* మాజీ మంత్రి వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ 62వ రోజూ కొనసాగుతోంది. హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం పులివెందుల వాగులో సీబీఐ తనిఖీలు చేపట్టింది. ఈ కేసులో సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు పులివెందులకు తీసుకెళ్లారు. అతడిచ్చిన సమాచారంతో ఆయుధాల కోసం గాలింపు చేపట్టారు. సునీల్ సమక్షంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. వివేకా ఇంటి సమీపంలోని వాగులో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు మున్సిపల్ ట్యాంకర్లతో వాగులో నీటిని అధికారులు తోడేయిస్తున్నారు.
* బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణలో భాగంగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని విజయాసాయిరెడ్డి, సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 10వ తేదీన విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విజయసాయిరెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారని రఘురామ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
* చెల్లెలి వయస్సు ఉన్న బాలికపై ఒక యువకుడు కర్కశంగా ప్రవర్తించాడు. రక్షణ కల్పించాల్సిన అతను.. కండోమ్ తీసుకురావాలని ఆ బాలికని ఒత్తిడి గురిచేశాడు. దీనికి ఆమె నిరాకరించడంతో కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్లితే.. పుణెకి చెందిన నీలేశ్ (21) అదే ప్రాంతానికి చెందిన ఓ బాలిక దగ్గరకు వెళ్లి దగ్గరలోని ఓ ఫార్మసి స్టోర్‌కి వెళ్లి కండోమ్ ప్యాకెట్ తీసుకురమ్మని బెదరించాడు. దీనికామె నిరాకరించడంతో దూషిస్తూ.. కొట్టడం మొదలెట్టాడు. అంతేకాదు.. కత్తితో మెడపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన ఆమెను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షి తెలిపిన ఆధారాల ప్రకారం.. సమీపంలో ఉన్న కారు నుంచి కత్తి తీసి దాడి చేశారని పోలీసులకు సమాచారం అందించాడు. బాలిక కుటుంబసభ్యులు పుణెలోని చందానగర్ ఠాణాలో చేసిన ఫిర్యాదు మేరకు ఆ యువకుడిని అరెస్టు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
* విమానంలో సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి విమాన సిబ్బంది తగిన బుద్ధి చెప్పారు. ఆ యువకుడి దుందుడుకుతనాన్ని భరించలేని సిబ్బంది అతడిని సీటుకే కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశారు. విమానం ల్యాండ్ అయ్యాక అతడిని పోలీసులకు అప్పగించారు. ఫిలడెల్ఫియా నుంచి మియామీ వెళుతున్న విమానంలో మాక్స్‌వెల్ బెర్రీ (22) అనే అమెరికా యువకుడు మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు. తాకరాని చోట తాకి వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. తోటి ప్రయాణికులతో మాటల యుద్ధానికి దిగాడు. ఇదేంటని ప్రశ్నించిన సిబ్బందిపై దాడికి దిగాడు. దీంతో విసుగు చెందిన విమాన సిబ్బంది సదరు యువకుడిని దొరకబుచ్చుకొని అతడు కూర్చున్న సీట్లోనే అతడిని టేప్ సాయంతో కట్టేశారు. మాట్లాడకుండా నోటికి కూడా టేప్ చుట్టారు. ఆ యువకుడిని కట్టేస్తుంటే తోటి ప్రయాణికులంతా నవ్వుతూ ఆనందం వ్యక్తం చేశాడంటే అతగాడు ఎంతటి గలాటా సృష్టించాడో అర్థమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలకు కొందరు తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తోటి ప్రయాణికుల పట్ల యువకుడు అరవడం, సిబ్బందిపై దాడికి సంబంధించిన ట్విటర్ వీడియోను ఇప్పటివరకు 12.7 మిలియన్లకుపైగా వీక్షించారు. విమానం ల్యాండ్ అవుతుండగా సీట్లో కట్టేసి ఉన్న అతడు ‘నన్ను కాపాడండి’ అంటూ అరుస్తున్న మరో వీడియోకు 3.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు నిందితుడికి తగిన బుద్ధి చెప్పారని కామెంట్లు పెడుతున్నారు.