Sports

సింధుకు ₹30లక్షలు అందించిన జగన్-తాజావార్తలు

సింధుకు ₹30లక్షలు అందించిన జగన్-తాజావార్తలు

* తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్‌ అథారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బర్డ్‌ చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్య పరికరాల కొనుగోలుకు రూ.2.3 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఇక నెల్లూరు జిల్లాలో సీతారామస్వామి ఆలయ నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరుకు నిర్ణయం తీసుకుంది. త్రిదండి చినజీయర్‌ స్వామి సూచనల మేరకు 10 ఆలయాల పునర్నిర్మాణం కోసం రూ.9 కోట్లు వినియోగించాలని చర్చించింది. 2021-22 ఏడాదికి 12 లక్షల డైరీలు, 8 లక్షల క్యాలండర్లు, 2 లక్షల చిన్న డైరీలు ముద్రించాలని, గ్రీన్‌ ఎనర్జీ వినియోగం కోసం 35 ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుకు నిర్ణయించింది. అథారిటీ చైర్మన్‌ జవహర్‌రెడ్డి అధ్యక్షతన తొలిసారి ఈ సమావేశం జరిగింది. తిరుమల అభివృద్ధి పనుల నిధుల కేటాయింపుపై సమావేశంలో చర్చించారు.

* ఏపీ సీఎం జగన్‌ను పీవీ సింధు కలిశారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన సింధును సీఎం అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సింధును జగన్ సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఒలింపిక్స్‌లో సాధించిన పతకాన్ని సీఎంకు సింధు చూపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఒలింపిక్స్‌కు వెళ్లేముందు పతకంతో తిరిగి రావాలని సీఎం ప్రోత్సహించారని తెలిపారు. క్రీడాకారుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతోషదాయకమని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని పతకాల సాధనకు అవకాశం కలుగుతుందన్నారు. విశాఖలో తన అకాడమీ నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించిందని.. త్వరలోనే ఏర్పాట్లు పూర్తి చేసి క్రీడాకారులకు శిక్షణ ఇస్తానని సింధు చెప్పారు. ప్రభుత్వం తరఫున సింధుకు రూ.30 లక్షల చెక్కును అధికారులు అమెకు అందించారు.

* సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీ(ఎస్‌వీపీఎన్‌ఏ)లో శిక్షణ పూర్తిచేసుకున్న 72వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులు దీక్షాంత్‌ సమారోహ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దీక్షాంత్‌ సమారోహ్‌ సందర్భంగా శిక్షణ పొందిన 178 మంది పరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పొందిన వారిలో 144 మంది ఐపీఎస్‌లు, 34 మంది ఫారెన్‌ ఆఫీసర్స్‌ ట్రైనీలు ఉన్నారు. 144 మంది ఐపీఎస్‌లలో 23 మంది మహిళలు ఉన్నారు. ఐపీఎస్‌లలో తెలుగు రాష్ట్రాలకు 8 మందిని కేటాయించారు. ఏపీ, తెలంగాణకు నలుగురు చొప్పున రానున్నారు.

* స్వల్ప హెచ్చుతగ్గులతో దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 16,40,287 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 44,643 కొత్త కేసులు వెలుగుచూశాయి. కేసుల్లో నాలుగు శాతం మేర పెరుగుదల కనిపించింది. కేరళ, మహారాష్ట్రలో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కేరళలో 22 వేలు, మహారాష్ట్రలో 9వేలమందికి కరోనా సోకింది. దేశవ్యాప్తంగా మరో 464 మంది ప్రాణాలు విడిచారు. దాంతో మొత్తం కేసులు 3.18 కోట్లకు చేరగా.. 4.26లక్షల మంది మహమ్మారికి బలయ్యారని శుక్రవారం కేంద్రం వెల్లడించింది.

