* తన భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్ గురించి ఎట్టకేలకు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పెదవి విప్పారు. విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా వార్తలు సృష్టించవద్దని ఆమె అన్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకి పూర్తి నమ్మకం ఉందని ఆమె తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ట్విటర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నిజమే!! గత కొన్నిరోజలుగా ప్రతి విషయంలో నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను. రాజ్‌కుంద్రా అరెస్ట్ వ్యవహరంపై ఎన్నో పుకార్లు, మరెన్నో ఊహాగానాలు వస్తున్నాయి. మీడియాతోపాటు అయినవాళ్లు కూడా నన్ను, నా కుటుంబాన్ని నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహరంపై ఇప్పటివరకూ నేను అస్సలు మాట్లాడలేదు. ప్రస్తుతం కేసు విచారణలో దశలో ఉన్న కారణంగా ఆ విషయంపై నేను మాట్లాడాలనుకోవడం లేదు. ముంబయి పోలీసులు, భారత న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అలాగే, దయచేసి నా గురించి అసత్య ప్రచారాలు చేయకండి. నా పేరుతో ఇష్టం వచ్చినట్లు కథనాలు సృష్టించకండి. అంతేకాకుండా, ఒక తల్లిగా నా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అడుగుతున్నాను. అధికారికంగా పూర్తి సమాచారం లేకుండా కామెంట్లు చేయకండి’’ అని శిల్పాశెట్టి అన్నారు.
* అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ (Johnson & Johnson) సంస్థ ఇండియాలో తన సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) వర్గాలు వెల్లడించాయి. అయితే దరఖాస్తు ఉపసంహరణకు గల కారణాన్ని జేజే వెల్లడించలేదు. తన జాన్సెన్ కొవిడ్ వ్యాక్సిన్ కోసం గత ఏప్రిల్‌లో ఈ సంస్థ దరఖాస్తు చేసుకుంది. అంతేకాదు జులైలోనే కొన్ని వేల డోసుల వ్యాక్సిన్లు వస్తాయన్న వార్తలూ వచ్చాయి.
* వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home).. చాన్నాళ్లు సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీలకే పరిమితమైన ఈ ఆప్షన్.. కరోనా కారణంగా చిన్నచిన్న కంపెనీలకూ పాకింది. పని జరిగితే చాలు ఎక్కడైతే ఏంటి అనుకునే కంపెనీలు సాధ్యమైనంత వరకూ తమ ఉద్యోగులకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. అయితే మెల్లమెల్లగా కేసులు తగ్గుముఖం పట్టడం, సెకండ్ వేవ్ వెళ్లిపోవడంతో చాలా సంస్థలు మళ్లీ తమ ఆఫీసులను తెరుస్తున్నాయి. ఉద్యోగులను రమ్మంటున్నాయి. కానీ ఇంట్లో పని చేయడం అలవాటైన ఉద్యోగులు మాత్రం ఇలాగే కొనసాగితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. తాజా సర్వే ఒకటి 46 శాతం మంది ఉద్యోగులు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తేల్చింది. మరో 29 శాతం మంది హైబ్రిడ్ మోడల్‌కు ఓకే అంటున్నారు.
* సిగరెట్ స్మోకింగ్ జోన్ అని, నో స్విమ్మింగ్ జోన్ అని.. రకరకాల జోన్స్ మనం విని ఉంటాం.. చూసి ఉంటాం. అయితే, ‘నో కిస్సింగ్ జోన్’ గురించి ఎప్పుడైనా విన్నారా..? విని ఉండరు. ఎందుకంటే ఇలాంటి జోన్స్ సాధారణంగా మనకు ఎక్కడా కనిపించవు. అచ్చం ఇలాంటి జోన్ ఒకటి ముంబైలోని ఓ హౌజింగ్ సొసైటీ వాళ్లు ఏర్పాటుచేశారు. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడాన్ని నిరోధించేందుకే ఈ ప్రత్యేక జోన్ (No Kissing Zone) ను ఏర్పాటుచేశామంటున్నారు వాళ్లు.
* కృష్ణా జలాల వివాదంపై నాగార్జున సాగర్ వేదికగా సీఎం కేసీఆర్ స్పందించారు. హాలియాలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం, ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం అవలంభించే తెలంగాణ వ్యతిరేక వైఖరి కావొచ్చు. ఆంధ్రా వాళ్లు చేస్తున్న దాదాగిరీ కావొచ్చు. కృష్ణా నదిపై ఏ విధంగా అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. కృష్ణా నీళ్లలో రాబోయే రోజుల్లో మనకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. పెద్దదేవులపల్లి చెరువు వరకు పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్లను తెచ్చి అనుసంధానం చేయాలనే సర్వే జరుగుతోంది. అది పూర్తయితే నాగార్జున సాగర్ ఆయకట్టు చాలా సేఫ్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. పెద్దదేవులపల్లి – పాలేరు రిజర్వాయర్ అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
* సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో రేపటి నుంచి అన్నిరకాల వైద్య సేవలను పునరుద్ధరించనున్నారు. రాష్ట్రంలో కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో దవాఖానలో నాన్ కొవిడ్ సేవలను తిరిగి ప్రారంభించాలని వారం క్రితం వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా విజృంభణతో ఏప్రిల్ 15న గాంధీ దవాఖానలో కొవిడ్ సేవలు తప్ప నాన్ కొవిడ్ సేవలు (ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు, సర్జరీలు) నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నెలలుగా సాధారణ వైద్య సేవలు అందక రోగులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం కరోనా ఉధృతి లేకపోవడంతో రోగులకు ఇబ్బంది లేకుండా అన్నిరకాల సేవలు ప్రారంభిస్తూ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది.
* కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడానికి రెండు దోసుల వ్యాక్సిన్ తీసుకున్నాం.. ఇక ఎలాంటి భయం లేదని భావించే వారికి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోట్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఓ హెచ్చరిక జారీ చేసింది. డెల్టా వేరియంట్ దేనికీ అతీతం కాదని తెలిపింది. రెండు డోసులు వేసుకున్నా.. డెల్టా వేరియంట్ వారినపడే అవకాశాలు అంతే ఉంటాయని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న ధీమాలో ఉండొద్దని, ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్క్ పెట్టుకుని.. సామాజిక దూరం పాటించాల్సిందే అంటూ సూచించింది. థర్డ్ వేవ్ ముప్పునకు డెల్టా వేరియంట్ కారణం అవుతుందని తెలిపింది. డెల్టా వైరస్ ప్రభావం ప్రతీ ఒక్కరిపై ఉంటుందని స్పష్టం చేసింది. డెల్టా వైరస్ ముందు…వ్యాక్సిన్ తీసుకున్న వారు.. తీసుకోని వారు సమానం అని చెప్పుకొచ్చారు. కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితం కాకుండా ఉండేందుకు.. చావు నుంచి తప్పించేందుకు టీకాలు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తాయి. టీకా వేసుకున్న వ్యక్తులు అంటు వ్యాధుల బారిన పడటం చాలా తక్కువ అనిసీడీసీ తెలిపింది. అమెరికాలోని మసాచుసెట్స్ ప్రావిన్స్ టౌన్లో భారీగా కేసులు నమోదయ్యాయి. వీరంతా రెండు దోసుల టీకాలు తీసుకున్నవారు. ఈ నెలలో ఒక మసాచుసెట్స్ లోనే 470 కేసులు రికార్డయ్యాయి. కరోనా బారినపడి మూడు వంతుల మంది టీకా తీసుకున్నవారే ఉండటం గమనార్హం. జెన్యూపరంగా విశ్లేషించబడిన చాలా నమూనాల్లో డెల్టా వేరియంట్ను గుర్తించారు.
* దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ఊపందుకోవడం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల రోజువారీర్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, అసోం, మిజోరం, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో కరోనా కేసుల పాజిటివిటీ రేటు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ 10 రాష్ట్రాల్లోని 46 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతంప్ దాటిందని, మరో 53 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతం మధ్యన ఉందని వివరించింది. ఈ జిల్లాల్లో ఏమాత్రం అలసత్వం చూపించినా పరిస్థితి దారుణంగా మారుతుందని హెచ్చరించింది. ఆయా రాష్ట్రాలు తక్షణమే కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
* తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, దయ చేసి తన అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్యాకేజీ ప్రకటించాలని గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజా సింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘ఉప ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గుర్తుకు వస్తారు. హుజూరాబాద్‌లో గెలవడానికి ప్యాకేజీలను ప్రకటించారు. తమ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ప్యాకేజీలు వస్తాయని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గోషామహాల్ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం మంచి ప్యాకేజీ ప్రకటించండి. రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా’ అంటూ రాజా సింగ్ వ్యాఖ్యానించారు.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రాజకీయ పతనం ప్రారంభమైందని.. రాష్ట్రంలో రాజకీయంగా మార్పు రాబోతోందని కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు. మరికొన్ని వారాల్లో సీఎం జగన్ మాజీ కాబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతిలో చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ తీరు వివాదాస్పదంగా ఉందన్నారు. బెయిల్ కేసు నుంచి బయటపడేందుకు ఉత్తరాది పారిశ్రామిక వేత్త, కేంద్రమంత్రి కుమారుడి సాయాన్ని జగన్ కోరుతున్నారని చెప్పారు. తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్‌ను ఖండిస్తున్నట్లు చింతామోహన్ చెప్పారు. ఎంపీ రఘురామకృష్ణరాజును కొట్టడం తప్పన్నారు.
* నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వాళ్లకు కూకట్‌పల్లి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. సోమవారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 621 మంది మందుబాబులను ట్రాఫిక్ పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఇందులో 372 మంది వాహనదారులకు 1 నుంచి 28 రోజుల వరకు జైలు శిక్ష విధించగా, 238 మందికి రూ.15.26లక్షల జరిమానా విధించింది. ఇక లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన 238 మందికి రూ.6.71లక్షల జరిమానా వేశారు. గత నెల 26 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన తనిఖీల్లో 621 మంది వాహనదారులు పట్టుబడ్డారు. మరోవైపు మద్యం సేవించి వాహనాలు నడిపిన వాళ్ల వివరాలను ట్రాఫిక్ పోలీసులు రవాణాశాఖకు పంపారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేయాలని ఆర్టీవోలకు సూచించారు.