DailyDose

CJIను అవాక్కుపరిచిన ఛార్జిషీట్-నేరవార్తలు

CJIను అవాక్కుపరిచిన ఛార్జిషీట్-నేరవార్తలు

* ఛార్జిషీటులో పేర్కొన్న సాక్ష్యాలు బలంగా లేవనే కారణంతో బెయిల్‌ పొందాలని ప్రయత్నించిన ఓ సైనికుడి ప్రయత్నం సుప్రీంకోర్టులో బెడిసికొట్టింది. కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అనుమానాలు వ్యక్తంచేసింది. దీనిని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేసే అవకాశాన్ని పరిగణనలో తీసుకోవాలని రాజస్థాన్‌ ప్రభుత్వానికి సూచించింది.సైనికుడు వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా సొంత భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపే ప్రయత్నమైనా చేయకుండా వీడియోలో చిత్రీకరించడాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం తప్పుపట్టింది. రాజస్థాన్‌ హైకోర్టు తనకు బెయిల్‌ నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా దానిని సీజేఐ ధర్మాసనం గురువారం విచారించింది. తన న్యాయవాద వృత్తి జీవితంలో ఇలాంటి ఛార్జిషీటును ఇంతవరకు చూడలేదని జస్టిస్‌ రమణ వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని ఆల్వార్‌కు చెందిన సాహాబుద్దీన్‌ అనే సైనికుడు ఒక చిన్న తగాదాతో తన భార్య ఆత్మహత్యకు కారకుడైనట్లు అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు. స్వయానా నిందితుని కుమార్తె ఇచ్చిన వాంగ్మూలం కూడా అతని ప్రమేయాన్ని చాటుతోందని, కీలక నిందితుల వాంగ్మూలాలు నమోదు చేసేవరకు బెయిల్‌ పిటిషన్‌ను అనుమతించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్‌ను వెనక్కి తీసుకునే అవకాశాన్ని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి ఇవ్వలేదు.

* సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. పెన్నా కేసు నుంచి తన పేరు తొలగించాలన్న జగన్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. జగన్‌ డిశ్ఛార్జ్‌ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. ఇండియా సిమెంట్స్‌ కేసులో డిశ్ఛార్జ్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామని జగన్‌, విజయసాయిరెడ్డి, శామ్యూల్‌ కోర్టుకు తెలిపారు. పెన్నా కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన డిశ్ఛార్జ్‌ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. పెన్నా, రఘురామ్‌, ఇండియా సిమెంట్స్‌ ఛార్జ్‌ షీట్ల విచారణ ఈనెల 13కి వాయిదా పడింది. ఈడీ కేసులు ఏ దశలో విచారణ జరపాలన్న అంశంపై హైకోర్టు తీర్పు రావాల్సి ఉందన్న విజయసాయిరెడ్డి అభ్యర్థనతో ఈడీ కేసుల విచారణ ఈనెల 20కి వాయిదా పడింది.

* బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాపై మరో నటి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అనుమతి తీసుకోకుండానే తన అశ్లీల చిత్రాలు హాట్‌షాట్స్‌ యాప్‌లో రాజ్‌కుంద్రా విడుదల చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ముంబయి పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసుకున్నారని పలు వార్తా కథనాలు బయటకు వచ్చాయి. తాజాగా ఆ నటి రాజ్‌కుంద్రాపై తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల మల్వాణీ పోలీస్‌స్టేషన్‌లో కుంద్రాపై ఫిర్యాదు చేసిన నటి నుంచి తాజాగా ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు స్టేట్‌మెంట్‌ స్వీకరించినట్లు సమాచారం. రాజ్‌కుంద్రా మంచి వ్యక్తి కాదని.. తనకిచ్చిన మాట తప్పాడని ఆమె వెల్లడించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రైవేట్‌ పార్ట్స్‌ని వీడియోలో చూపించకూడదు అనే షరతుతో రాజ్‌కుంద్రా నిర్మించిన ఓ అశ్లీల చిత్రంలో తాను నటించానని.. అందుకుగాను కుంద్రా తనకి కొంత మొత్తాన్ని చెల్లించాడని ఆమె పోలీసుల ఎదుట తెలిపారట. అయితే, ఎలాంటి అనుమతి తీసుకోకుండా.. ఏవిధమైన మార్పులు చేయకుండా పూర్తి వీడియోని హాట్‌షాట్స్‌లో విడుదల చేశారని.. ఓ స్నేహితుడి ద్వారా ఆ విషయం తనకు తెలిసిందని ఆమె వివరించింది.

* సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. మెదక్‌ జిల్లా సంగాయిపేట గ్రామానికి చెందిన పద్మ(30), అంబదాస్‌(40) దంపతుల కుమారుడు వివేక్‌(6) అనారోగ్యానికి గురి కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అనంతరం స్వగ్రామానికి తిరిగి వస్తుండగా.. చౌటకూర్‌ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పుల్కల్‌ ఎస్సై నాగలక్ష్మి సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం జిల్లా ఎస్పీ రమణ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదతీరును పరిశీలించారు.