తెదేపాకు రాజీనామా చేయనున్నారంటూ గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సరిగా స్పందించలేదు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు గురువారం ఆయన నివాసం వద్ద ప్రశ్నించగా దానిపై ఇప్పుడేమీ మాట్లాడనని చెప్పారు. అనుబంధ కమిటీలు, స్థానిక నాయకత్వంపై గత కొద్దిరోజులుగా బుచ్చయ్య చౌదరి అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతోంది. ఈ క్రమంలో దీనిపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా ఇప్పుడేమీ మాట్లాడనని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. ‘‘పార్టీకి సంబంధించి ప్రజలకు చెప్పాల్సినవి చెప్తాను. స్థానికంగా ఉన్న ఇబ్బందులు పెద్ద సమస్య కాదు. వాటిని లెక్క చేయను. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల సమస్యలు, అభిప్రాయాలు, పార్టీ నిర్మాణానికి సంబంధించి నా దృష్టికి వచ్చిన విషయాలు మాట్లాడతాను. త్వరలోనే అన్ని విషయాలు మీడియాకి తెలియజేస్తాను. ఇవన్నీ వ్యక్తిగత సమస్యలు కాదు. నన్ను కలిసిన నాయకులే చంద్రబాబును కలిసి మాట్లాడుతారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ అంతర్గత విషయాలు.. బయట మాట్లాడలేను. ఇది ఎవరినీ ప్రమోట్ చేయడానికి చేస్తున్నది కాదు. ముక్కుసూటిగా మాట్లాడే నైజం నాది.. ఏదైనా ఉంటే అందరినీ పిలిచి చెబుతాను. నాకు తెలుగుదేశం పార్టీతో 30 ఏళ్ల అనుబంధం ఉంది. సీనియర్ కార్యకర్తగా నీతివంతమైన పరిపాలన నుంచి వచ్చాను. ఆత్మగౌరవం, క్రమశిక్షణతో ఉన్నాను. రామారావు గారు అదే నేర్పించారు. ఈరోజు వరకు దాన్నే పాటించాను. రేపు ఆత్మగౌరవం కోసమే పోరాడతాను. పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నాను. నా వారసులు కుటుంబ సభ్యులు ఎవరూ పార్టీలో లేరు’’ అని బుచ్చయ్య చౌదరి తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. అసంతృప్తి విషయంపై ఆయనతో మాట్లాడారు. స్థానికంగా ఇబ్బందులుంటే తనకు చెప్పాలని సూచించారు.
గోరంట్ల గోడ దూకేస్తారా?
Related tags :