Politics

కేసీఆర్‌కు జస్టిస్.ఎన్.వి.రమణ అభినందనలు-తాజావార్తలు

కేసీఆర్‌కు జస్టిస్.ఎన్.వి.రమణ అభినందనలు-తాజావార్తలు

* అంత‌ర్జాతీయ వాణిజ్య వివాదాల మ‌ధ్య‌వ‌ర్తుల కేంద్రాన్ని హైద‌రాబాద్‌లో ఇవాళ ప్రారంభించారు. ఆ సెంట‌ర్‌కు చెందిన ట్ర‌స్ట్ డీడ్ రిజిస్ట్రేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ( CJI NV Ramana ) మాట్లాడారు. తెలంగాణ చ‌రిత్ర‌లోనూ, హైద‌రాబాద్ చ‌రిత్ర లోనూ ఈ రోజు గొప్ప‌దినంగా నిలిచిపోతుంద‌న్నారు. 3 నెల‌ల స‌మ‌యంలోనే త‌న క‌ల నిజ‌మ‌వుతుంద‌ని ఎన్న‌డూ ఊహించ‌లేద‌ని సీజే తెలిపారు. త‌న క‌ల నిజ‌మ‌య్యేలా చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌, సీజే హిమా కోహ్లీకి ఆయ‌న థ్యాంక్స్ తెలిపారు.

* అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు వశం చేసుకున్న తర్వాత అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందుకు తాలిబన్లలో కీలక నేతలుగా చెప్పుకుంటున్న వారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ కొనసాగుతున్నాయి. అయితే, గత కొన్ని నెలల నుంచి తాలిబన్ల సుప్రీం లీడర్‌ హైబతుల్లా అఖుంద్‌జాదా మాత్రం కనిపించడం లేదు. రెండు దశాబ్దాల తర్వాత అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న కీలక సమయం తర్వాత కూడా ఆయన జాడ కనిపించలేదు. దీంతో హైబతుల్లా ఎక్కడ ఉన్నాడనే విషయంపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఆయన పాకిస్థాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్నారని అంతర్జాతీయ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

* హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్‌లో నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ధనిక రాష్ట్రమన్న కేసీఆర్ ఏడేళ్లలో రూ.వేల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకుంది కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా బతికేందుకా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘ఈటల రాజేందర్‌తో 15 ఏళ్ల అనుబంధం ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హుజూరాబాద్‌ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కరోనాను అరికట్టేందుకు ఈటల రాజేందర్‌ అంకితభావంతో పనిచేశారు. కేసీఆర్‌ ఎన్నికలు వస్తేనే బయటకు వస్తారు.. లేకపోతే ఫామ్‌హౌస్‌లోనే ఉంటారు. రూ.1900 కోట్లతో వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వరకు సిమెంట్‌ రోడ్డు వేసిన ఘనత నరేంద్రమోదీది. రూ.6వేల కోట్లతో రామగుండంలో కిసాన్‌ యూరియాని కేంద్రం ఉత్పత్తి చేస్తోంది. బీసీల హక్కులను కాపాడేందుకు మోదీ కృషి చేస్తున్నారు. తెలంగాణలో మార్పునకు మొదటి అడుగు హుజూరాబాద్‌ నుంచే పడాలి. 2023లో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. హుజూరాబాద్‌లో భాజపా గెలిస్తే.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు వాళ్ల నియోజకవర్గాల్లో ఓడిపోతారు. తెరాస ఎమ్మెల్యేలు పోతే మంచి పథకాలు వస్తాయని ఆయా నియోజకవర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. ఈటల రాజేందర్‌ ఒక్కడు కాదు.. మేమంతా ఉన్నాం’’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

* నదీజలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటా కోసం నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లో బలమైన వాణి వినిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం నీటిపారుదల శాఖపై మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి.. బోర్డు సమావేశంలోని ఎజెండా అంశాలతోపాటు, రాష్ట్రం తరఫున ప్రస్తావించాల్సిన, లేవనెత్తాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించారు.

* ఏడేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని.. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులను దుర్వినియోగం చేశారని విమర్శించారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కిషన్‌రెడ్డి మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయిస్తోందని.. రాష్ట్రం మాత్రం ఇవ్వడం లేదని కిషన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుర్చీ, కుటుంబం కోసం దేనికైనా తెగిస్తారని విమర్శించారు.

* నకిలీ చలానాల కేసులో కడప సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ముగ్గురు డాక్యుమెంట్‌ రైటర్లను పోలీసులు అరెస్టు చేశారు. జింకా రామకృష్ణ, లక్ష్మీనారాయణ, గురుప్రకాశ్‌లను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ చలానాలతో వీరు రూ.కోటి 3 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించారు. నిందితుల నుంచి రూ.67 లక్షలను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, ప్రింటింగ్‌ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

* ప్రభుత్వ నిధులను దేవాలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావుదే న‌ని రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్‌రావు అన్నారు. దుబ్బాక పట్టణంలో సుమారు రూ.10 కోట్ల వ్య‌యంతో అత్యద్భుతంగా నిర్మించిన బాలాజీ దేవాలయంలో శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం జ‌రిగింది. ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసిన త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామికి మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

* ఏపీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సంక్షేమం పేరిట సంక్షోభం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం సీపీఎస్‌ రద్దు చేయకపోగా..ఉద్యోగుల పీఎఫ్ డబ్బుల్లో కోత విధిస్తోందని విమర్శించారు. 20వ తేదీ వచ్చినా ఇంకా 20శాతం మందికి వేతనాలు చెల్లించలేదన్నారు. రాష్ట్రంలో వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే.. ముఖ్యమంత్రి ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. ఉన్న పరిశ్రమలనే వెళ్లగొడుతుంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా పెరుగుతుందని రఘురామకృష్ణరాజు నిలదీశారు.

* డెల్టా వేరియంట్ల విజృంభణతో పలు ప్రపంచ దేశాల్లో వైరస్‌ మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నప్పటికీ.. కొత్త కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో కొద్దిరోజులుగా ఒకటిన్నర లక్షలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల పెరుగుదలతో పలు దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. జపాన్‌లోని కీలక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించగా, ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సెప్టెంబర్ చివరి వరకూ లాక్‌డౌన్ పొడిగించారు. ప్రపంచవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే ఏకంగా 7.23 లక్షల మందికి వైరస్‌ సోకింది. దాదాపు 11వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం అమెరికాలో వైరస్‌ ఉద్ధృతి మరింత తీవ్రంగా ఉంది. డెల్టా వేరియంట్లతో వైరస్‌ల బారిన పడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అమెరికాలో గురువారం ఒక్కరోజే 1.54 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. 967 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 3.82 లక్షలకు చేరింది.

* యశ్‌ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు. గతంలో వచ్చిన ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1’కి కొనసాగింపుగా రూపొందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టు శాటిలైట్ హక్కుల్ని ప్రముఖ సంస్థ ‘జీ’ భారీ మొత్తానికి కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తి చేశారు యశ్‌. ‘దక్షిణాది భాషలకు సంబంధించి కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2 శాటిలైట్‌ హక్కుల్ని ‘జీ’ సొంతం చేసుకుందని తెలియజేస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. సంజయ్‌ దత్‌, రావు రమేశ్‌, రవీనా టాండన్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అతి త్వరలోనే ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది.