* కేరళలో కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తోంది. అక్కడ 20వేలపైన కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడికి చేసేందుకు అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలవైపు మొగ్గుచూపింది. వారాంతంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ప్రకటించింది. జులై 31, ఆగస్టు 1న ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
* జగనన్న విద్యా దీవెన’ రెండో విడత నిధుల్ని విడుదల చేసిన సీఎం జగన్
* ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాల నిర్వహణకు వేదిక ఖరారైంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* ఏపీలో ఎల్లుండి నుంచి థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి. 50 శాతం సీటింగ్ తో అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.
* ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి రద్దు అంశాన్ని తెదేపా ఎంపీ కనకమేడల రాజ్యసభలో ప్రశ్నించారు.
* వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు.
* విపక్షాల ఆందోళనలకు అడ్డుకట్ట పడలేదు. దీంతో గురువారం సైతం పార్లమెంట్ సమావేశాలు రసాభాసగా సాగాయి. సభ్యులు ఎంతకీ శాంతించకపోవడం వల్ల లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.
* హుజూరాబాద్‌లో ఉద్రిక్తత తలెత్తింది. తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అంబేడ్కర్ కూడలిలో తెరాస, భాజపా వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరినొకరు తోసేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
* టిటిడి అధికారులు, ఉద్యోగులు మరింత మెరుగ్గా విధులు నిర్వహించేందుకు వీలుగా సౌకర్యవంతంగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, పరిపాలనా భవనానికి ఆధ్యాత్మికశోభ కల్పించాలని ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
* దేశంలోని పేద, వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను మరింత సరళీకృతం చేయడంలో భాగంగా స్థానిక భాషల్లోనే వారికి విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ కోర్సులను ఐదు భాషల్లో బోధించనున్నట్టు వెల్లడించారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యా బోధన ఐదు భారతీయ భాషల్లో ప్రారంభం కాబోతుండటం సంతోషకరమన్నారు. హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషల్లో విద్యా బోధన ప్రారంభమవుతుందని చెప్పారు. జాతీయ నూతన విద్యా విధానం-2020 అమలులోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక ప్రసంగం చేశారు. ఇంజినీరింగ్ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా ఓ టూల్‌ను కూడా అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ప్రాంతీయ భాషల్లో విద్యానభ్యసించబోతున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ దేశ యువత ఆశయాలకు నూతన విద్యావిధానం అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ కొత్త విధానం దోహదపడుతుందని, దాంతో యువత తమ కలలను సాకారం చేసుకునే విషయంలో స్వయంగా ముందుకెళ్లగలరని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
* జర్మనీకి చెందిన మహిళకు కలలో కూడా ఊహించని జాక్‌పాట్ తగిలింది. లాటరీలో 39 మిలియన్ డాలర్లు (సుమారు రూ.290 కోట్లు) గెలుచుకుంది. ఈ విషయం తెలియని ఆమె వారం పాటు ఆ టికెట్‌ను తన బ్యాగులోనే ఉంచుకుంది. చివరకు లాటరీ మొత్తాన్ని తీసుకుని ఆనందానికి లోనైంది. జర్మనీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ‘‘45 ఏళ్ల ఓ మహిళ కొనుగోలు చేసిన టికెట్ రూ. 290 కోట్లు గెల్చుకుంది. డ్రాలో ఆమె ఒక్కరే విజేతగా నిలిచారు. ఇది తెలియని ఆమె వారం పాటు ఆ టికెట్‌ను తన బ్యాగులోనే ఉంచుకున్నారు’’ అని లాటరీ టికెట్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే ఆ మహిళ పేరును వెల్లడించలేదు. మొత్తంమీద ఆలస్యంగానైనా ఆ మహిళ డబ్బు తీసుకుంది. విషయం తెలియక.. ఆ టికెట్‌ను తన బ్యాగ్‌లో ఉంచుకుని ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆ మహిళ తెలిపారు. గెల్చుకున్న మొత్తం తన కుటుంబం ఆరోగ్యకర జీవితాన్ని గడిపేందుకు సరిపోతుందని చెప్పారు.
* భారత షూటర్ మను భాకర్‌కు మరో అవకాశం లభించింది. మహిళల 25మీటర్ల పిస్టల్ తొలి అర్హత పోటీల్లో ఐదో స్థానంలో నిలిచింది. ప్రెసిషన్‌లో ఆమె 292-9X స్కోరు సాధించింది. ఆమె సహచరిణి రహి సర్నోబత్ 25వ స్థానంలో నిలవడం గమనార్హం. ప్రిసిషన్‌లో ఆమె 287 స్కోరుకే పరిమితమైంది.
