బెయిల్ అంటే ఏంటి?
*బెయిల్స్ రకాలు, బెయిల్స్ రద్దు గురించి తెలుసుకుందాం ?
తెలిసో తెలియకో ప్రత్యక్షంగానో పరోక్షంగానో చాలామంది వివిధ కేసులలో ఇరుక్కుంటారు. అలా ఇరుకోగానే మొదటిగా గుర్తుకు వచ్చేదే బెయిల్. ఎప్పుడేగాని పోలీస్ స్టేషన్ మరియు కోర్టు మెట్లు ఎక్కనివారికి మాత్రం బైయిల్ అనేది కొత్తమాట. ఏదైనా కేసులో పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఎలా బెయిల్ పొందవచ్చనేది చాలామందికి తెలియదు. నేరారోపణలు మోపిన వ్యక్తిపై విచారణ జరగుతున్నప్పుడు కొన్ని నిబంధనలకు లోబడి వారిని జైలు నుంచి విడుదల చేయవచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించకుండా, నిబంధనలకు లోబడి జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాన్ని బెయిల్ కల్పిస్తుంది. ఇందుకు అవసరమైనప్పుడు కోర్టులో హాజరవుతానని ప్రతివాది హామీ ఇవ్వాల్సి ఉంటుంది. బెయిల్ నిర్ణీత సమయానికి మాత్రమే ఇస్తారు
*బెయిల్ అంటే….? బెయిల్స్ రకాలు…
ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏదైనా కేసులో అరెస్టయితే వారిని నిందితులుగా భావించి పోలీసులు కోర్టులో హాజరు పరుస్తారు. సదరు వ్యక్తులను న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ కి తరలించడం సర్వసాధారణం. రిమాండ్ నుంచి నిందితులకు మినహాయింపు ఇచ్చే సదుపాయాన్నే బెయిల్ అంటారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 436, 437, 438ని అనుసరించి నిందితులకు కోర్టు నుంచి బెయిల్ ఇస్తారు కోర్టు విచారణ పెండింగ్‌లో ఉండి, సంబంధిత కేసుపై కోర్టు ఇంకా తీర్పు ఇవ్వనప్పుడు మాత్రమే బెయిల్ పొందే వీలుంటుంది. మన దేశంలో రెగ్యులర్, మధ్యంతర, యాంటిసిపేటరీ బెయిల్.. స్టేషన్ బైయిల్ అని మొత్తం నాలుగు రకాల బెయిల్స్ ఉన్నాయి.
*మధ్యంతర బెయిల్ అంటే?
మధ్యంతర బెయిల్‌ను తక్కువ కాలానికి మంజూరు చేస్తారు. సాధారణ లేదా ముందస్తు బెయిల్ కోసం విచారణ జరగడానికి ముందు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తారు.
*రెగ్యులర్ లేదా సాధారణ బెయిల్ అంటే?
నాన్ బెయిలబుల్ నేరానికి పాల్పడినవారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. పోలీసు కస్టడీ ముగిసిన తరువాత, అవసరమైతే నిందితుడిని జైలుకు పంపుతారు. నిబంధనల ప్రకారం వీరు సాధారణ బెయిల్ పొందవచ్చు. క్రిమినల్ ప్రొసీడింగ్ కోడ్ లోని సెక్షన్ 437, 439 ప్రకారం.. విచారణకు హాజరవుతామనే హామీతో పోలీసు కస్టడీలో ఉన్నవారు విడుదల అయ్యేందుకు రెగ్యులర్ బెయిల్ అవకాశం కల్పిస్తుంది.
*ముందస్తు బెయిల్ అంటే ఏంటి?
యాంటిసిపేటరీ (ముందస్తు) బెయిల్ అంటే ఏదైనా నేరం చేసినవారు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచేలోగా అరెస్ట్ కాకుండా ఉండేందుకు కోర్టు ద్వారా పొందే బెయిల్‌ను ముందస్తు బెయిల్ అంటారు. నేరం చేయడం లేదా నేరంలో ఇరుక్కుని అరెస్ట్ కావాల్సి వచ్చిన సమయంలో జామీనుదారుల్ని ఏర్పాటు చేసుకుని కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందవచ్చు. అన్ని నేరాల్లో ముందస్తు బెయిల్ రాదు. న్యాయమూర్తి కేసు తీవ్రతను బట్టి ముందస్తు బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటారు. ఒక్కొక్కసారి నిందితుడు పోలీసులకు కాని, కోర్టులో కాని లొంగిపోయి, వారి ద్వారా కోర్టుకు హాజరైతేనే బెయిల్ ఇచ్చే నిబంధనలు కూడా ఉంటాయి.
*ముందస్తు బెయిల్‌ను రద్దు చేయవచ్చు ?
