Devotional

కేదార్‌నాథ్ అర్చకుల ధర్నా-తాజావార్తలు

కేదార్‌నాథ్ అర్చకుల ధర్నా-తాజావార్తలు

* దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 30,948 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం పేర్కొంది. తాజాగా 38,487 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 403 మంది వైరస్‌ ప్రభావంతో మృత్యువాతపడ్డారు. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,24,24,234 కు పెరిగింది. ఇందులో 3,16,36,469 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 3,53,398 ఉన్నాయి. వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 4,34,367 మంది ప్రాణాలు కోల్పోయారు. టీకా డ్రైవ్‌లో భాగంగా 58,14,89,377 డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. ఇదిలా ఉండగా నిన్న ఒకే రోజు 15,85,681 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. మొత్తం 50,62,56,239 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.

* కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కొవిడ్‌కు వ్యతిరేకంగా పలు దేశాల్లో టీకాల పంపిణీ పూర్తి కాగా.. మరికొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతున్నది. ప్రస్తుతం బూస్టర్‌ డోస్‌ (మూడో డోసు)పై చర్చ సాగుతున్నది. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా స్పందించారు. బూస్టర్‌ డోస్‌పై ప్రస్తుతం భారత్‌లో అవసరమైన డేటా లేదని, అయితే వచ్చే ఏడాది మొదటట్లో సమాచారం అందుబాటులో ఉండే అవకాశం ఉందన్నారు. యూఎస్‌, యూకే, ఇజ్రాయెల్‌ సహా అనేక దేశాలు మహమ్మారిపై పోరాడేందుకు ప్రజలకు బూస్టర్‌ డోసులు వేయాలని యోచిస్తున్నాయి.

* మానవ అవయవాలను ఒక్కొక్కటిగా తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. ఇప్పుడు ఏకంగా మెదడునే అభివృద్ది చేశారు. స్టెమ్‌ సెల్స్‌ నుంచి ల్యాబ్‌లో కృత్రిమంగా మానవుడి మెదడును (Artificial Human Brain) జర్మన్‌ శాస్త్రవేత్తలు సృష్టించారు. వీటిలో కళ్ళు కూడా అభివృద్ధి చేశారు. 60 రోజుల్లో దాదాపు 314 మినీ బ్రెయిన్లను తయారు చేసినా.. రక్త సరఫరా లేకపోవడం వల్ల చాలా వరకు మనుగడ సాధించలేకపోయాయి. ఈ మినీ మెదడులోని కళ్లు 5 వారాల పిండంలా అభివృద్ధి చెందినట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భవిష్యత్‌లో దీని నుంచి అనేక కొత్త విషయాలు వెల్లడవడమే కాకుండా, అనేక వ్యాధుల చికిత్సలో ముందడుగు కానున్నదనడంలో ఎలాంటి ఔచిత్యం లేదు. ఈ మినీ బ్రెయిన్‌ను జర్మనీలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ జెనెటిక్స్ పరిశోధకులు తయారు చేశారు. ఈ పరిశోధన విషయాలను ‘సెల్ స్టెమ్’ జర్నల్‌లో ప్రచురించారు.

* ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ కేదార్‌నాథ్‌ ఆలయం అర్చకులు ధర్నా చేశారు. ఆదివారం ఆలయం ఎదుట నిరసన తెలిపారు. చార్ ధామ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని కేదార్‌నాథ్ తీర్థ్ పురోహిత్ సమాజ్ డిమాండ్ చేసింది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం గత ఏడాది ఉత్తరాఖండ్ చార్‌ ధామ్ దేవస్థానం బోర్డు బిల్లును ఆమోదించింది. కాగా, జమ్ముకశ్మీర్‌లోని వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి బాలాజీ పుణ్యక్షేత్రం (టీటీడీ) బోర్డు తరహాలో అర్చకుల సాంప్రదాయ హక్కులను ఈ బిల్లు హరిస్తున్నదని, బోర్డును ప్రభుత్వం తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నదని అర్చకులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ చార్‌ ధామ్‌ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గత రెండు నెలలుగా అర్చకులు నిరసనలు తెలుపుతున్నారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతూ రక్తంతో రాసిన లేఖను కూడా పంపారు.