* మహిళల బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టోక్యో ఒలింపిక్స్ ప్రిక్వార్టర్స్‌లోనే ఆమె నిష్క్రమించింది. 51 కిలోల విభాగంలో రియో కాంస్యపతక విజేత, కొలంబియాకు చెందిన వలెన్షియా విక్టోరియా ఇంగ్రిట్ లొరనా చేతిలో 2-3 తేడాతో పరాజయం చవిచూసింది. హోరాహోరీగా సాగిన పోరు చివర్లో రిఫరీ తన ప్రత్యర్థి చేయి పైకెత్తగానే మేరీ ఒకపక్క నవ్వుతూనే.. తన బాధను భరించలేక ఏడ్చేసింది.
* ‘పోర్న్ రాకెట్’ కేసులో అరెస్టై ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న రాజ్‌కుంద్రాపై నటి షెర్లిన్ చోప్రా తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్‌కుంద్రా ఒకానొక సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పోలీసుల ఎదుట చెప్పినట్లు తెలుస్తోంది. అశ్లీల చిత్రాలు నిర్మించి వివిధ యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో ఈ నెల 19న బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. ఇందులో భాగంగా షెర్లిన్ చోప్రాకు సమన్లు జారీ చేసిన పోలీసులు.. తాజాగా ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజ్‌కుంద్రాపై కేసు పెట్టడానికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నారు.
* మనుషుల్లో మానవత్వ విలువలు తగ్గిపోతున్నాయని అనడానికి నిదర్శనం ఈ ఘటన. కనీస విచక్షణ మరిచి మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించారు కొందరు వ్యక్తులు. వానరాలకు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 30 కోతులు మరణించాయి. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..హసన్ జిల్లా బెలూర్ తాలూకా చౌడనహళ్లి గ్రామం సమీపంలోని రోడ్డు పక్కన ఈ ఉదయం స్థానిక యువకులు కొన్ని గోనెసంచులు మూటలను గుర్తించారు. వెంటనే వాటిని తెరవగా.. అందులో కోతుల కన్పించాయి. కొన్ని సంచుల్లో ఉన్న కోతులు అప్పటికే మరణించగా.. మరికొన్ని తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నాయి. మొత్తం 30 వానరాలు చనిపోగా.. మరో 20 గాయపడ్డాయి. దీంతో ఆ యువకులకు గాయపడిన కోతులకు బయటకు తీసి నీరు తాగించారు. ఇందులో 18 కోతులు కోలుకోగా.. మరో రెండింటిని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కోతులకు విషం పెట్టి, సంచుల్లో కుక్కారని, సంచుల పై నుంచి బలంగా కొట్టి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. మరణించిన వానరాలకు పోస్టుమార్టం నిర్వహించగా.. విషం ఆనవాళ్లు కన్పించినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ నటుడు రణ్‌దీప్ హుడా ట్విటర్‌లో షేర్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
* మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణాజిల్లా జి.కొండూరు పోలీసులు తనపై హత్యాయత్నం, కుట్ర, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అన్యాయంగా పెట్టారని పిటిషనర్ తరఫు న్యాయవాది వ్యాజ్యంలో పేర్కొన్నారు. కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. పిటిషనర్‌కు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
* తిహాడ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒకప్పటి అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌ను అధికారులు దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కడుపు నొప్పితో బాధపడుతున్న అతడిని మంగళవారం ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టు జైలు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ రోజు డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, అతడిని డిశ్చార్జి చేసే విషయంలో ఇంతవరకూ అధికారిక సమాచారం ఏమీ లేదన్నారు. 61 ఏళ్ల ఛోటా రాజన్‌కు ఏప్రిల్‌లో కరోనా సోకడంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. అప్పట్లో అతడు కరోనాతో మృతిచెందినట్టు కూడా పుకార్లు వచ్చాయి. ఆ వార్తలన్నీ అవాస్తవమని ఆ తర్వాత జైలు అధికారులు ప్రకటించారు. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ అతడిని తిహాడ్ జైలుకు తరలించారు. 2015లో ఇండోనేషియాలోని బాలి నుంచి అతడిని బహిష్కరించినప్పటి నుంచి భారీ భద్రతతో కూడిన జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు.