తాలిబన్ల అగ్రనేతగా ఉన్న షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ ( Mohammad Abbas Stanikzai ) ఒకప్పుడు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందాడు. 1982లో ఆఫ్ఘన్ సైన్యం తరపున అతను శిక్షణ తీసుకున్నాడు. అప్పుడు అతని బ్యాచ్‌మేట్స్ అబ్బాస్‌ను షేరూ అని పిలిచేవారు. ప్రస్తుతం తాలిబన ఉగ్ర సంస్థను నడిపిస్తున్న ఏడుగురిలో షేరూ ఒకరు. ఇండియాలోనై సైనిక శిక్షణ పొందిన అబ్బాస్ గురించి అతని బ్యాచ్‌మేట్స్ ఆసక్తికర విషయాలు చెప్పారు. స్టానిక్‌జాయ్ శారీరకంగా దృఢంగా ఉండేవాడని, మతపరమైన భావాలు ఎక్కువగా ఉండేవి కావని, 20 ఏళ్ల వయసులో అతను శిక్షణ కోసం వచ్చాడని, అతనితో పాటు 45 మంది విదేశీయులు ఇండియన్ మిలిటరీ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నట్లు ఓ కథనం ద్వారా తెలుస్తోంది.
అకాడమీలో షేరూ కొంత వయసు ఎక్కువ ఉన్న వ్యక్తిగా కనబడేవాడు, మీసాలతో అట్రాక్ట్ చేసేవాడని, ఆ సమయంలో అతనికి విప్లవ భావాలు లేవని, అతనో సగటు ఆఫ్ఘన్ క్యాడెట్ అని, ఆనాటి బ్యాచ్‌మేటి మేజర్ జనరల్ ఏడీ చతుర్వేది తెలిపారు. షేరూతో బ్యాచ్‌మేట్‌గా ఉన్న కల్నల్ కీసర్ సింగ్ షెకావత్ కూడా ఆ రోజుల్ని గుర్తుచేసుకున్నాడు. డెహ్రాడూన్‌లో ప్రతి వారం చివరల్లో నది ప్రాంతానికి ట్రిప్‌కు వెళ్లేవాళ్లమని కల్నల్ కీసర్ తెలిపారు. అబ్బాస్‌తో కలిసి రిషికేశ్‌కు వెళ్లి గంగా నదిలో స్నానం చేసినట్లు ఆయన చెప్పారు.
1996లో అబ్బాస్ స్టానిక్‌జాయ్.. ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీకి గుడ్‌బై చెప్పాడు. ఆ తర్వాత అతను తాలిబన్‌లో చేరాడు. అయితే తాలిబన్లకు దౌత్యపరమైన హోదా ఇవ్వాలంటూ ఆయన వాషింగ్టన్‌కు వెళ్లి క్లింటన్‌ను వేడుకున్నారు. కానీ అతని ప్రయత్నాలు ఫలించలేదు. ఆఫ్ఘన్ ప్రభుత్వంతో చర్చలు జరిపిన అబ్దుల్ హకిమ్ హక్కానీ గ్రూపుకు మధ్యవర్తిగా కూడా చేశాడు. షేరూకు ఆంగ్ల భాషపై పట్టు బాగా ఉంది. మిలిటరీ శిక్షణలోనూ అతను ఆరితేరిపోయాడు. ఆ అనుభవంతోనే అతను ఇప్పుడు తాలిబన్లలో కీలక సభ్యుడిగా ఎదిగాడు. 2015లో ఖతార్‌లోని తాలిబన్ పొలిటికల్ ఆఫీసు అధిపతిగా అతను నియమితుయ్యాడు.