* పులిచింతల సాగునీటి ప్రాజెక్టులో గురువారం అసాధారణ రీతిలో గేటు విరిగి పడిపోయింది. ట్రునియన్‌ గడ్డర్‌కు అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన దాదాపు 250 టన్నుల బరువున్న 16వ నంబరు గేటు ఒక్కసారిగా ప్రవాహ ధాటికి విరిగిపోయింది. ఆ గేటును అనుసంధానించే యాంకర్‌ తెగిపోయింది. నీటిని దిగువకు వదిలే క్రమంలో గేటును నాలుగు అడుగుల మేర పైకి లేపినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. పులిచింతల ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చిన ఏడేళ్లకే గేటు విరిగిపోవడం గమనార్హం. ‘ఏ కారణం వల్ల గేటు విరిగిపోయిందో తెలియదు. దీనిపై విచారణకు నిపుణుల కమిటీని నియమిస్తున్నాం. డ్యాం పూర్తి భద్రతపైనా పరిశీలన చేపట్టాలని ఆదేశించాం’ అని ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చెప్పారు. ‘ముందు పులిచింతల జలాశయంలో నీటి నిల్వను 10 టీఎంసీల స్థాయికి తగ్గిస్తాం. 16వ గేటు ప్రవాహాన్ని అడ్డుకునేలా స్టాప్‌లాగ్‌ గేటు ఏర్పాటు చేస్తాం. వీలైనంత త్వరగా ఈ పని చేస్తాం’ అని ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) నారాయణరెడ్డి వెల్లడించారు.

* యాంత్రిక తప్పిదం వల్లే పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు విరిగినట్లు ప్రాథమికంగా నిర్ధరణ అయిందని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాన్యువల్‌ గేట్ల స్థానంలో హైడ్రాలిక్‌ గేట్ల ఏర్పాటుకు అధ్యయనం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారని తెలిపారు. ఎగువ నుంచి వచ్చే ప్రవాహంతో మళ్లీ పులిచింతల ప్రాజెక్టు నిండుతుందని వివరించారు. కృష్ణా డెల్టా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.

* ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు ఈరోజు సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు. www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ తెలిపారు. 2021 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థుల గ్రేడ్ల వివరాలను జిల్లా, మండలం, పాఠశాల, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ సెలక్ట్‌ చేయడం ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు. 2020 మార్చి, 2021 జూన్‌కు సంబంధించి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. గ్రేడ్లు ఇచ్చేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఛాయారతన్‌ కమిటీ అన్ని విషయాలూ పరిశీలించి సిఫారసులు చేసిందన్నారు. పరీక్షలు లేకపోవడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులకు నష్టం జరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. గ్రేడ్లు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారని తెలిపారు. ఫార్మేటివ్‌, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా గ్రేడ్లు విభజించినట్టు చెప్పారు. గ్రేడ్ల కేటాయింపు వల్ల ఏ విద్యార్థికీ నష్టం వాటిల్లదన్నారు. 2020లో 6.37లక్షలు, 2021లో 6.26లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని మంత్రి సురేష్‌ తెలిపారు. కరోనా వల్ల రెండో ఏడాది కూడా పరీక్షలు నిర్వహించలేకపోయామని వివరించారు.

* కరోనా వైరస్​ జన్యు క్రమాన్ని మార్చుకుంటూ పంజా విసురుతోంది. రోజుకో రూపాన్ని ధరిస్తూ విస్తరిస్తోంది. బ్రిటన్​లో తొలిసారి గుర్తించిన ‘ఈటా వేరియంట్​’ భారత్​కూ పాకింది. కర్ణాటక మంగళూరులోని ఓ వ్యక్తిలో ఈ కొత్త రకాన్ని గుర్తించినట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుడు నాలుగు నెలల క్రితం దుబాయ్​ నుంచి దక్షిణ కన్నడ జిల్లాలోని మూదబిద్రే గ్రామానికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. పరీక్షలు నిర్వహించగా.. అతడికి కరోనా పాజిటివ్​గా తేలిందని, కొద్ది రోజుల తర్వాత కోలుకున్నట్లు పేర్కొన్నారు. బాధితుడితో సన్నిహితంగా ఉన్న దాదాపు 100 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. వైరస్​ జన్యు క్రమంపై పరిశోధన చేసేందుకు నమూనాలను పరిశోధన కేంద్రానికి పంపగా.. ఆ వ్యక్తిలో ఈ కొత్త రకం బయటపడినట్లు వివరించారు.