* స్మార్ట్‌కార్డు యూజర్స్‌కు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. స్మార్ట్‌కార్డు ఉన్న ప్రయాణికులు ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే తమ కార్డులను రీచార్జ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు రైల్వే శాఖ ఒక ప్రకటన చేసింది. తాజా వెసులుబాటుతో స్మార్ట్‌కార్డు ఉన్న ప్రయాణికులు ‘UT Sonmobile’ వెబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా తమ కార్డులను ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. దీనిపై దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. గతంలో స్మార్ట్‌కార్డులో బ్యాలెన్స్ అయిపోతే ప్రయాణికులు రీచార్జ్ కోసం బుకింగ్ కౌంటర్స్ దగ్గరికి రావాల్సి వచ్చేదని, గంటల తరబడి లైన్‌లలో నిలబడాల్సి వచ్చేదని చెప్పారు. దానివల్ల స్మార్ట్‌కార్డు యూజర్ సమయం ఎక్కువగా వృథా అయ్యేదన్నారు. ఆ సమస్యకు పరిష్కారంగానే ఇప్పుడు ఆన్‌లైన్‌లో స్మార్ట్ కార్డ్ రీచార్జ్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.
* జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సింగిల్ డోసు కోవిడ్ టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అత్యవసర వినియోగం కింద ఆ టీకాలను ఇవ్వవచ్చు అని ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. దీంతో భారత్ తన వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పెంచేసింది. జాన్సన్ అండ్ జాన్సన్‌కు అత్యవసర వినియోగం కోసం ఆమోదం దక్కడంతో.. భారత్‌లో వినియోగించనున్న అయిదవ టీకా కానున్నది. యురోపియన్ యూనియన్ ఏజెన్సీ ఆమోదం పొందిన 5 టీకాలు మన వద్ద ఉన్నట్లు మంత్రి తన ట్విట్టర్‌లో తెలిపారు. జాన్సన్ సింగిల్ డోసు రాకతో.. కోవిడ్‌పై పోరాటం మరింత బలోపతం అవుతుందని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా కోవాగ్జిన్, కోవీషీల్డ్, స్పుత్నిక్, మోడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి ఆమోదం దక్కిన విషయం తెలిసిందే.
* అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా విద్యుత్తు స్కూటర్‌లోని కొన్ని ఫీచర్లను ఈరోజు సంస్థ వెల్లడించింది. ద్విచక్రవాహనాల్లో చాలా అరుదుగా ఉండే రివర్స్ మోడ్‌ను దీనిలో పొందుపరిచినట్లు సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్ ప్రకటించారు. ‘రెవల్యూషన్ టు రివర్స్ క్లైమేట్ ఛేంజ్’ అనే క్యాప్షన్‌తో స్కూటర్ రివర్స్‌లో వెళుతున్న ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ‘నమ్మశక్యంకాని వేగంతో స్కూటర్‌ను రివర్స్ చేయొచ్చు’ అని రాసుకొచ్చారు. ద్విచక్రవాహనాల్లో రివర్స్ మోడ్ చాలా అరుదుగా ఉంటుంది. ఖరీదైన బైక్ అయిన హోండా గోల్డ్ వింగ్ సహా.. బజాజ్ చేతక్, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి ఈ-స్కూటర్లలో మాత్రమే ఈ ఫీచర్ ఉంది.
* రిలయన్స్ రిటైల్‌లో విలీనానికి వ్యతిరేకంగా సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు అత్యవసర ఆదేశాలు చెల్లుబాటవుతాయని సుప్రీంకోర్టు సమర్ధించడంతో ఫ్యూచర్ రిటైల్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ గ్రూప్ విలీనానికి గతేడాది ఆగస్టులో రూ.24,713 కోట్ల మేరకు కుదిరిన ఒప్పందంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. దీంతో కిశోర్ బియానీ సారధ్యంలోని ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల రిటైల్ నెట్‌వర్క్ దివాళా అంచున నిలిచింది.