‘‘హరీశ్.. నీ మోసపూరిత మాటల్ని హుజూరాబాద్ ప్రజలు నమ్మరు. పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్య పెడుతున్నవ్.. మీ మామ కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నవ్.. ఎప్పటికైనా నాలెక్కనే నీపని కూడా తెరాసలో ముగుస్తదని గుర్తుపెట్టుకో’’ అని భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంత్రి హరీశ్‌రావును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మాట్లాడారు. ‘మీ మామ నియోజకవర్గంలో నువ్వు వరుసగా గెలుస్తున్నవ్. ఇక్కడ నేను రాజకీయాలతో సంబంధం లేకున్నా.. రాజకీయ కుటుంబం కాకపోయినా ఒక్కసారి అవకాశం ఇస్తే ఇన్నిసార్లు ప్రజల ప్రేమతో అప్రతిహతంగా గెలిచిన వ్యక్తిని. నువ్వు అసలు సర్పంచిగా గెలవకుండా మంత్రిగా మారినవనే విషయాన్ని గుర్తుపెట్టుకో. 18 ఏళ్ల అనుబంధంలో నీవేందో నాకు తెలుసు. నేనేందో నీకు తెలుసు. చిల్లర ప్రయత్నాలు చేసి అభాసుపాలు కాకు. మెత్తటి దిండు తడిసే దాక నువ్వు ఎన్ని సార్లు ఏడ్చినవో నాకు తెలియదా? అధర్మపు మాటలు మాట్లాడకు. కేసీఆర్, కేటీఆర్‌ల నియోజకవర్గాల్లోనే గుత్తేదార్ల సహకారంతో రెండుపడక గదుల ఇళ్లు పూర్తయ్యాయి. మీ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లల మాదిరిగా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవచ్చు. కానీ ఉన్నంతలో నేను చేసుకున్న. ప్రజల మెప్పును అందుకున్నా’’ అని వివరించారు. ఇప్పటికే తనను హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓడించాలని రూ.192 కోట్లను ఖర్చు చేశారని.. సీఎం కేసీఆర్ పెట్టినన్ని డబ్బులు తాను ఖర్చు చేయలేనని అన్నారు. అవసరమైతే ఇక్కడి ప్రజల వద్దకు వెళ్లి ఇంటింటి నుంచి రూ.వెయ్యి ఇవ్వండి అని అడిగి ఎన్నికల్లో ఖర్చు పెడతానని తెలిపారు.
హరీష్…నీ రాజకీయ జీవితం కూడా నాలానే అయితది
Related tags :