* ప్రముఖ దేశీయ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ సలీల్ పరేఖ్‌కు కేంద్ర ఆర్థికశాఖ సమన్లు జారీ చేసింది. ఆదాయపు పన్నుకు సంబంధించిన కొత్త వెబ్ పోర్టల్ ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా.. ఇంకా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు హాజరు కావాలని తెలిపింది. నిన్నటి నుంచి ఐటీ పోర్టల్ అందుబాటులో లేని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది. కొత్త వెబ్‌పోర్టల్‌ను ఇన్ఫోసిస్ అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.
* సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎమ్‌ఈలు) దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివని, తమ ప్రభుత్వం ఆ రంగానికి సరైన ప్రాధాన్యాన్ని కల్పిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శనివారం ఎంఎస్‌ఎమ్‌ఈల కోసం ‘ఉభర్‌తే సితారే నిధి’ని ఆమె ప్రారంభించారు. ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా దేశం అవతరించేందుకు ఈ నిధి దోహదం చేస్తుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఎగ్జిమ్ బ్యాంక్, సిడ్బీ కలిసి ఈ నిధిని ఏర్పాటు చేశాయి. సాంకేతికత, ఉత్పత్తులు, ఎగుమతుల పరంగా వృద్ధి చెందేందుకు అవకాశాలుండి సరైన ప్రదర్శనను కనబర్చలేకపోతున్న ఎంఎస్‌ఎమ్‌ఈలను గుర్తించడమే ఈ నిధి ఏర్పాటు వెనక ప్రభుత్వ ఉద్దేశం. గత రెండేళ్లలో ఎంఎస్‌ఎమ్‌ఈ రంగానికి సంబంధించి పలు చర్యలను చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. ‘ఎంఎస్‌ఎమ్‌ఈల నిర్వచనాన్ని ప్రభుత్వం మార్చి, దానిని సులభతరం చేసింది. ఎంఎస్‌ఎమ్‌ఈలకు నేరుగా ప్రయోజనం కలగజేసే ఓ బిల్లును పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టామ’ని ఆమె అన్నారు.
* దాదాపు గత నెలరోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గడం విశేషం. లీటర్ పెట్రోల్‌పై 14పైసలు, డీజిల్‌పై 18 పైసలు తగ్గించారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.69, డీజిల్ ధర రూ.97.15కు చేరింది. ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గడంతో దేశీయ విక్రయ సంస్థలు తగ్గింపు నిర్ణయం తీసుకున్నాయి. ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజీలో అక్టోబర్ కాంట్రాక్టుకు బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 66.72 డాలర్లుగా పలుకుతోంది.
* దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ త్వరలో మార్కెట్‌లో ఆవిష్కరించనున్న హెచ్బీఎక్స్ మైక్రో ఎస్‌యూవీకి టాటా హెచ్బీఎక్స్ అని పేరు పెట్టింది. హెచ్బీఎక్స్ మానికర్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న టాటా మైక్రో ఎస్‌యూవీ.. కాన్సెప్ట్ కారును గతేడాది ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. 2019 జెనీవా మోటార్ షోలో వెలుగు చూసిన హెచ్2ఎక్స్ కాన్సెప్ట్ నుంచి హెచ్బీఎక్స్ మోడల్ వచ్చింది. టాటా మోటార్స్.. హెచ్బీఎక్స్ మోడల్ కారుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఎంట్రీ లెవల్ కార్ల రంగంలో టాటా మోటార్స్‌కు ఇది గేమ్ చేంజర్‌గా నిలువనున్నది. ప్రత్యేకించి మారుతి సుజుకి, రెనాల్ట్, మహీంద్రాలకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.