Politics

2023 జూన్ వరకు సమయం ఇచ్చిన జగన్-తాజావార్తలు

2023 జూన్ వరకు సమయం ఇచ్చిన జగన్-తాజావార్తలు

* అంత్యక్రియలకు డబ్బుల్లేవని తాత మృతదేహాన్ని మనవడు ఇంట్లోని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఈ హృదయ విదారక ఘటన వరంగల్‌ గ్రామీణ జిల్లా పరకాలలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డికి చెందిన విశ్రాంత ఉద్యోగి బాలయ్య(93) తన మనవడు నిఖిల్‌తో కలిసి పరకాలలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. బాలయ్యకు వచ్చే పింఛను డబ్బులతోనే ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో 3 రోజుల క్రితం బాలయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బుల్లేకపోవడంతో తాత మృతదేహాన్ని నిఖిల్‌ ఇంట్లోని ఫ్రిజ్‌లో పెట్టాడు. గురువారం చుట్టుపక్కల వారికి బాలయ్య ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ శివరామయ్య, సీఐ మహేందర్‌రెడ్డి సిబ్బందితో చేరుకొని ఫ్రిజ్‌లో ఉన్న శవాన్ని చూసి అవాక్కయ్యారు. వృద్ధుడి మృతిపై ఆరా తీశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బుల్లేకపోవడంతోనే మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచి పెట్టానని నిఖిల్‌ స్థానికులు, పోలీసులకు వివరించాడు.

* సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్‌ రొహింటన్‌ ఫాలీ నారీమన్‌ పదవీ విరమణ పొందారు. గోప్యత ప్రాథమిక హక్కు, గే సెక్స్‌, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వంటి కీలకమైన తీర్పులిచ్చిన ధర్మాసనాల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. సీజేఐ ఎన్వీ రమణ తర్వాత సుప్రీంకోర్టు రెండో సీనియర్‌ న్యాయమూర్తి కూడా ఆయనే. ఆయన పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో జస్టిస్‌ నారీమన్‌ను ఓ సింహంతో పోల్చారు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ. వీడ్కోలు సభలో ఒకింత భావోద్వేగానికి గురై మాట్లాడారు.

* భాజపా నేత ఈటల రాజేందర్‌కు హుజూరాబాద్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాగార్జున సాగర్‌లో జానారెడ్డికి పట్టిన గతే.. ఉప ఎన్నికలో ఈటలకు పడుతుందన్నారు. హైదరాబాద్‌లో తలసాని మీడియాతో మాట్లాడారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను బానిసగా పేర్కొనడం.. ఈటల అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈటల ముందు గెల్లు శ్రీనివాస్ యాదవ్ చిన్న పిల్లవాడు కావచ్చు కానీ.. మొదట పోటీ చేసినప్పుడు ఈటల కూడా దామోదర్ రెడ్డి ముందు చిన్నవాడేనని గర్తుపెట్టుకోవాలని సూచించారు.

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2023 జూన్‌ నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమగ్ర భూసర్వేపై ఇవాళ సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడారు. ‘‘లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునేలా ముందుకు సాగాలి. అవసరమైన పరికరాలు, వనరులను సమకూర్చుకోండి. డ్రోన్లు సహా అవసరమైనవి కొనుగోలు చేయండి. సాఫ్ట్‌వేర్‌తో పాటు సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలి. సర్వే త్వరితగతిన పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించాలి.

* హుజూరాబాద్‌ను శాయశక్తులా అభివృద్ధి చేశానని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. జమ్మికుంటలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడారు. ‘‘హుజూరాబాద్‌లో పెద్దగా పెండింగ్‌ పనులు లేవు. చేసిన పనులకు చాలా మందికి బిల్లులు రావడం లేదు. నాకు భాజపా నేతల నుంచి పూర్తి సహకారం ఉంది. నాది కారు గుర్తు అని తెరాస నేతలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నిండుగా ఉంటే.. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు డబ్బులు ఎందుకు చెల్లించడం లేదు?’’ అని ప్రశ్నించారు.

