Health

బెంగుళూరులో 242మంది చిన్నారులకు కోవిద్-తాజావార్తలు

బెంగుళూరులో 242మంది చిన్నారులకు కోవిద్-తాజావార్తలు

* కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో కొవిడ్‌ మరోసారి కలకలం రేపింది. గత ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా 242 మంది చిన్నారులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వీరంతా 19 ఏళ్లలోపు వారే. వీరిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 106 మంది ఉండగా.. 9 నుంచి 19 ఏళ్ల వయసువారు 136 మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఈ మేరకు డేటా వెల్లడించింది.

* 2100 నాటికి భారత్‌లోని 12 నగరాలు మునిగిపోనున్నాయంటూ నాసా ఓ నివేదికలో తెలిపింది. విశాఖ సహా 12 నగరాలు కడలి గర్భంలో కలిసి పోతాయన్న నివేదిక సారాంశం భయాందోళనలను కలిగిస్తోంది. కాలుష్యం వల్ల కరిగే మంచు వల్ల సముద్ర మట్టాలు పెరిగి మరో ఎనిమిది దశాబ్దాల్లో భారత్‌లోని తీర ప్రాంత నగరాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నాసా వెల్లడించింది. కర్బన ఉద్గారాలు, కాలుష్యాన్ని నివారించకపోతే పెను విపత్తు తప్పదని భారత్‌ను హెచ్చరించింది.

* రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆపార్టీ అధిష్ఠానం సంకల్పించింది. ఇందులో భాగంగానే రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలతో రాహుల్‌ గాంధీ చర్చలు జరుపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, చింతా మోహన్‌, జేడీ శీలం, మాజీ కేంద్ర మంత్రి పళ్లం రాజు తదితరులు బుధవారం రాహుల్‌ గాంధీ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్‌ ప్రణాళిక, తదితర అంశాలపై సీనియర్‌ నేతలు రాహుల్‌తో చర్చించినట్టు సమాచారం.

* ప్రభుత్వం కోసం పనిచేస్తున్న వారి జీవితాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌కు లేదా? అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్‌ తన బాధ్యతను విస్మరిస్తే ఫీల్డ్‌ అసిస్టెంట్లు దాన్ని గుర్తు చేస్తూ సమ్మె చేస్తే వారి జీతాలు పెంచాల్సింది పోయి ఉద్యోగాల నుంచే తీసేస్తారా? అని ఆమె నిలదీశారు. ఇందిరాపార్కు వద్ద కాంట్రాక్ట్ ఫీల్డ్‌ అసిస్టెంట్లు నిర్వహించిన ధర్నాలో షర్మిల పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

* తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేసే ఉద్దేశం సీఎం కేసీఆర్‌కు ఉందా? నదీ యాజమాన్య బోర్డుల భేటీకి ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ) ఎందుకు హాజరు కాలేదని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. దీని ద్వారా ఏపీ అక్రమ ప్రాజెక్టులపై నిలదీసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందన్నారు. బోర్డుల సమావేశాలకు హాజరైతేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కృష్ణాలో 555 టీఎంసీలు రాష్ట్రానికి రావాల్సి ఉండగా కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకున్నారని మండిపడ్డారు. ఉన్న 299 టీఎంసీలనూ రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవట్లేదని.. ఏపీ ప్రభుత్వం 150 టీఎంసీలు అదనంగా వినియోగించుకుంటుందన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా హాలియాలో నిర్వహించిన సభలో.. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్‌ మాటిచ్చారని బండి సంజయ్‌ గుర్తు చేశారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌కు పోడు రైతులు, వారి సమస్యలు గుర్తుకు వస్తాయా? అని ప్రశ్నించారు.

* హుజూరాబాద్‌లో అభ్యర్థి ఎవరైనా సీఎం కేసీఆర్‌కు బానిసే అని భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార తెరాస రూ.కోట్లు ఖర్చు పెడుతోందని ఆరోపించారు. హుజూరాబాద్‌లో కుల సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈటల మాట్లాడారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. బానిస అభ్యర్థులు కావాలా? ప్రజల హక్కులు, ఆత్మ గౌరవం కోసం పోరాడే వ్యక్తి కావాలా? అనేది హుజూరాబాద్‌ ప్రజలే నిర్ణయిస్తారన్నారు. హుజూరాబాద్‌ ఎన్నిక ఉపఎన్నిక మాత్రమే కాదని.. ఈ ఎన్నికతో ఇంకెంతమంది రాజేందర్‌లు ప్రశ్నిస్తారోనని సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలందరి మీద కేసీఆర్‌ నిఘా ఉందన్నారు. 2014కు ముందు వరకు సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావు ఆస్తులెంతో ప్రజలందరికీ తెలుసునని ఈటల వెల్లడించారు.

* మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 66వ రోజు కొనసాగుతోంది. ఈ హత్యకు ఆర్థిక మూలాలే కారణంగా తెలుస్తోంది. కస్టడీలో ఉన్న సునీల్‌ యాదవ్‌ ఇచ్చిన సమాచారం మేరకు సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. విచారణలో భాగంగా ఈ ఉదయం కడపలోని కేంద్ర కారాగారంలో ఉన్న అతిథి గృహానికి కర్ణాటక నుంచి 20 వాహనాల్లో బ్యాంకు అధికారులు, రెవెన్యూ సిబ్బంది వచ్చారు. వారి వద్ద ఉన్న వివేకాకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, రెవెన్యూ రికార్డులను సీబీఐ అధికారులకు ఇచ్చారు.

* ‘‘ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన కేసీఆర్‌ను ఈటల రాజేందర్‌ ..‘రా’ అంటున్నాడు.. బీజేపీలో చేరాక ఆయన మాట మారింది.. ఓటమి భయంతోనే ఈటల మాట తూలుతున్నాడు’’ అంటూ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచి పెద్ద చేసిన కొడుకు గుండెల మీద తంతే ఎలా ఉంటుందో.. ఈటల వ్యవహారం అలానే ఉందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ తరపున హరీశ్‌రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హుజురాబాద్‌లో స్వాగతం చూస్తా ఉంటే.. శ్రీనివాస్‌ భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని అర్థమవుతుంది. బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసే ఈటెల రాజేందర్.. తనను చూసి ఓటు వేయమంటున్నడు. బీజేపీలో ఉంటు ఆత్మ వంచన చేసుకొని ఆత్మగౌరవం అంటున్నాడు. మంత్రిగా ఉన్నప్పుడు చేయలేని పనులు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ రాదు. పోటీ ఉన్నది టీఆర్ఎ‌స్ పార్టీకి.. బీజేపీకే’’ అని తెలిపారు.

* ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం జగన్‌ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. నేతన్నలకు చంద్రబాబు 50 పైసలైనా ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. బీసీల తలరాత మార్చిన నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. మంత్రుల్లో బీసీలకు పెద్దపీట వేశారని, 4 రాజ్యసభ సీట్లలో 2 బీసీలకు ఇచ్చారని తెలిపారు.