ముందస్తు బెయిల్‌ను రద్దు చేసే అధికారం కోర్టులకు ఉంది. సాధారణంగా ముందస్తు బెయిల్ మంజూరు చేసే సమయంలోనే, కోర్టు కొన్ని నిబంధనలు, షరతులను విధిస్తుంది. వీటిని ఉల్లంఘించిన సందర్భాల్లో కోర్టు ముందస్తు బెయిల్‌ను రద్దు చేయవచ్చు. ఈ విషయంపై ఫిర్యాదుదారులు లేదా ప్రాసిక్యూషన్ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిగిన తరువాత అవసరమైతే కోర్టు ముందస్తు బెయిల్‌ను రద్దు చేయవచ్చు.
*ముందస్తు బెయిల్ ఉన్నవారు సాధారణ బెయిల్ తీసుకోవచ్చు?
ముందస్తు బెయిల్ తీసుకున్న వారు రెగ్యులర్ బెయిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కోర్టు దాన్ని రద్దు చేయకపోతే, కేసు విచారణ ప్రక్రియ ముగిసే వరకు ముందస్తు బెయిల్ చెల్లుతుంది. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు ముందస్తు బెయిల్‌ను సాధారణ బెయిల్‌గా మార్చవచ్చు.
*అండర్ ట్రయల్ ఖైదీని ఎన్ని రోజుల వరకు అదుపులోకి తీసుకోవచ్చంటే?
వ్యక్తులపై మోపిన ఆరోపణలు నిజమేనని తేలితే కోర్టులు శిక్ష విధిస్తాయి. కానీ విచారణ పూర్తి కాకుండా పోలీసుల అదుపులో ఉండేవారికి నేరం రుజువైనప్పుడు కోర్టులు విధించే శిక్షలో సగం శిక్షను అనుభవించిన తరువాత బెయిల్ మంజూరు చేయాలి. సీఆర్‌పీసీలోని సెక్షన్ 436ఏ ప్రకారం వారికి బెయిల్ మంజూరు చేస్తారు.
*స్టేషన్ బెయిల్
జూదాలు, వరకట్నం వేధింపులు, ప్రమాదాల కేసుల్లో అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేరుగా ఇచ్చే బెయిల్‌ను స్టేషన్ బెయిల్ అంటారు. సీఆర్‌పీసీ నూతనంగా చేసిన సవరణల ప్రకారం ఏడు సంవత్సరాలలోపు శిక్షలు పడే నేరాలన్నిటిలోను స్టేషన్ బెయిల్ ఇవ్వవచ్చని పేర్కొన్నారు. అయితే దొంగతనం, దోపిడీల వంటి తీవ్ర నేరాల్లో నిందితుడు సాక్షులను బెదిరిస్తాడని లేదా తప్పించుకు పోతాడని పోలీసులు భావిస్తే వారికి న్యాయస్థానాల్లో రిమాండు విధిస్తారు. ఈ బెయిల్ పొందినవారికి పోలీసులు నోటీసులు ఇచ్చి కోర్టుకు హాజరు కావాలని సూచిస్తారు.
*న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేకపోతే ఏమి చేయాలంటే?
ఏదైనా నేరంలో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచిన తరువాత రిమాండ్ విధించబడే సమయంలో మెజిస్ట్రేట్ వారు ముద్దాయిని న్యాయవాదిని పెట్టుకునే స్థోమత ఉందా లేదా అని అడిగినప్పుడు స్థోమత లేనిచో లేదు అని మెజిస్ట్రేట్ విన్నవించినప్పిడు నిరుపేదల కోసం కోర్టు వారే సంబంధిత వ్యక్తి తరుపున న్యాయవాదిని నియమిస్తుంది. ఆ న్యాయవాది వాదనలు విన్న తరువాత కోర్టు బెయిల్ పొందే అవకాశం ఉంది.
*కోర్టులు ఎప్పుడు బెయిల్ తిరస్కరించవచ్చు?
మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించే తీవ్రమైన నేరాలకు పాల్పడ్డట్లు నమ్ముతున్న నిందితులకు కోర్టులు బెయిల్ మంజూరు చేయవు. ఇంతకుముందు మరణశిక్ష, జీవిత ఖైదు, ఏడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించిన నేరానికి పాల్పడిన వారికి గతంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సందర్భాల్లో దోషిగా తేలిన వారికి బెయిల్ ఇవ్వరు.
*బెయిల్ రద్దు అంటే ఏంటి?
బెయిల్ మంజూరు చేసిన తరువాత, దాన్ని రద్దు చేసే విచక్షణ అధికారం కోర్టులకు ఉంటుంది. సీఆర్‌పీసీలోని సెక్షన్ 437 (5), సెక్షన్ 439 (2) ప్రకారం కోర్టులకు ఈ అధికారం ఉంది. బెయిల్ రద్దు చేయడానికి కారణాలను గుర్తించి, ఇప్పటికే ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసి, ఆ వ్యక్తిని అరెస్టు చేయాలని పోలీసులకు కోర్టులు ఆదేశాలు ఇవ్వవచ్చాని ఓ న్యాయవాది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.