* దేశీయ మార్కెట్లు మరోసారి లాభాల్లో ముగిశాయి. రెండు రోజుల వరుస భారీ లాభాల అనంతరం గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు ఒడుదొడుకులకు లోనైనా.. లాభాల పరంపరను కొనసాగించాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు డీలా పడినప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎయిర్‌టెల్, టాటా స్టీల్ వంటి షేర్లు సూచీలను నడిపించాయి. దీంతో వరుసగా మూడో రోజూ సూచీలు లాభాల్లో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 74.17గా ఉంది.
* హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న టెలీ కమ్యూనికేషన్, నెట్‌వర్కింగ్ పరికరాల తయారీ సంస్థ వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ డైరెక్టర్ హిమబిందు అరెస్టయ్యారు. పలు బ్యాంకులను మోసం చేశారన్న అభియోగంపై పోలీసులు అమెను అరెస్టు చేశారు. తప్పుడు పత్రాలతో రూ.1700 కోట్లు మేర రుణాలు తీసుకున్నట్లు ఆమెపై అభియోగాలున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అంచనాల్ని మించిన ఫలితాల్ని ప్రకటించింది. దేశంలో అతిపెద్ద బ్యాంకైన ఎస్బీఐ గతంలో ఏ త్రైమాసికంలోనూ ఆర్జించనంతగా 2021 ఏప్రిల్-జూన్ మధ్యకాలానికి రికార్డుస్థాయిలో రూ.6,504 కోట్ల నికరలాభాన్ని సాధించింది. గతేడాది ఇదేకాలంలో ఆర్జించిన రూ.4,189 కోట్లకంటే ఈ జూన్‌లో 55 శాతం వృద్ధిని కనపర్చింది. మొండి బకాయిలు తగ్గడంతో ఈ ఫీట్ సాధ్యపడింది. స్టాండెలోన్ ప్రాతిపాదికన మొత్తం ఆదాయం రూ.74,458 కోట్ల నుంచి రూ.77,347 కోట్లకు పెరిగినట్లు బుధవారం డైరెక్టర్ల బోర్డు సమావేశం అనంతరం బ్యాంకు వెల్లడించింది. నిర్వహణా లాభం రూ.18,061 కోట్ల నుంచి రూ.18,975 కోట్లకు చేరింది. అయితే నికర వడ్డీ ఆదాయం మాత్రం రూ.66,500 కోట్ల నుంచి రూ.65,564 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ మార్జిన్ కూడా 3.24 శాతం నుంచి 3.15 శాతానికి దిగివచ్చింది. బ్యాంకు మొత్తం ఆస్తుల్లో స్థూల నిరర్ధక ఆస్తులు (మొండి బకాయిలు, ఎన్‌పీఏ) 5.44 శాతం నుంచి 5.32 శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీఏ 1.8 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.9,420 కోట్ల నుంచి రూ.5,030 కోట్లకు తగ్గాయి. జూన్ క్వార్టర్లో రూ.15,666 కోట్ల రుణాలు ఎన్‌పీఏలుకాగా, అందులో రూ.5,246 కోట్ల విలువైన రుణాల్ని రిజర్వుబ్యాంకు మార్గదర్శకాల ప్రకారం పునర్‌వ్యవస్థీకరించినట్లు ఎస్బీఐ తెలిపింది. బ్యాంకు క్యాపిటల్ అడిక్వసీ రేషియో 13.66 శాతానికి మెరుగుపడింది. ఇక కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంకు నికరలాభం రూ.4,776 కోట్ల నుంచి రూ.7,379 కోట్లకు పెరగ్గా, ఆదాయం రూ.87,984 కోట్ల నుంచి రూ.93,267 కోట్లకు చేరింది.
* వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లు, శ్లాబులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యాపార, పారిశ్రామిక సంఘం పీహెచ్‌డీసీసీఐ బుధవారం విజ్ఞప్తి చేసింది. గరిష్ట రేటును 18 శాతంగానే నిర్ణయించాలని, మొత్తం 3 శ్లాబులకే పరిమితం చేయాలని సూచించింది. కరోనా నేపథ్యంలో మార్కెట్‌లో పడిపోయిన కొనుగోళ్లు, వినీమయ సామర్థ్యం.. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణతో బలపడగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అలాగే పన్నుల ఎగవేతకు అడ్డుకట్ట పడగలదన్న విశ్వాసాన్ని కనబరిచింది. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 శాతం రేట్లు అమలవుతున్నాయి. లగ్జరీ, పొగాకు తదితర ఉత్పత్తులపై గరిష్టంగా 28 శాతం పన్ను వేస్తున్నారు. అలాగే బంగారం, వెండి, సానబెట్టిన వజ్రాలపై ప్రత్యేకంగా 3 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో కనిష్ట రేటుగా 5 శాతాన్ని కొనసాగిస్తూ, 12, 18 శాతం శ్లాబులను కలిపేసి 12 శాతంగా, 28 శాతాన్ని ఎత్తేసి దాని స్థానంలో 18 శాతాన్ని పెట్టాలని పీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు సంజయ్ అగర్వాల్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఇప్పుడు 28 శాతం శ్లాబులో కొనసాగుతున్న దాదాపు 200 వస్తూత్పత్తులను 18 లేదా 12 శాతం శ్లాబుల్లోకి మార్చాలని కోరారు.