Politics

లక్ష్మీపార్వతికి మరో పదవి-తాజావార్తలు

లక్ష్మీపార్వతికి మరో పదవి-తాజావార్తలు

* తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఏపీ, తెలంగాణలో 2031 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగి ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా రాజ్యాంగంలోని 170 అధికరణం ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడతామని తెలిపారు.

* విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో VSP ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తెలుగు వారాంతా ఐకమత్యంగా పోరాడాలన్నారు. ఈ పోరాటానికి మద్దతు తెలిపినవారందరిని ఆయన అభినందించారు. ఇది కేవలం ఉత్తరాంధ్ర సమస్య లాగో, విశాఖపట్నం సమస్య లాగో కాకుండా, 5కోట్ల ఆంధ్రుల సమస్యగా చూడాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక, ఎందరో త్యాగధనుల, ప్రజాసంఘాల నాయకుల పోరాటాల వళ్ళ, మరీ ముఖ్యంగా 32 మంది ప్రాణత్యాగం చేసి సాధించినటువంటి ఆంధ్రుల హక్కు అని గుర్తుచేశారు. ఈరోజు మళ్లీ పోరాటం చేయాల్సిన అవసరం మనందరికీ వచ్చిందన్నారు.

* ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్యులుగా తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి నియమితులయ్యారు. సోమవారం వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆమెకు అందజేశారు. ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్‌ ఆచార్య కె.సమత తదితరులు పాల్గొన్నారు

* భారత్‌లో ఈ నెలలోనే మరోసారి కొవిడ్‌-19 ఉద్ధృతి మొదలు కానుందని పరిశోధకులు పేర్కొన్నారు. అది క్రమంగా పెరుగుతూ అక్టోబరులో గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని విశ్లేషించారు. అయితే తీవ్రస్థాయి కష్టనష్టాలను మిగిల్చిన రెండో విజృంభణతో పోలిస్తే దీని తీవ్రత తక్కువగానే ఉంటుందన్నారు. గణిత నమూనా సాయంతో ఐఐటీ పరిశోధకులు ఈ అంచనాలు వేశారు. గతంలో రెండో ఉద్ధృతిపైనా వీరు కచ్చితమైన లెక్కలు కట్టడం ఇక్కడ ప్రస్తావనార్హం. మూడో ఉద్ధృతి తార స్థాయిలో ఉన్నప్పుడు రోజువారీ కేసుల సంఖ్య లక్ష లోపు ఉంటుందని చెప్పారు.  పరిస్థితులు మరింత దిగజారితే అది 1.5 లక్షలకూ చేరొచ్చన్నారు. 

* అధికారులతో సమావేశం ఏర్పాటుచేసిన అధికారులు రాలేదని సోమవారం నుండి మంగళవారం ఉదయం వరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట అధికారుల కోసం ఎదురు చూసిన జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద స్నానం చేస్తున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి

* విశ్వ చైతన్య స్వామితో పాటు మరో ముగ్గురు శిష్యులను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. భక్తి ముసుగులో మోసం చేశారని ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అజ్మాపూర్‌లో శ్రీసాయి సర్వస్వం మాన్సీ ఛారిటబుల్‌ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టు పేరిట మోసాలకు పాల్పడుతున్నారని.. భక్తి పేరుతో మహిళలను లోబర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ భక్తురాలి ఫిర్యాదుతో విశ్వచైతన్య స్వామి లీలలు వెలుగులోకి వచ్చాయి. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆశ్రమంపై దాడి చేసి విశ్వ చైతన్య స్వామితో పాటు మరో ముగ్గురు శిష్యులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.26 లక్షలు, 500 గ్రాముల బంగారం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాండ్లు, 17 ఎకరాల భూమి పత్రాలు, 7 ల్యాప్‌టాప్‌లు, 4 సెల్‌ఫోన్లు, కారు, మూలికలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు. విశ్వ చైతన్య స్వామికి 40 దేశాల్లో భక్తులు ఉన్నారని ఎస్పీ తెలిపారు.

* కృష్ణాజిల్లా జి.కొండూరులో తనపై నమోదైన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వైపుల న్యాయవాదులు వాదనలు వినిపించారు. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తవటంతో నిర్ణయాన్ని రేపు వెల్లడిస్తామని కోర్టు తెలిపింది.

* తెలంగాణతో గొడవపడాలని ఎప్పుడూ అనుకోలేదని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం త్వరగా సమసిపోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. విశాఖ ఉక్కుపై కేంద్రమంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉక్కు పరిశ్రమపై కేంద్రానికి దుర్మార్గ వైఖరి అని ధ్వజమెత్తారు. రాజధాని చట్టం ఆమోదించిన రోజు నుంచే 3 రాజధానులు అమల్లోకి వచ్చాయని తెలిపారు. తెదేపా ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లే అమరరాజా పరిశ్రమ తరలిపోయిందనేది అవాస్తవమన్నారు. ఆదాయం కోసమే పక్క రాష్ట్రానికి వెళ్లేందుకు అమరరాజా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

* నగరంలో రేపు పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. బుధవారం ఉదయం 6గంటల నుంచి గురువారం ఉదయం 6గంటల వరకు బాలాపూర్‌, మైసారం, బార్కాస్‌, మేకలమండి, భోలక్‌పూర్‌, తార్నాక, లాలాపేట్‌, బౌద్ధనగర్‌, మారేడ్‌పల్లి, కంట్రోల్‌ రూమ్‌, రైల్వేస్‌, ఎంఈఎస్‌, కంటోన్మెంట్‌, ప్రకాశ్‌ నగర్‌, పాటిగడ్డ, హస్మత్‌పేట్‌, ఫిరోజ్‌ గూడ, గౌతమ్‌ నగర్‌, వైశాలినగర్‌, బీఎన్‌రెడ్డి నగర్‌, వనస్థలిపురం, ఆటోనగర్‌, మారుతీ నగర్‌, మహింద్రాహిల్స్‌, ఏలుగుట్ట, రామంతాపూర్‌, ఉప్పల్‌, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్‌, బీరప్పగూడ, బోడుప్పల్‌లోని పలు ప్రాంతాలు, మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌, శంషాబాద్‌లో మంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనేది అందరికీ తెలుసునని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రూ.3లక్షల కోట్ల అప్పులకు కొవిడ్‌ సంక్షోభం తోడైందన్నారు. మంగళవారం సజ్జల మీడియాతో మాట్లాడారు. కేంద్రం సహా అన్ని రాష్ట్రాలూ ఆర్థిక కష్టాలు, సంక్షోభంలో ఉన్నాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు వెచ్చించడం వల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువ అయ్యాయన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ సంక్షోభం విషయం ఉద్యోగులకు తెలుసునని.. అందుకే వారు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయడం లేదా అనేది భాజపా నేతలు చెప్పాలన్నారు. భాజపా నేతల విమర్శలు వారి దివాళాకోరుతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. భాజపా వాళ్లు అప్పు చేయడం ఒప్పు.. మేము చేయడం తప్పా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకొచ్చే ప్రతి పైసాను సద్వినియోగం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.