Business

కార్వీ ఎండీ పార్థసారధి అరెస్ట్-వాణిజ్యం

కార్వీ ఎండీ పార్థసారధి అరెస్ట్-వాణిజ్యం

* ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) మరో కొత్త బైక్‌ను విడుదల చేసింది. ఛ్భ్200X పేరిట కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధరను రూ.1.44 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌, గురుగ్రామ్‌) నిర్ణయించింది. రోజువారీ అవసరాలతో పాటు ఆఫ్‌రోడ్‌ రైడింగ్‌కు అనుగుణంగా ఈ బైక్‌ను హోండా తీర్చిదిద్దింది. హీరో ఎక్స్‌పల్స్‌ 200కు పోటీగా ఈ బైక్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

* ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ వేగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే నెక్సాన్‌ ఈవీ పేరిట ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్‌లోకి విడుదల చేసిన ఆ కంపెనీ.. తాజాగా టిగోర్‌ ఈవీ పేరిట మరో కారును బుధవారం లాంచ్‌ చేసింది. దీనికి సంబంధించిన బుకింగ్‌లను ప్రారంభించింది. డీలర్ల వద్ద రూ.21వేలు చెల్లించి కొత్త టిగోర్‌ను బుక్‌ చేసుకోవచ్చని టాటా మోటార్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 31 నుంచి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

* ఉద్యోగ భ‌విష్య నిధి అంటే ఒక సంస్థ‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగుల కుటుంబాల భ‌విత‌వ్యం కోసం ఏర్పాటు చేసింది.. దేశ‌వ్యాప్తంగా వివిధ సంస్థ‌ల ఉద్యోగుల భ‌విత‌వ్యం కోసం ఏర్పాటు చేసిన ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో దొంగ‌లు ప‌డ్డారు.. ఇంటి దొంగ‌లే సుమా.. గ‌తంలో ఇంటి దొంగ‌ను ఈశ్వ‌రుడైనా ప‌ట్ట‌లేడంటారు.. కానీ ఆధునిక యుగంలో టెక్నాల‌జీ టూల్స్ జాగ్ర‌త్త‌గా ఉప‌యోగిస్తే ఇంటి దొంగ‌ల్ని ఇట్టే ప‌ట్టేయొచ్చు.. ఈ ఘ‌ట‌న ముంబైలోని ఈపీఎఫ్‌వో ఆఫీసులో జ‌రిగింది. ముంబై ఈపీఎఫ్‌వో ఆఫీసులోని కొంద‌రు ఉద్యోగులు కుమ్మ‌క్క‌య్యారు. ఈపీఎఫ్‌వో పూల్‌లో ఉండే నిధుల నుంచి రూ.21.5 కోట్లు స్వాహా చేశార‌ని ఒక ఆంగ్ల దిన‌ప‌త్రిక‌లో వార్తా క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది.

* తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌లు ర‌కాల ఆర్థిక సేవ‌లు అందిస్తున్న సంస్థ కార్వీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ పార్ధసార‌ధిని సీసీఎస్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నార‌ని స‌మాచారం. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌ను చెల్లించ‌లేద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. బ్యాంకు అధికారుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించి తాను తీసుకున్న రుణాల‌ను అక్ర‌మంగా వాడుకున్నార‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. పార్ధ‌సార‌ధి రూ.780 కోట్ల మేర‌కు రుణాలు తీసుకున్నట్లు స‌మాచారం. వీటితోపాటు రూ.720 కోట్ల క‌స్ట‌మ‌ర్ల నిధుల‌ను కూడా తారుమారు చేశార‌ని ఆయ‌న‌పై అభియోగాలు ఉన్నాయి. ఇంత‌కుముందు షేర్ల అక్ర‌మ లావాదేవీల‌కు పాల్ప‌డినందుకు స్టాక్ మార్కెట్ల నియంత్ర‌ణ సంస్థ సెబీ.. గ‌తంలో కార్వీపై నిషేధం విధించింది.

* క‌రోనా మ‌హ‌మ్మారితో ఆర్ధిక వ్య‌వ‌స్ధ కుదేల‌వ‌డంతో ల‌క్ష‌లాది ఉద్యోగాలు క‌నుమ‌రుగై నిరుద్యోగం ప్ర‌బ‌లిన ప‌రిస్ధితి నుంచి ప్ర‌పంచం తేరుకోవ‌డంతో నియామ‌కాలు మ‌ళ్లీ ఊపందుకున్నాయి. ఐటీ నుంచి నిర్మాణ రంగం, హెల్త్‌కేర్ నుంచి టూరిజం వ‌ర‌కూ హైరింగ్ జోరు క‌నిపిస్తోంది. మ‌రోవైపు మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌తో రిమోట్ వ‌ర్కింగ్‌తో ఇంటి నుంచే ప‌నిచేసిన వైట్ కాల‌ర్ ఉద్యోగులు జాబ్ మారేందుకు ఇదే అనువైన స‌మ‌యంగా భావిస్తున్నారు. అధిక వేత‌నం, ప‌నిగంట‌ల వెసులుబాటు అనుకూలంగా ఉంటే ద‌శాబ్ధాల అనుభ‌వం ఉన్న ఉద్యోగులు కూడా కెరీర్‌ను, ప‌నిచేస్తున్న కంపెనీని వ‌దిలి వేరే ఉద్యోగాలు చూసుకునేందుకు రిస్క్ చేస్తున్నారు. వ్యాక్సినేష‌న్ ముమ్మ‌రంగా జ‌రుగుతుండ‌టంతో వ్యాపారాలు గాడిన‌ప‌డి ఆయా కంపెనీలు ఇప్పుడు కొత్త నైపుణ్యాల‌ను వెతికే ప‌నిలో ప‌డ‌టం, మ‌రికొన్ని కంపెనీల‌ను సిబ్బంది కొర‌త వెంటాడుతుండ‌టంతో కొత్త జాబ్‌లు, కెరీర్‌ల దిశ‌గా ఉద్యోగులు యోచిస్తున్నారు.