ప్రపంచ మార్కెట్‌లపై తన నాసిరకం ఉత్పత్తులను గుమ్మరించి దండిగా వ్యాపారం చేసుకుంటున్న చైనా.. ఇటీవల ప్రపంచ దేశాలకు కరోనా వైరస్‌ను కూడా సప్లయ్ చేసింది. ఆ మహమ్మారి బారినుంచి బయటపడటానికి అగ్రరాజ్యం అమెరికా సహా అన్ని దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇదిలావుంటే చాపకింద నీరులా జరుగుతున్న మరో అనర్థానికి కూడా చైనా నిర్వాకమే కారణమని తేలింది. ఎందుకంటే కాలుష్యంవల్ల పురుషుల్లో అంగం పరిమాణం క్రమంగా తగ్గిపోతున్నదట. కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం వదులుతున్న చైనాదే ఈ పాపంలో ప్రధాన భాగమని చెప్పవచ్చు.
చైనాలోని కెమికల్, ఫార్మా పరిశ్రమల నుంచి వ్యర్థ రసాయనాలను ఆ దేశం నేరుగా సముద్రాల్లోకి వదులుతున్నది. దాంతో సముద్ర జలాల్లో కాలుష్యం పెరుగుతున్నది. దాంతో ప్రపంచ ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ అధిక కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలవల్ల మానవ శరీరంపై ప్రత్యక్ష ప్రభావం పెరిగిపోతున్నదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. కాలుష్యం కారణంగా భూమి ఉష్ణోగ్రతలు (భూతాపం) పెరిగి వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయని, పర్యావరణం నాశనమయ్యే ప్రమాదం కూడా ఉందని వారు చెబుతున్నారు. ప్రముఖ మహిళా పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ షన్నా స్వాన్ తాజాగా రాసిన కౌంట్ డౌన్ అనే పుస్తకంలో.. కొన్ని ఆసక్తికరమైన, ఆందోళనకరమైన విషయాలు తెలిపారు. ఆ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. కాలుష్యం కారణంగా మానవ పురుషాంగం సైజు క్రమంగా తగ్గిపోతున్నదట. ముందుముందు కూడా వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఇలాగే పెరిగితే జననేంద్రియాలు పూర్తిగా పనిచేయకపోయే ప్రమాదం కూడా ఉందట. ముఖ్యంగా ప్లాస్టిక్ రేణువుల్లోని థాలెట్ అనే మూలకంవల్ల సంతానోత్పత్తి రేటు తగ్గుతుందట. థాలేట్ అనేది ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే రసాయనం. ఈ రసాయనం హార్మోన్‌ను ఉత్పత్తి చేసే ఎండోక్రైన్ వ్యవస్థను ప్రభావితం చేస్తుందట. అంతేగాక, మన ఆధునిక ప్రపంచం స్పెర్మ్ కౌంట్‌ను, స్త్రీ, పురుష పునరుత్పత్తి అభివృద్ధిని, మానవ జాతి భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని డాక్టర్ షన్నా స్వాన్ తన కౌంట్ డౌన్ పుస్తకంలో పేర్కొన్నారు. తన తాజా పరిశోధనల్లో ఎలుకలలో థాలేట్ సిండ్రోమ్‌ను పరిశీలించినట్లు ఆమె తెలిపారు. థాలెట్ రసాయనంవల్ల రానురాను శిశువులు కుంచించుకుపోయిన జననేంద్రియాలతో పుట్టే అవకాశం ఉందని ఆ పరిశోధనలో తేలినట్లు చెప్పారు. థాలేట్ జననేంద్రియాల అభివృద్ధికి నిరోధంగా మారుతుందని పేర్కొన్నారు.