచిత్రాలు తీసినప్పటికీ కుంద్రా కంపెనీతో తమకెలాంటి సంబంధం లేదన్నాడు.

* తన ప్రీపెయిడ్ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. నేడు(జూలై 28) ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్ ప్లాన్ ధరలను సవరించినట్లు ప్రకటించింది. ఎంట్రీ లెవల్ ప్లాన్ ధరను దాదాపు 60 శాతం పెంచింది. టెలికాం ఆపరేటర్ తన రూ.49 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ను నిలిపివేసినట్లు తెలిపింది. కంపెనీ బేసిక్ ప్రీపెయిడ్ ప్యాక్స్ ఇప్పుడు రూ.79 స్మార్ట్ రీఛార్జ్ నుంచి ప్రారంభమవుతాయని, డబుల్ డేటాతో పాటు వినియోగదారులకు నాలుగు రెట్లు ఎక్కువ అవుట్ గోయింగ్ మినిట్స్ వినియోగాన్ని అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

* బిలియనీర్‌, అగ్రికల్చరల్‌ టైకూన్‌ సన్‌ దావూకు (66) చైనా భారీ షాక్‌ ఇచ్చింది. ఇటీవల పలువురు ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు జైలు శిక్ష విధించిన జిన్‌పింగ్‌ ప్రభుత్వం తాజాగా సన్‌దావూకు 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టడం, ప్రభుత్వ పరిపాలనను అడ్డుకోవడం, అక్రమ మైనింగ్, వ్యవసాయ భూముల ​​ఆక్రమణ, అక్రమ నిధుల సేకరణ లాంటి నేరాల్లో సన్ దావూ దోషిగా తేలారని బీజింగ్ సమీపంలోని గావోబీడియన్‌ కోర్టు ప్రకటించింది. దీనిపై సన్‌ న్యాయవాదులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు.గ్రామీణ సంస్కరణల మద్దతుదారుడుగా పేరొందిన సన్‌ను రహస్యంగా విచారించిన అనంతరం చైనా కోర్టు అతనికి 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతేకాదు 3.11 మిలియన్ యవాన్ల (475,000 డాలర్ల) జరిమానా విధించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అనుభవజ్ఞుడైన సన్, తన సొంత సంస్థను స్థాపించడానికి ముందు ప్రభుత్వ యాజమాన్యంలోని అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనాలో పనిచేశారు. ఆ తరువాత భార‍్యతో కలిసి 1980లలో అగ్రికల్చరల్ అండ్ యానిమల్ హస్బెండరీ గ్రూప్ అనే భారీ సంస్థను నెలకొల్పారు. ఇందులో ప్రస్తుతం వేలాది మంది ఉద్యోగులున్నారు. అలాగే హెబీ ప్రావిన్స్‌లో 1,000 పడకల ఆసుపత్రి, ఇతర సౌకర్యాలతో దావు సిటీ అనే నగరాన్ని కూడా నిర్మించారు సన్‌ దావూ.ప్రభుత్వ బ్యాంకులపై విమర్శలు గుప్పిస్తూ 2000లో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ప్రధానంగా గ్రామీణ పెట్టుబడులను నిర్లక్ష్యం చేస్తూ, గ్రామీణుల పొదుపు సొమ్మును పట్టణ ప్రాజెక్టులవైపు మళ్లిస్తున్నారని సన్‌ ఆరోపించారు. దశాబ్దాలుగా చైనా గ్రామీణ విధానాలను తీవ్రంగా విమర్శించడంతోపాటు, రైతుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు వారికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలనేవారు. గ్రామీణ సంస్కరణలపై గొంతెత్తే సన్‌ 2019లో చైనాలో స్వైన్ ఫీవర్ విజృంభణపై కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.2003లో అక్రమ నిధుల వసూళ్లు ఆరోపణలతో సన్‌ను అరెస్ట్‌ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పలువురు మానవహక్కుల నేతలు, న్యాయవాదులు, విద్యావేత్తలు, పాత్రికేయుల నిరసనల కారణంగా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే 2021 మేలో సన్‌ను మరోసారి అరెస్ట్‌ చేసిన ప్రభుత్వం, అతని వ్యాపారాలను సీజ్‌ చేసింది. కాగా రియల్ ఎస్టేట్ మొగల్ రెన్ జికియాంగ్‌కు గత సంవత్సరం చైనా 18 సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

* సెహ్వాగ్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చహల్

* కరోనా మహమ్మారి ప్రభావం పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క సామన్య ప్రజలు ఎదుర్కొన్న అవస్థలను దగ్గరగా చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్.. బెడ్ల కొరత తీర్చేందుకు తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా, తన ఫౌండేషన్‌ (YouWeCan Foundation) ద్వారా తెలంగాణలోని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో 120 ఐసీయూ బెడ్స్‌కు సాయం అందించాడు.