Business

బోయింగ్‌ను బతికించనున్న భారతీయుడు-వాణిజ్యం

బోయింగ్‌ను బతికించనున్న భారతీయుడు-వాణిజ్యం

* ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ భారత్‌లో క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. మన దేశంలోని రెండు కీలక క్లయింట్‌లలో ఒకటైన జెట్‌ ఎయిర్‌వేస్‌ మూతపడడమే అందుకు కారణం. అయితే, బిగ్‌బుల్‌గా పేరుగాంచిన ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా విమానయాన రంగంలోకి రానుండడంతో బోయింగ్‌కు తిరిగి పూర్వవైభవం రానుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇండిగో, డెల్టా విమానయాన సంస్థలకు చెందిన మాజీ సీఈఓలతో కలిసి ‘ఆకాశ ఎయిర్‌’ పేరిట ఝున్‌ఝున్‌వాలా ఓ ఎయిర్‌లైన్‌ను స్థాపించనున్న విషయం తెలిసిందే. భారత్‌లో దేశీయంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థను స్థాపించనున్నట్లు ఆయన తెలిపారు. తక్కువ ధరలో సామాన్య ప్రజలకు విమాన సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 180 మంది ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న 70 విమానాలను సమకూర్చుకోనున్నామన్నారు. భారత్‌లో విమానయాన రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన ప్రవేశిస్తుండడం గమనార్హం.

* ఇప్ప‌టి వ‌ర‌కు బీమా సేవ‌లందించిన జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఇక నేరుగా ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ రంగంలోకి అడుగిడింది. ఐడీబీఐ బ్యాంక్‌తో క‌లిసి రెండు రూపే క్రెడిట్ కార్డుల‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తీసుకొస్తున్న‌ది. ఎల్ఐసీ కార్డ్స్ స‌ర్వీసెస్ లిమిటెడ్ (ఎల్ఐసీ సీఎస్ఎల్‌) ఈ కార్డుల‌ను శ‌నివారం ఆవిష్క‌రించింది. లుమిన్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ ( ‘Lumine’ Platinum Credit Card ), ఎక్లాట్‌ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ ( ‘Eclat’ Select Credit Card ) పేరిట క‌స్ట‌మ‌ర్ల‌కు ల‌భ్యం కానున్నాయి.

* క్వాంట్రా క్వార్జ్‌ బ్రాండ్‌ పేరుతో ప్రీమియం క్వార్జ్‌ సర్ఫేసెస్‌ తయారీలో దేశంలో అతిపెద్ద సంస్థ అయిన పోకర్ణ ఇంజనీర్డ్‌ స్టోన్‌ హైదరాబాద్‌లో కొత్త ప్లాంటు ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన ఈ అత్యాధునిక కేంద్రం కోసం కంపెనీ రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ యూనిట్‌ను శనివారం (జూలై 31)న ప్రారంభించనున్నారు. భాగ్యనగరంలోని మేకగూడ వద్ద 1,60,000 చ.మీ విస్తీర్ణంలో 90లక్షల చదరపు అడుగుల వార్షిక తయారీ సామర్థ్యంతో దీన్ని స్థాపించారు. ఈ తయారీ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 3000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ఏడాది మార్చి 24న ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని పోకర్ణ ఇంజనీర్డ్‌ స్టోన్‌ సీఎండీ గౌతమ్‌ చంద్‌ జైన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త కేంద్రం ప్రారంభంతో సంస్థ మొత్తం వార్షిక సామర్థ్యం 1.5 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంటుందని సీఈవో పరాస్‌ కుమార్‌ జైన్‌ వెల్లడించారు. పూర్తి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఈ కేంద్రం నుంచి రూ. 400 కోట్ల టర్నోవర్‌ ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

* కొవాగ్జిన్‌ ఉత్పత్తి ఎక్కడ.. హైదరాబాద్‌. కొవిషీల్డ్‌ ఉత్పత్తి ఎక్కడ.. హైదరాబాద్‌. స్పుత్నిక్‌-వీ ఉత్పత్తి ఎక్కడ.. హైదరాబాద్‌. ఇతర రోగాల వ్యాక్సిన్ల తయారీ ఎక్కడ.. హైదరాబాద్‌. ప్రపంచదేశాలకు వేదికగా మారిన మన రాజధాని.. ఫైజర్‌, మోడర్నా వ్యాక్సిన్ల తయారీలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది. ఈ రెండు.. మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ(ఎంఆర్‌ఎన్‌ఏ) ఆధారిత వ్యాక్సిన్లు. వీటికి అవసరమయ్యే ముడి సరుకును హైదరాబాద్‌కు చెందిన సపాల ఆర్గానిక్స్‌ కంపెనీ సరఫరా చేస్తున్నది. మనదేశంలో పంపిణీ చేస్తున్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు ఇనాక్టివేటెడ్‌ వైరస్‌ నుంచి అభివృద్ధి చేసినవి. దీనికి భిన్నంగా ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ ఉంటుంది. దీని ఆధారంగా తయారైనవే ఫైజర్‌, మోడర్నా వ్యాక్సిన్లు.

* విద్యుత్‌ పరికరాల తయారీలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ భెల్‌ క్రమంగా నష్టాలను తగ్గించుకుంటున్నది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.448.20 కోట్ల నష్టం వచ్చింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.893.14 కోట్లతో పోలిస్తే సగానికి సగం తగ్గింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2,086.43 కోట్ల నుంచి రూ.2,966.77 కోట్లకు చేరుకుంది. కరోనా సెకండ్‌ వేవ్‌తో గత త్రైమాసికం మొదట్లో తీవ్ర ప్రభావం చూపినప్పటికీ చివరికి కోలుకున్నట్లు వెల్లడించింది.

* చిన్న వాణిజ్య వాహన శ్రేణిలో మహీంద్రా అండ్‌ మహీంద్రా ‘సుప్రో ప్రాఫిట్‌ ట్రక్‌’ను విడుదల చేసింది. రూ.5.40 లక్షల ప్రారంభధరతో ఈ ట్రక్‌లు లభిస్తాయి. ఈ ట్రక్‌పై అధిక మైలేజీకి, పేలోడ్‌కు గ్యారంటీనిస్తున్నామని, దీంతో తగిన లబ్ది లేకపోతే ట్రక్‌ను తిరిగి ఇవ్వవచ్చంటూ కస్టమర్లకు కంపెనీ ఆఫర్‌ ప్రకటించింది.