Business

పెరిగిన పసిడి ధర-వాణిజ్యం

పెరిగిన పసిడి ధర-వాణిజ్యం

* క్రిప్టో కరెన్సీ చరిత్రలో ఇది భారీ కుదుపు.. డీసెంట్రలైజ్డ్‌ ఫైనాన్షియల్‌ (డీఫై) సర్వీసెస్‌ అందించే పాలినెట్‌వర్క్‌ యాప్‌లో దొంగలు చొరబడ్డారు. ఈ యాప్‌ తాలూకు బ్లాక్‌చెయిన్‌ను ఛేదించి.. కనీ వినీ ఎరుగని రీతిలో 61.1 కోట్ల డాలర్ల (రూ.4,537 కోట్లు) క్రిప్టో కరెన్సీని చోరులు కొల్లగొట్టారు. పాలినెట్‌వర్క్‌ కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ మంగళవారం ట్వీట్‌ చేశారు. హ్యాకర్లు ఆ సొమ్మును మళ్లించిన చిరునామాలను కూడా అందులో పేర్కొన్నారు. ఈ చిరునామాల నుంచి వచ్చే టోకెన్లను బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిందిగా ఇతర ఎక్స్ఛేంజీలకు విజ్ఞప్తి చేశారు. మరో ప్రయత్నంగా.. ‘డియర్‌ హ్యాకర్స్‌’ అంటూ కొల్లగొట్టిన సొమ్మును తిరిగి వెనక్కు బదిలీ చేయవలసిందిగా వారిని కోరుతూ లేఖ కూడా రాశారు.

* ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ తమ ప్రయాణికుల కోసం కొత్త సదుపాయం పరిచయం చేసింది. ఎయిర్‌పోర్ట్‌లో దిగాక క్యాబ్‌ బుక్‌ చేసి వేచి చూసే బదులు.. ప్రయాణంలో ఉంటూనే గమ్యస్థానానికి చేరుకునేందుకు వీలుగా క్యాబ్‌ బుక్‌ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. తన ఆన్‌బోర్డ్‌ సర్వీస్‌ ‘స్పైస్‌స్క్రీన్‌’ ద్వారా ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. తొలుత గురువారం (ఆగస్టు 12) దిల్లీలో ఈ సేవలు ప్రారంభించామని, దశలవారీగా ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, గోవా, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, పుణె వంటి ప్రధాన విమానాశ్రయాలకు విస్తరించనున్నామని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణ సమయాన్ని, వేచి చూసే సమయాన్ని తగ్గించడానికి ఈ సదుపాయం తీసుకొచ్చినట్లు తెలిపింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 16,300 ఎగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.25గా ఉంది.

* ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తొలి త్రైమాసికం ఫలితాలను గురువారం విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఐఆర్‌సీటీసీ నష్టాల నుంచి లాభాల బాట పట్టింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.82.5 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.24.6 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 84.8 శాతానికి పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో ఆదాయం రూ.132 కోట్ల నుంచి రూ.224 కోట్లకు పెరిగింది.

* దేశ రాజ‌ధాని ఢిల్లీలో బంగారం ధ‌ర ( Gold price ) మ‌ళ్లీ పెరిగింది. గ‌త కొన్ని రోజుల నుంచి వ‌రుస‌గా త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర ఇవాళ మ‌ళ్లీ పెరిగింది. ఢిల్లీ మార్కెట్‌లో ఇవాళ 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.422 పెరిగి రూ.45,560కి చేరింది. క్రితం ట్రేడ్‌లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.45,138 వ‌ద్ద ముగిసింది. అంత‌ర్జాతీయంగా విలువైన లోహాల డిమాండ్ పెరుగ‌డ‌మే ఇవాళ దేశీయంగా బంగారం ధ‌ర పెరుగ‌డానికి కార‌ణ‌మ‌ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.