* పార్టీ ఫిరాయింపుల చట్టంలో షెడ్యూల్‌ 10ని తాను ఉల్లంఘించడం లేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఫిరాయింపుల అంశంపై విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైకాపా ఎంపీలు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజును కలిసిన నేపథ్యంలో రఘురామ దిల్లీలో మీడియాతో మాట్లాడారు. కర్నూలుకు హైకోర్టు మార్చాలని కేంద్ర మంత్రిని తమ ఎంపీలు కోరారని.. పార్టీ హెడ్‌ క్వార్టర్స్‌ మార్చినంత త్వరగా కోర్టును మారుస్తారా? అని ఆయన ప్రశ్నించారు.

* తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ రెస్పాన్స్‌ షీట్లు, ప్రాథమిక కీని ఎంసెట్‌ పరీక్షల కన్వీనర్‌ గోవర్దన్‌ విడుదల చేశారు. ప్రాథమిక సమాధానాలపై ఎమైనా అభ్యంతరాలుంటే ఆన్‌లైన్‌లో సంప్రదించాలని సూచించారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అభ్యంతరాలను సమర్పించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు ఈనెల 25వ తేదీన వెలువడనున్నాయి. ఈ మేరకు ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ తేదీని ఖరారు చేసింది. కౌన్సెలింగ్‌ను ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 16,300 ఎగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.25గా ఉంది. ఉదయం 54,669 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ స్వల్ప ఒడుదొడుకులు ఎదుర్కొంది. చివరికి 318.05 పాయింట్ల లాభంతో 54,843.98 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 82.10 పాయింట్ల లాభంతో 16,364.40 వద్ద స్థిరపడింది.

* పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు వ్యవహరించిన తీరును కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఏడుగురు కేంద్రమంత్రులు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌ను సజావుగా సాగనీయకుండా ఆటంకం సృష్టించడం, బెదిరింపు ధోరణులతో వ్యవహరించినందుకు ప్రతిపక్షం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లోకి బయటి వ్యక్తులను తీసుకొచ్చి దాడిచేయించారన్న విపక్ష నేతల ఆరోపణలను కొట్టిపారేశారు.

* కరోనా వైరస్‌ ప్రపంచమంతటా వ్యాపించి, పలు దేశాల్లో రూపం మార్చుకుంటోంది. ఇలా మార్పులు సంతరించుకున్న వైరస్‌ ప్రమాదకరంగా మారి… వ్యాక్సిన్ల ద్వారా ఉత్పత్తయ్యే యాంటీబాడీలకు చిక్కడం లేదు! దీంతో కొన్నిసార్లు టీకాలు తీసుకున్నవారు కూడా కొవిడ్‌కు గురై, ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. దీనికి పరిష్కారం కనుగొనేందుకు అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో బౌల్డర్‌’ శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. యాంటీబాడీలను తప్పించుకుని తిరుగుతున్న కరోనా, హెచ్‌ఐవీ, ఇన్‌ఫ్లుయెంజా తదితర వైరస్‌లను దీని ద్వారా గుర్తించవచ్చు!

* తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న దళితబంధు పథకం చాలా గొప్ప కార్యక్రమమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కొనియాడారు. దళితబంధు పథకం వల్ల వారి జీవితాలు బాగుపడతాయన్నారు. సీఎం నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్వే సత్యనారాయణ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

* హుజూరాబాద్‌ను శాయశక్తులా అభివృద్ధి చేశానని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. జమ్మికుంటలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడారు. ‘‘హుజూరాబాద్‌లో పెద్దగా పెండింగ్‌ పనులు లేవు. చేసిన పనులకు చాలా మందికి బిల్లులు రావడం లేదు. నాకు భాజపా నేతల నుంచి పూర్తి సహకారం ఉంది. నాది కారు గుర్తు అని తెరాస నేతలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నిండుగా ఉంటే.. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు డబ్బులు ఎందుకు చెల్లించడం లేదు?రైతు బంధు తెలంగాణ మొత్తం అమలు చేసి.. దళిత బంధును హుజూరాబాద్‌లోనే ఎందుకు అమలు చేస్తున్నారు? నాకు ఓటేస్తే పథకాల నుంచి పేర్లను తొలగిస్తాం అని ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవం. దుబ్బాకలో అలాగే చేశారా? హుజూరాబాద్‌లో డబ్బులు పంచడానికి హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు అమ్మేశారు. మూడు నెలల నుంచి ప్రచారం చేస్తున్నాను. ఎన్నికల్లో గెలిచేది నేనే’’ అని ఈటల తెలిపారు.