* అగ్రి గోల్డ్ బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర స్ధాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ.. ఆర్బీఐ నిబంధనలకి విరుద్ధంగా టిడిపి ప్రభుత్వ హయాంలో అగ్రి గోల్డ్ను ప్రారంభించారని తెలిపారు. అగ్రి గోల్డ్ యాజమాన్యంతో టిడిపి ప్రభుత్వం కుమ్మక్కై బాధితులకి ‌అన్యాయం చేశారాని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కడా ప్రైవేట్ సంస్ధ మూసేస్తే బాధితులకి ప్రభుత్వం న్యాయం చేసిన దాఖలాలు లేవు అని ఆయన అన్నారు.

* టీడీపీ నేత నారా లోకేష్‌ తీరుపై ఆంధ్రప్రదేశ్‌ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా ఏటి అగ్రహారం ఘటనను లోకేష్‌ తప్పుగా చిత్రీకరిస్తున్నారని పేర్కొంది. కానిస్టేబుల్‌పై ఫిర్యాదు రాగానే సస్పెండ్ చేశామని పోలీసు అధికారుల సంఘం ఆదివారం తెలిపింది. కాగా లోకేష్‌ తప్పుడు ప్రచారం ఎంతవరకు సమంజసమని పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు ప్రశ్నించారు.

* నీటి కేటాయింపులు లేకుండా శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుదుత్పత్తి చేయకూడదంటూ కృష్ణా బోర్డు జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ సర్కార్‌ యథేచ్ఛగా తుంగలో తొక్కుతోంది. కృష్ణా బోర్డు అనుమతి లేకుండా శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేయకూడదని కేంద్ర జల్‌ శక్తి శాఖ జారీ చేసిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తోంది. నీటి సంవత్సరం ప్రారంభం నుంచే (జూన్‌ 1 నుంచి) ఎడమ గట్టు కేంద్రంలో అక్రమంగా నీటిని వాడుకుంటూ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు దిగువన అటు తెలంగాణ, ఇటు ఏపీకి సంబంధించి తక్షణ సాగు, తాగునీటి అవసరాలు లేవు. ఎగువ నుంచి నీటిని దిగువకు విడుదల చేయాల్సిన అవసరమూ లేదు. కానీ.. తెలంగాణ సర్కార్‌ అదేమీ పట్టకుండా ఎడమ గట్టు కేంద్రంలో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ రోజూ సగటున 3.15 టీఎంసీలను అక్రమంగా వాడుకుంటోంది. దీంతో దిగువకు వదిలేసిన జలాలు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి చేరుతున్నాయి. కొద్దిపాటి నీరు కృష్ణా డెల్టాకు విడుదల చేయగా, మిగులుగా ఉన్న నీటినంతటినీ గేట్లు ఎత్తేసి దిగువకు వృథాగా వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలా జూన్‌ 1 నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు 162.76 టీఎంసీలు సముద్రంలో కలవడం గమనార్హం.

* నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం పర్యటించారు. వెంకటగిరిలో జగనన్న కాలనీని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. తొలివిడతలో ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న మహిళా లబ్ధిదారులతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. దశాబ్దాల కాలం నాటి తమ సొంతింటి కల సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆజన్మాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా పేద మహిళా లబ్ధిదారులు తెలిపారు. అనంతరం వెంకటగిరిలో వైఎస్సార్ సీపీ నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఇంట్లో శుభకార్యానికి సజ్జల రామకృష్ణారెడ్డి హజరయ్యారు.

* మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రధాన అనుచరుడు, కరీంనగర్ కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ షాకిచ్చారు. ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ భావజాలలలో ఇమడలేక పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు.