Editorials

విడాకులు భార్యకు గానీ బిడ్డలకు కాదు-తాజావార్తలు

విడాకులు భార్యకు గానీ బిడ్డలకు కాదు-తాజావార్తలు

* కరోనా తీవ్రత నేపథ్యంలో వినాయక చవితి పండుగకు ఇళ్లలోనే నిరాడంబరంగా మట్టి గణపతులను పూజించాలని ప్రజలకు సూచిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గణేష్‌ ఉత్సవాలపై సూచనలు కాదని, స్పష్టమైన ఆదేశాలు ఉండాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. మతపరమైన సెంటింమెంట్లు మంచిదే కానీ… ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

* రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు పెరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ తెలిపారు. దోమలు, లార్వా వృద్ధి నివారణ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోఠిలోని ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో డీహెచ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మలేరియా కేసులు అధికంగా వస్తున్నాయన్నారు.

* ఏపీలో విచిత్ర పథకాలతో ప్రైవేటు విద్యాసంస్థలకు కష్టాలు ఎదురవుతున్నాయని.. యాజమాన్యాలు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం సరికాదని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ‘నాడు- నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలకు రంగులేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. ప్రైవేటు బడుల్లో పని చేస్తున్న వారితో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి’ అని ఆయన అన్నారు

* రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను తమ సొంత జాగీరుగా భావిస్తోందని భాజపా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అత్యంత రహస్యంగా పరిపాలన సాగించాలనే ఉద్దేశంతో జీవోలను ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో ఉంచాలని నిర్ణయించిందని.. దీన్ని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నా మాట్లాడారు.

* ఈ నెల 24 నుంచి ప్రారంభంకానున్న ప్రజా సంగ్రామ పాదయాత్రకు ఉప్పెనలా కదలి రావాలని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ప్రజలంతా భాజపాతో కలిసి పాదయాత్రలో పాల్గొనాలని కోరారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సర్దార్‌ సర్వాయి పాపన్న 371వ జయంతి వేడుకల్లో సంజయ్‌ పాల్గొని నివాళులర్పించారు.

* రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జీవో ఇచ్చిన 24 గంటల్లో వెబ్‌సైట్‌లో ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. వాసాలమర్రిలో దళితబంధు అమలుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వాచ్‌ వాయిస్‌ ఆఫ్ పీపుల్ సంస్థ వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ విజయసేన్‌ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పథకానికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేయకుండానే దళిత బంధుకు నిధులు విడుదల చేశారని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు.

* ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వవచ్చు గానీ పిల్లలకు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారి సంరక్షణ నిమిత్తం రూ.4 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. 2019 నుంచి విడివడి ఉంటున్న భార్యాభర్తల పరస్పర అంగీకారం మేరకు విడాకులు మంజూరు చేసింది. ముంబయికి చెందిన ఆభరణాల వ్యాపారి దాఖలు చేసిన విడాకుల కేసుపై జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాల ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. పరస్పర ఒప్పందంలోని షరతులకు ఉభయులు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. కరోనా వల్ల మారిపోయిన పరిస్థితుల్లో తన క్లయింట్‌ రూ.4 కోట్ల పరిహారం చెల్లించడానికి మరికొంత సమయం కావాలని భర్త తరఫు న్యాయవాది కోరారు. దానికి ధర్మాసనం అంగీకరించలేదు. కడుపున పుట్టిన పిల్లల సంరక్షణను చూసుకోవాల్సిందేనని, మైనర్‌ పిల్లల పోషణ నిమిత్తం తాము చెప్పిన మొత్తాన్ని చెల్లించాలని తేల్చిచెప్పింది. వచ్చే నెల ఒకటో తేదీన రూ.కోటి, ఆ నెల 30న మిగిలిన రూ.3 కోట్లు ఇవ్వాలని ఆదేశించింది. కక్షిదారులు పరస్పరం దాఖలు చేసుకున్న కేసుల్ని కొట్టివేసింది.

* అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలు 30 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుదలతో అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.10,500 నుంచి రూ.13,650కి పెరగనుంది. మినీ అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.6వేల నుంచి రూ.7,800లకు పెరగనుంది. అంగన్వాడీ కార్యకర్తల వేతనం రూ.6వేల నుంచి రూ.7,800లకు పెరగనుంది. అంగన్వాడీ టీచర్లకు పెరిగిన వేతనాలు జూలై నుంచి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు వేతనాల పెంపుపై మహిళా, శిశుసంక్షేమశాఖ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.