Business

నేటి నుండి ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల మోత-వాణిజ్యం

నేటి నుండి ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల మోత-వాణిజ్యం

* జూలై నెలలో కేంద్రానికి రూ.1.16లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది జూలైతో పోలిస్తే 33శాతం వృద్ధి నమోదైందని, ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2020 సంవత్సరం జూలైలో వస్తుసేవల పన్ను (ఘ్శ్ట్) ద్వారా రూ. 87,422 కోట్లు కాగా.. ఈ ఏడాది జూన్‌లో రూ.92,849 కోట్లు వచ్చింది. జూలైలో ఆదాయం రూ.1,16,393కోట్లకు పెరిగింది. ఇందులో సెంట్రల్‌ జీఎస్టీ రూ.22,197కోట్లు, స్టేట్‌ జీఎస్టీ రూ.28,541 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ రూ.57,864 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.27,900కోట్లు సహా), సెస్‌ ద్వారా రూ.7,790 కోట్లు (వస్తువుల దిగుమతిపై వచ్చిన రూ.815కోట్లతో సహా) వచ్చాయని ఆర్థిక శాఖ పేర్కొంది. వరుసగా ఎనిమిది నెలలు పాటు రూ.లక్ష కోట్లకుపైగా వచ్చిన జీఎస్టీ ఆదాయం గత జూన్‌లో రూ.లక్ష కోట్లకు దిగువకు పడిపోయింది. మే మాసంలో చాలా రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు, లాక్‌డౌన్‌లు అమలులో ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని, రాబోయే నెలల్లో సైతం జీఎస్టీ ఆదాయం భారీగా కొనసాగే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

* ప్రముఖ ఆన్‌లైన్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం దేశవ్యాప్తంగా 20 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది. సంస్థ డిజిటల్‌ ఉపకరణాలపై వ్యాపారులకు అవగాహన కల్పించేందుకుగానూ ఫీల్డ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌(ఎఫ్‌ఎస్‌ఈ)లను నియమించుకుంటోంది. పది లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. గ్రాడ్యుయేట్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వేతనం+కమిషన్ కలుపుకొని నెలకు రూ.35 వేలు సంపాదించుకొనే అవకాశం ఉందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇది మంచి అవకాశమని పేర్కొంది. మహిళా వ్యాపారస్థులను ప్రోత్సహించేందుకుగానూ మహిళా ఉద్యోగార్థులు ఈ రంగంలోకి రావాలని పిలుపునిచ్చింది.

* ఏటీఎం ( ATM ) లావాదేవీలపై ఇంటర్‌చేంజ్‌ ఫీజులూ ఆదివారం నుంచే పెరిగాయి. రూ.15 నుంచి 17కు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆర్థిక లావాదేవీలకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది. ఖాతా ఉన్న బ్యాంక్‌ ఏటీఎం నుంచి కాకుండా ఇతర బ్యాంక్‌ల ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసినప్పుడు సదరు కస్టమర్ల నుంచి బ్యాంక్‌లు ఈ ఫీజులను వసూలు చేస్తాయి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్‌ సైతం ఆగస్టు 1 నుంచే నగదు లావాదేవీలపై పరిమితులను సవరించింది. తమ దేశీయ సేవింగ్స్‌ ఖాతాదారుల ఏటీఎం ఇంటర్‌చేంజ్‌, చెక్‌బుక్‌ చార్జీల్లోనూ మార్పులు చేసింది. మెట్రో నగరాల్లో మూడు, ఇతర నగరాల్లో ఐదు చొప్పున ఉచిత లావాదేవీలను ఖాతాదారులు పొందవచ్చని, ఆ తర్వాత ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ.20, ఆర్థికేతర లావాదేవీకి రూ.8.5 చొప్పున చార్జీలుంటాయని బ్యాంక్‌ స్పష్టం చేసింది.

* అమెరికాకు చెందిన ఒక ప్రముఖ గేమింగ్‌ సంస్థపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. లింగ వివక్ష, వేధింపుల ఆరోపణలలో ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో గేమ్ కంపెనీ యాక్టివిజన్ బ్లిజార్డ్ కంపెనీ (Sexual Harassment) చిక్కుకున్నది. జీతం, ప్రమోషన్‌లలో వివక్ష ఆరోపణలు ఎదుర్కొంటున్నది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో గత నెల 20న కేసు నమోదైంది. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా వాతావరణాన్ని సంస్థ తన కార్యాలయంలో అనుమతించిందని పిటిషన్‌దారు ఆరోపించారు. జీతం, ప్రమోషన్ నిర్ణయాల్లో కూడా పక్షపాతం వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాజ్యం అనేక ప్రముఖ వీడియో గేమ్ స్టూడియోల్లో ఇదే విధమైన పని సంస్కృతిని హైలైట్ చేస్తున్నది.