Business

తెలంగాణాలో పతంజలి-వాణిజ్యం

తెలంగాణాలో పతంజలి-వాణిజ్యం

* ముకేశ్ అంబానీ సార‌ధ్యంలోని రిల‌య‌న్స్ రిటైల్‌లో విలీనానికి ఫ్యూచ‌ర్ రిటైల్ చేసుకున్న ఒప్పందంపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు రిజ‌ర్వు చేసింది. రూ.24,613 కోట్ల విలువైన ఈ ఒప్పందాన్ని స‌వాల్ చేస్తూ దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో గ్లోబ‌ల్ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

* వివిధ ఐటీ సంస్థ‌లు కొత్త వారికి భారీగా కొలువులు ఇచ్చేందుకు స‌న్న‌ద్ధం అవుతున్నాయి. తాజాగా అమెరికా ఐటీ జెయింట్ కాగ్నిజెంట్ ఇండియా ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ల‌క్ష మందిని నియ‌మించుకోవాల‌ని భావిస్తున్న‌ది. ఐటీ స‌ర్వీసులు, బీపీవో రంగాల్లో ప్ర‌తిభావంతులైన నిపుణుల‌ను నియ‌మించుకునేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ది.

* తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్‌ ముందుకొచ్చింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ వెహికిల్స్‌ తదితర రంగాల్లో పెట్టుబడులను తెచ్చేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. దీనిపై త్వరలోనే అక్కడి ప్రముఖ కంపెనీలతో ఒక వర్చువల్‌ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. తైవాన్‌కు చెందిన ఆర్థిక, సాంస్కృతిక కేంద్ర (టీఈసీసీ) బృందం బుధవారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావుతో భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ విధానాలతోపాటు టీఎస్‌ ఐ-పాస్‌ గురించి టీఈసీసీ డైరెక్టర్‌ జనరల్‌ బెన్‌ వాంగ్‌ నేతృత్వంలోని బృందానికి మంత్రి వివరించారు. ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్స్‌ ఇతర ప్రధాన రంగాలకు సంబంధించిన పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను తెలిపారు.

* తెలంగాణరాష్ట్రంలో పతంజలి గ్రూప్‌ త్వరలో భారీ పెట్టుబడులు పెట్టనున్నది. గ్రూప్‌నకు చెందిన రుచి సోయా సంస్థ ద్వారా ఆయిల్‌పామ్‌ సంబంధిత రంగంలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు పతంజలి గ్రూప్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు, యోగా గురు బాబా రాందేవ్‌ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలిపారు.

* హైదరాబాద్‌కు చెందిన కంప్యూటింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ బ్లైజ్‌.. సిరీస్‌ డీ రౌండ్‌లో 71 మిలియన్‌ డాలర్ల (రూ.520 కోట్లకుపైగా)ను సమీకరించింది. కొత్త పెట్టుబడిదారు ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌తోపాటు ప్రస్తుత భాగస్వామి టెమాసెక్‌, డెన్సో తదితర సంస్థలు ఈ రౌండ్‌కు నాయకత్వం వహించాయి. ఈ నిధులతో సంస్థ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు రాబోయే 12-18 నెలల్లో హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను వేగంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ప్రస్తుత తరం ఉత్పత్తులను వేగవంతం చేయడానికి, వినియోగదారులకు నిజమైన విలువను అందించే ఇంటిగ్రేటెడ్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లను అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో బ్లైజ్‌ సీఈవో దినకర్‌ మునగాల తెలిపారు. ఆటోమోటివ్‌, స్మార్ట్‌ రిటైల్‌, స్మార్ట్‌ సిటీ, పారిశ్రామిక మార్కెట్లలో అధిక పనితీరు, తక్కువ శక్తి, పరిమిత ఖర్చుతో కూడిన ఏఐ హార్డ్‌వేర్‌, ఏఐ సాఫ్ట్‌వేర్‌ పరిష్కారాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ నిధులు తోడ్పడతాయన్నారు. హార్డ్‌వేర్‌ డిజైన్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, వెరిఫికేషన్‌, రీసెర్చ్‌, కస్టమర్‌ సర్వీసులలో ఇంజినీర్లు, ఏఐ టెక్నాలజీ నిపుణులను నియమించడం ద్వారా దేశంలో తమ ప్రతిభను చాటడానికి బ్లైజ్‌ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. తమకు ఆటోమోటివ్‌, రిటైల్‌ తదితర రంగాల్లో విస్తరణకు అవకాశాలున్నాయన్నారు. ఎడ్జ్‌ కంప్యూటింగ్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను ఉపయోగించుకునే సంస్థల సామర్థ్యం పెరగడానికి బ్లైజ్‌ తోడ్పాటునందిస్తుందని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జేపీ స్కాండాలియోస్‌ తెలిపారు.

* హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) తయారీ స్టార్టప్‌ అటుమొబైల్‌.. తమ కేఫ్‌-రేసర్‌ ైస్టెల్డ్‌ ఆటమ్‌ 1.0 మోడల్‌ బైక్‌కు డిజైన్‌ పేటెంట్‌ను సొంతం చేసుకున్నది. స్పోర్టియర్‌ రైడింగ్‌ భంగిమ, 14 లీటర్ల స్టోరేజి ట్యాంక్‌, ఆకర్షణీయ బాడీ స్ట్రక్చర్‌కుగాను ఈ పేటెంట్‌ దక్కినట్లు సంస్థ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. స్టాండర్డ్‌, స్పోర్ట్‌, క్రూయిసర్‌ తదితర బహుళ రైడింగ్‌ భంగిమలు తమ బైక్‌ ప్రత్యేకతలని, తమ ఆర్‌అండ్‌డీ బృందం దీనికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చినట్లు సంస్థ సీఈవో గడ్డం వంశీ ఈ సందర్భంగా తెలిపారు. గతేడాది అక్టోబర్‌ 5న ఈ మోడల్‌ను పరిచయం చేయగా, అప్పట్నుంచి దేశవ్యాప్తంగా 850 బుకింగ్‌లు వచ్చాయి. కాగా, లిథియం-ఇయాన్‌ బ్యాటరీతో నడిచే ఈ బైక్‌ ధర రూ. 55,000లుగా ఉన్నది.